Income Tax On IAS IPS Salaries In Telugu: భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఐఏఎస్ (Indian Administrative Service), ఐపీఎస్‌ (Indian Police Service) అగ్రస్థానంలో ఉంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాప్ ర్యాంక్‌ సాధించిన అభ్యర్థులకు ఇచ్చే ఈ ఉద్యోగాలు అనేక సౌకర్యాలతో పాటు భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తాయి. IASకు ఎంపికైన అభ్యర్థులు ఉప కలెక్టర్‌, సహాయ కలెక్టర్‌, కలెక్టర్‌, శాఖ కార్యదర్శి, ఏదైనా ప్రత్యేక సంస్థ/మిషన్‌ డైరెక్టర్‌, జాయింట్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీ వంటి పదవులను క్రమంగా చేపడతారు. IPSకు ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్‌/ అడిషనల్‌ సూపరిడెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ASP), సూపరిడెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (SP), సీనియర్ సూపరిడెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (SSP), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG), ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) వంటి శిఖరాలను అధిరోహిస్తారు. ఏ పదవిలో ఉన్నప్పటికీ, IAS/ IPSల జీతాలు పన్ను రహితంగా ఉంటాయా లేదా ఇతర ఉద్యోగుల మాదిరిగానే వాళ్లు కూడా జీతం నుంచి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలా అన్నది చాలామందిలో ఉండే సందేహం.


IAS/ IPS జీతం ఎంత ఉంటుంది?
IAS, IPSల జీతం, వాళ్లు పని చేస్తున్న హోదాను బట్టి పే కమిషన్ ద్వారా నిర్ణయమవుతుంది. ప్రస్తుతం దేశంలో 7వ వేతన సంఘం ప్రకారం జీతభత్యాలు అమలులో ఉన్నాయి. దీని కింద, IAS లేదా IPS ప్రారంభ వేతనం నెలకు రూ. 56,100. జీతం కాకుండా, ఈ అధికారులు ప్రతి నెలా ట్రావెల్‌ అలవెన్స్‌ (TA), డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA), హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (HRA), మొబైల్ అలవెన్స్‌ సహా మరికొన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. వారి స్థాయి/ స్థానం పెరిగే కొద్దీ జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగం నుంచి పదవీ విరమణ నాటికి, ప్రస్తుత లెక్కల ప్రకారం, ఒక IAS అధికారి జీతం 2,25,000 రూపాయలకు చేరుతుంది.


IAS/ IPS జీతంపై టాక్స్‌ రూల్స్‌ ఎలా ఉన్నాయి?
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీతాలపై ఆదాయ పన్ను ఉండదని చాలా మంది భావిస్తున్నారు. అది నిజం కాదు. ఈ అధికారులకు ప్రత్యేక మినహాయింపు ఏమీ లేదు. జీతం తీసుకుంటున్న అందరు ఉద్యోగుల్లాగే, IAS/ IPS కూడా శ్లాబ్‌ సిస్టమ్‌ ఆధారంగా పన్ను చెల్లించాలి.


ఎంత పన్ను వసూలు చేస్తారు?
భారతదేశంలో ఉద్యోగులందరికీ వర్తించే పన్ను నియమాలే IAS/ IPSకూ వర్తిస్తాయి. కొత్త పన్ను విధానం ప్రకారం... 
ఒక వ్యక్తి వార్షికాదాయం రూ. 3-7 లక్షల మధ్య ఉంటే, అతని ఆదాయంపై 5% పన్ను విధిస్తారు. 
ఆదాయం రూ. 7 - 10 లక్షల వరకు ఉంటే, 10% పన్ను 
ఆదాయం రూ. 10 - 12 లక్షలు అయితే, 15% పన్ను 
ఆదాయం రూ.12 - 15 లక్షల వరకు ఉంటే, 20% పన్ను
రూ. 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను విధిస్తారు. 


ఈ లెక్కన. IAS అధికారి ప్రారంభ వేతనం నెలకు రూ. 56,100 అయితే, కొత్త పన్ను విధానం ప్రకారం, అతను 5% పన్ను చెల్లించాలి. జీతం రూ. 2,25,000 అయితే, అతను 30% పన్ను కట్టాలి.


మరో ఆసక్తికర కథనం: రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్- ఉచితంగా "అమరన్‌, లక్కీ భాస్కర్" సహా లేటెస్ట్ సినిమాలు