PPF Vs VPF Full Details: భవిష్యత్ కోసం లేదా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం పొదుపు చేసేందుకు చాలా పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. ప్రభుత్వ పథకాల వైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), వాలెంటరీ ప్రావిడెండ్ ఫండ్ (VPF) వంటివి పాపులర్ పథకాలు.
ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్‌లోకి (EPF) అదనపు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశం వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్. సాధారణంగా, ఉద్యోగులు తమ వేతనంలో 12 శాతాన్ని EPF అకౌంట్‌లో జమ చేస్తారు. కంపెనీ యాజమాన్యం కూడా అంతే డబ్బును అదే అకౌంట్‌లో జమ చేస్తుంది. ఒకవేళ, EPF కాంట్రిబ్యూషన్‌ను మించి ఆ ఉద్యోగి పొదుపు చేయాలనుకుంటే VPF ఉపయోగపడుతుంది. వీపీఎఫ్ పేరిట ఉద్యోగి జమ చేసే అదనపు డబ్బంతా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది.
పీపీఎఫ్ వర్సెస్ వీపీఎఫ్ - పూర్తి వివరాలు:
ఏ ఖాతాకు ఎవరు అర్హులు?
ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఈపీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులు మాత్రమే వీపీఎఫ్ ఖాతా తెరవగలరు. పీపీఎఫ్ ఖాతా అలా కాదు. ఉద్యోగం లేకపోయినా పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు, పెట్టుబడి పెట్టొచ్చు.
కనీస, గరిష్ట మొత్తాలు
పీపీఎఫ్ ఖాతాను కేవలం 100 రూపాయలతో ప్రారంభించొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయాలి, అదే ఏడాదిలో రూ.1,50,000 మించకుండా పెట్టుబడి పెట్టొచ్చు. వీపీఎఫ్‌లో ఖాతాలో కనిష్ట పరిమితి లేదు. గరిష్ట పరిమితి విషయానికి వస్తే... సదరు ఉద్యోగి మూల వేతనం + డీఏకు సమానమైన మొత్తానికి మించకుండా డిపాజిట్ చేయొచ్చు.
వడ్డీ రేటు
2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీపీఎఫ్ ఖాతాపై 7.10 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వీపీఎఫ్ విషయానికి వస్తే.. ఈపీఎఫ్‌పై అందించే వడ్డీ రేటే దీనికీ వర్తిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ ఖాతాలకు 8.25 శాతం వడ్డీ రేటును కేంద్రం నిర్ణయించింది.
నగదు విత్‌డ్రా
పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ పిరియడ్ 15 సంవత్సరాలు. కావాలనుకుంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఖాతా తెరిచిన ఆరో ఆర్థిక సంవత్సరం నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతా ఆధారంగా బ్యాంక్‌లు లోన్ కూడా ఇస్తాయి. పదవీ విరమణ చేసేవరకు వీపీఎఫ్‌లో డబ్బు జమ చేయవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్ డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. ఒకవేళ, ఏదైనా కారణం వల్ల వరుసగా రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే, వీపీఎఫ్ పూర్తి బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని అత్యవసర కారణాలపైనా పాక్షిక మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు.
ఆదాయ పన్ను ప్రయోజనం
ఈపీఎఫ్‌లో జమ చేసిన డబ్బుకు, వీపీఎఫ్‌లో జమ చేసిన డబ్బుకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. దీనికి మించి జమ చేసిన డబ్బుకు పన్ను చెల్లించాలి. పీపీఎఫ్ పెట్టుబడులకు కూడా సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షల మినహాయింపు లభిస్తుంది. ఈ ఖాతాపై పొందే వడ్డీ ఆదాయానికి కూడా పన్ను ఉండదు.
ఖాతా ఎక్కడ తెరవాలి?
పీపీఎఫ్ అకౌంట్‌ను పోస్టాఫీసులు, బ్యాంకుల్లో తెరవొచ్చు. ఆన్‌లైన్‌లోనే పీపీఎఫ్ ఖాతా తెరిచే ఫెసిలిటీని దాదాపు అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. వీపీఎఫ్ ఖాతా ప్రారంభించాలంటే కంపెనీ HRను కలవాలి.
మరో ఆసక్తికర కథనం: కొత్త వ్యాపారం కోసం 25 ఎకరాలు కొన్న అదానీ, డీల్ విలువ రూ.471 కోట్లు