Telecom Companies Likely To Hike Tariff: చాలా కాలం తర్వాత, ద్రవ్యోల్బణం (Inflation) దెబ్బ నుంచి మన దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకోవడం ప్రారంభించారు. అయితే, మీ జేబుకు చిల్లుపడే మరో సమస్య త్వరలోనే ఎదురుకావచ్చు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త షాక్‌ తగలొచ్చు.


టారిఫ్‌ పెంచే ప్లాన్‌లో టెలికాం కంపెనీలు!
మన దేశంలో ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్‌ జియో ‍‌(Reliance Jio), ఎయిర్‌టెల్‌ (Airtel) తమ టారిఫ్‌లు పెంచే యోచనలో ఉన్నాయని సమాచారం. మన దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) పూర్తైన తర్వాత, ప్లాన్‌ రేట్లను పెంచుతూ ఈ కంపెనీలు ఏ నిమిషంలోనైనా ప్రకటన చేయవచ్చు. ఇదే జరిగితే, జూన్‌లో ముగిసే ఎన్నికల తర్వాత మొబైల్ ఫోన్ల వాడడం మరింత ఖరీదుగా మారుతుంది.


ఇటీవల, యాంటిక్ స్టాక్ బ్రోకింగ్‌ను ఉటంకిస్తూ పీటీఐ ఈ వార్తను రిపోర్ట్ చేసింది. రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ ప్లాన్‌ రేట్లను పెంచవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. ఎన్నికల తర్వాత ఈ టెలికాం కంపెనీలు 15 నుంచి 17 శాతం వరకు టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే, టెలికాం కంపెనీలు దీనిపై ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు.


యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ చెప్పిన ప్రకారం.. టారిఫ్‌లు పెంచడం వల్ల టెలికాం కంపెనీలు లాభపడబోతున్నాయి. భారతి ఎయిర్‌టెల్ అతి పెద్ద లబ్ధిదారుగా ఉంటుంది. ఎయిర్‌టెల్ ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ARPU) ప్రస్తుతం 208 రూపాయలుగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 286 రూపాయలకు పెరగొచ్చని అంచనా. యాంటిక్ స్టాక్ బ్రోకింగ్‌ నివేదిక ప్రకారం, జియో ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో అతి పెద్ద కంపెనీ. గత 5-6 సంవత్సరాల్లోనే జియో మార్కెట్ వాటా 21.6 శాతం నుంచి 39.7 శాతానికి పెరిగింది.


మూడు సర్కిళ్లలో కలిపి కోటి మందికి పైగా 5G వినియోగదార్లను యాడ్‌ చేసుకున్నట్లు భారతి ఎయిర్‌టెల్ ఇటీవల ప్రకటించింది. తమిళనాడులో 5.9 మిలియన్ల (59 లక్షల మంది) 5G యూజర్లు, గుజరాత్‌లో 3 మిలియన్ల (30 లక్షలు) యూజర్లు, జమ్ముకశ్మీర్ & లద్దాఖ్‌లో 1.2 మిలియన్ల (12 లక్షలు) వినియోగదార్లు తమ యూజర్‌ బేస్‌లో చేరినట్లు వెల్లడించింది.


జూన్ మొదటి వారం వరకు ఎన్నికలు 
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్‌ ఈ రోజు (19 ఏప్రిల్‌ 2024 ) నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ జూన్ మొదటి వారంలో పూర్తవుతుంది. జూన్ 01న చివరి (ఏడో) దశ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 04న వెల్లడవుతాయి.


ఈ ఏడాది మార్చి నెలలో, ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 మార్చి నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ రేట్‌ 5 శాతం దిగువకు వచ్చింది.


మరో ఆసక్తికర కథనం: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి