Small Saving Scheme New Rules 2024: సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలంటే, ముందుగా వాటి రూల్స్ తెలుసుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ చెప్పిన ప్రకారం, చిన్న మొత్తాల పొదుపు పథకాల కింద ఖాతా ప్రారంభించాలంటే ఆధార్ తప్పనిసరి. వాస్తవానికి ఈ రూల్‌ను ఏడాది క్రితమే కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.
గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ జనరల్ (అమెండ్‌మెంట్) రూల్స్ 2023 ప్రకారం... ఒక వ్యక్తి, చిన్న మొత్తాల పొదుపు/ పెట్టుబడి ఖాతాను తెరిచిన తేదీ నుంచి ఆరు నెలల లోపు, తన ఆధార్ నంబర్‌ను సంబంధిత ఆఫీస్‌లో ఇవ్వాలి, అకౌంట్‌లో అప్‌డేట్ చేయించాలి. గడువు లోపు ఇలా జరక్కపోతే, ఆధార్ నంబర్ ఇచ్చేవరకు ఆ ఖాతాను తాత్కాలికంగా నిలిపేస్తారు, లావాదేవీలకు అనుమతించరు.
కొన్ని ఖాతాల విషయంలో పాన్ (PAN) కూడా ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఖాతాను తెరిచే సమయంలో PAN ఇవ్వలేకపోతే, రెండు నెలల లోగా దానిని సమర్పించాలి. లేకపోతే, PAN ఇచ్చేవరకు ఆ ఖాతాను తాత్కాలికంగా ఫ్రీజ్ చేస్తారు. ఆధార్, పాన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్, తప్పుడు గుర్తింపు వంటి కేసులను తగ్గించాలన్ని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతి త్రైమాసికం ప్రారంభానికి ముందు, కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభం నుంచి కూడా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వడ్డీలను నిర్ణయించింది. ఈ రేట్లు 2024 ఏప్రిల్ 01 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయి.
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు (Small Saving Scheme Interest Rates From 01 April 2024)
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana Interest Rate) ---- వడ్డీ రేటు 8.20 శాతం
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS Interest rate) ---- వడ్డీ రేటు 8.20 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC Interest rate) ---- వడ్డీ రేటు 7.70 శాతం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Interest rate) ---- వడ్డీ రేటు 7.10 శాతం
కిసాన్ వికాస్ పత్ర (KVP Interest rate) ---- వడ్డీ రేటు 7.50 శాతం (115 నెలల మెచ్యూరిటీ కాలం)
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS Interest rate) ---- వడ్డీ రేటు 7.40 శాతం
పొదుపు ఖాతా ---- వడ్డీ రేటు 4.00 శాతం
1 సంవత్సరం టైమ్ డిపాజిట్ ---- వడ్డీ రేటు 6.90 శాతం
2 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.00 శాతం
3 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.10 శాతం
5 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.50 శాతం
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ ---- వడ్డీ రేటు 6.70 శాతం
వాస్తవానికి, పాత వడ్డీ రేట్లనే కేంద్ర ప్రభుత్వం జూన్ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) కొనసాగిస్తోంది. ఈ ఏడాది మార్చి (జనవరి-మార్చి) త్రైమాసికంలో ఇవే వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: జూన్ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!