Health Insurance Related To Heart Disease: లాన్సెట్ సర్వే ప్రకారం, ప్రపంచంలో హృదయ సంబంధ వ్యాధుల సంబంధిత మరణాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. గుండె జబ్బులకు ప్రారంభ దశలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే.. మందులు, ఆసుపత్రిలో చికిత్స సహా అన్ని వ్యయాలను సమగ్ర ఆరోగ్య బీమా (comprehensive health insurance) కింద కవర్ చేయవచ్చు.


సమగ్ర ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, కొన్ని క్లెయిమ్‌లను కంపెనీ రిజెక్ట్‌ చేస్తుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి:


1. ముందుగా ఉన్న వ్యాధులను (PED) వెల్లడించకపోవడం
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు, అప్పటికే ఉన్న అనారోగ్య పరిస్థితులు/వ్యాధుల గురించి కంపెనీకి చెప్పడం మంచిదని ఇన్సూరెన్స్‌ స్పెషలిస్ట్‌లు చెబుతున్నారు. నిజాలు దాచి పాలసీ తీసుకుంటే, భవిష్యత్తులో క్లెయిమ్‌ తిరస్కరణకు గురికావచ్చు. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు (BP), రక్తంలో అధిక చక్కెర స్థాయిలు (high blood sugar levels) వంటి వాటన్నింటినీ ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బహిర్గతం చేయాలి.


2. నిరీక్షణ వ్యవధిలో (Waiting Period) క్లెయిమ్ చేయడం
ఆరోగ్య బీమా పాలసీల్లో, నిర్దిష్ట వ్యాధులకు వెయిటింగ్‌ పిరియడ్స్‌ ఉంటాయి. వీటిలో హృదయ సంబంధ వ్యాధులు కూడా ఉంటాయి. ఈ వెయిటింగ్ పిరియడ్ పూర్తయ్యేలోపు క్లెయిమ్‌ చేస్తే మీ బీమా కంపెనీ దానిని తిరస్కరిస్తుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి తనకు గుండె జబ్బు ఉందని చెబితే, బీమా కంపెనీ, బీమా తీసుకున్న రోజు నుంచి మూడు సంవత్సరాలు వెయిటింగ్‌ పిరియడ్‌ను ఇస్తుంది. ఆ వ్యక్తి మూడు సంవత్సరాల లోపు గుండె జబ్బు చికిత్స కోసం క్లెయిమ్ చేసేందుకు వీలుండదు, మూడేళ్లు దాటిన తర్వాత ఎప్పుడైనా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కాబట్టి, మెడికల్‌ హిస్టరీ ఉన్న వ్యక్తులు బీమా తీసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్‌ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించుకునేందుకు కంపెనీ నుంచి రైడర్స్‌ను తీసుకోవచ్చు.


3. నిర్దిష్ట చికిత్సలు
కొన్ని ఆరోగ్య బీమాలు నిర్దిష్ట చికిత్సలు, మందులను కవర్ చేయకపోవచ్చు. చాలా గుండె జబ్బు చికిత్సలు ప్రామాణిక ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చినప్పటికీ... కొన్ని ఖరీదైన & అరుదైన చికిత్సలు కొన్ని పథకాల పరిధిలో ఉండవు. కాబట్టి, పాలసీని కొనుగోలు చేసే ముందు అలాంటి మినహాయింపుల క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. 


క్లెయిమ్‌ తిరస్కరణ అవకాశాలను తగ్గించే చిట్కాలు
గుండె జబ్బు చికిత్సకు సంబంధించిన క్లెయిమ్ తిరస్కరణకు కంపెనీకి ఛాన్స్‌ ఇవ్వకూడదనుకుంటే.. 1. బీమా తీసుకునే ముందు పాలసీహోల్డర్‌ ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా కంపెనీకి వెల్లడించాలి, 2. పాలసీ కవరేజీపై అవగాహన ఉండాలి, 3. వెయిటింగ్ పీరియడ్‌పై అవగాహన ఉండాలి, 4. మీ అవసరానికి సరిపోయే ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి, 5. చికిత్స కోసం నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలి.


బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయితే మీరు ఏం చేయాలి?
మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తే... ముందుగా, రిజెక్షన్‌ లెటర్‌ను జాగ్రత్తగా చదివి కారణాలను అర్థం చేసుకోవాలి. ఏదైనా డాక్యుమెంట్‌ లేకపోవడం వల్ల క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయితే, ఆ డాక్యుమెంట్‌ను సమర్పించి మరోమారు ఇన్సూరెన్స్‌ కంపెనీకి అప్పీల్ చేయవచ్చు. బీమా కంపెనీని సంప్రదించిన తర్వాత కూడా పాలసీదారు అసంతృప్తిగా ఉంటే, బీమా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే, కోర్టులో కేసు పెట్టవచ్చు.


స్పష్టీకరణ: ఈ వార్త సమాచారం కోసమే. ఆరోగ్య బీమా సంబంధిత నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఒక్క చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుర్తింపు - 'గేమ్‌ ఛేంజర్‌'ను ఆవిష్కరించిన రిలయన్స్‌