Income Tax Return Filing 2024: మరో నెలన్నరలో ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఫైలింగ్ సీజన్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఫామ్-16 తీసుకుంటున్నారు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇవ్వడం ప్రారంభిస్తాయి. 2024-25 అసెస్‌మంట్ ఇయర్‌లో (AY 2024-25) ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు చివరి తేదీ 31 జులై 2024. ఈ గడువు తర్వాత ఆలస్య రుసుముతో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.
ఫారం-16 మాత్రమే పనిచేయదు
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ (IT Notice) వస్తుంది. కాబట్టి, ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి ముందే కొన్ని కీలక డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. టాక్స్‌పేయర్‌కు జీతం/వ్యాపార ఆదాయం/రెమ్యునరేషన్ రూపంలోనే కాకుండా, వారికి తెలీకుండానే మరికొన్ని మార్గాల నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది. కాబట్టి, ITR ఫైలింగ్ సమయంలో ఫామ్-16 ఒక్కటే సరిపోదు.
జీతం కాకుండా ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయాల (Income from other resources) గురించి తెలుసుకోవడానికి AIS & TIS సాయం చేస్తాయి. ఇన్‌కమ్ డిక్లరేషన్‌కు ముందు వీటిని కూడా కచ్చితంగా చూడమని ఆదాయపు పన్ను విభాగం చెబుతోంది. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పారదర్శకత తీసుకురావడానికి, పన్ను చెల్లింపుదార్ల సెల్ఫ్-ఫైలింగ్‌ను సులభతరం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఈ రెండింటినీ ప్రవేశపెట్టింది. ఫామ్-16తో పాటు ఈ రెండు పత్రాలను కూడా చూడడం వల్ల, ఫైలింగ్‌లో తప్పులు జరిగే అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయి. ఫలితంగా, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ బెడద ఉండదు.
AIS, TIS అంటే ఏంటి, ఎలా చూడాలి?
AIS (Annual Information Statement) అంటే వార్షిక సమాచార నివేదిక . TIS (Taxpayer Information Summary) అంటే పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం. ఒక పన్ను చెల్లింపుదారు సంపాదించిన మొత్తం ఆదాయ వివరాలు AIS, TISలో ఉంటాయి. మీకు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే, మూడు నెలలకు ఒకసారి కొంత డబ్బు వడ్డీ రూపంలో మీ అకౌంట్‌లో (Interest Income from Savings Account) జమ అవుతుంది. మీ బ్యాంక్ నేరుగా ఆ డబ్బును మీ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తం కాబట్టి, మీకు తెలియొచ్చు/తెలీకపోవచ్చు. దీంతోపాటు.. రికరింగ్ డిపాజిట్ మీద వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద వడ్డీ, సెక్యూరిటీల లావాదేవీలు, డివిడెండ్ రూపంలో అందిన డబ్బు (Income From Dividend), మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన మొత్తం, ఇలాంటి వివరాలన్నీ ఆ డాక్యుమెంట్స్‌లో ఉంటాయి.
సింపుల్‌గా చెప్పాలంటే.. పన్ను విధించదగిన ఆదాయం మొత్తం సమాచారం AISలో ఉంటుంది. జీతం నుంచి కాకుండా ఇతర మూలాల నుంచి వచ్చిన ప్రతి ఆదాయ వివరం అందులో కనిపిస్తుంది. AIS సారాంశమంతా TISలో ఉంటుంది.
AIS/TIS ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AIS/TIS?)
ఆదాయ పన్ను ఫైలింగ్ పోర్టల్ (www.incometax.gov.in) ఓపెన్ చేయండి.
పాన్ నంబర్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
అప్పర్ మెనులో సర్వీసెస్ ట్యాబ్‌కు వెళ్లండి.
డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'Annual Information Statement (AIS)' ఎంచుకోండి.
ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే ప్రత్యేక విండో ఓపెన్ అవుతుంది.
కొత్త విండోలో AIS ఆప్షన్ ఎంచుకోండి.
ఇప్పుడు AIS, TIS రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
AIS, TISను PDF లేదా JSON ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు (Individuals), హిందూ అవిభాజ్య కుటుంబాలకు (HUFs), వారి పొదుపు ఖాతా ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై, రూ. 10,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80TTB వర్తిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం.. బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌ల్లో సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, బాండ్‌లు/NCDలు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) కింద చేసే డిపాజిట్‌లు సహా వివిధ రకాల డిపాజిట్‌ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 మినహాయింపును సీనియర్ సిటిజన్లు క్లెయిమ్ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ సెక్షన్, మిగిలిన వాళ్ల కంటే రూ.50 వేలు ఎక్కువ పన్ను ఆదా