Adani Group Invetment Plans: దేశంలో రెండో అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ‍‌(Gautam Adani) చెందిన అదానీ గ్రూప్, తన వ్యాపారాలను ఎంత వీలైతే అంత విస్తరిస్తూ వెళుతోంది. ఇందులో భాగంగా కొత్త డీల్స్‌ చేస్తోంది. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక భారీ డేటా సెంటర్‌ను అదానీ గ్రూప్‌ నిర్మించబోతోంది. ఇందుకోసం భూమిని కూడా కొనుగోలు చేసింది. 


డీల్ విలువ రూ.471 కోట్లు
ET రిపోర్ట్‌ ప్రకారం, పుణెలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ కంపెనీ టెర్రవిస్టా డెవలపర్స్ (Terravista Developers) 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ‍‌(Finolex Industries) నుంచి ఈ ల్యాండ్‌ తీసుకుంది. కొనుగోలు చేసిన భూమి 25 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటుంది, పుణె హవేలీ ప్రాంతంలోని పింప్రి ఇండస్ట్రియల్ జోన్‌లో ఇది ఉంది. దాదాపు రూ.471 కోట్లకు ల్యాండ్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ జరిగినట్లు నివేదికలో పేర్కొంది. 


ఈ నెల ప్రారంభంలో రిజిస్ట్రేషన్
ఈ నెల ప్రారంభంలో భూమి కొనుగోలు కార్యక్రమం ముగిసింది. ఏప్రిల్ 03న డీల్ రిజిస్టర్ అయింది. అదానీ గ్రూప్ కంపెనీ టెర్రవిస్టా డెవలపర్స్, స్టాంప్ డ్యూటీ కింద రూ.23.52 కోట్లు చెల్లించింది. ఈ భూమిని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్వస్తిక్ రబ్బర్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌కు మొదట లీజుకు ఇచ్చింది. 1967 - 1969 మధ్య కాలంలో పక్కనే ఉన్న రెండు ప్లాట్లను 95 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది.


తర్వాత, స్వస్తిక్ రబ్బర్ ప్రొడక్ట్స్‌ 1982లో ఫినోలెక్స్ గ్రూప్‌నకు లీజును బదిలీ చేసింది. ఈ బదిలీలో భాగంగా, ఒరిజినల్ లీజ్‌ కింద లీజు వ్యవధిని 95 సంవత్సరాలకు పొడిగించే అవకాశాన్ని ఫినోలెక్స్ గ్రూప్ పొందింది. ఇప్పుడు ఫినోలెక్స్ లీజును అదానీ గ్రూప్ కంపెనీకి బదిలీ చేసింది. అయితే, ఈ డీల్‌ను అదానీ గ్రూప్ లేదా ఫినోలెక్స్ గ్రూప్‌ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.


అదానీ కనెక్స్‌ ఆధ్వర్యంలో బిజినెస్‌ 
ప్రపంచంలోని వర్ధమాన వ్యాపారాల్లో డేటా సెంటర్ బిజినెస్‌ ఒకటి. దీనికి మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. ఈ వ్యాపారం కోసం అదానీ గ్రూప్ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. అదానీ కనెక్స్‌ (AdaniConneX) ఆధ్వర్యంలో డేటా సెంటర్‌ బిజినెస్‌ నడుస్తుంది. ఇది ఒక జాయింట్‌ వెంచర్‌ ‍‌(JV). అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), అమెరికాకు చెందిన ఎడ్జ్‌కానెక్స్‌ (EdgeConneX) కలిసి ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. JVలో రెండు సంస్థలకు 50-50 శాతం చొప్పున వాటా ఉంది. 


అదానీ కనెక్స్‌ ఇప్పటికే చెన్నై, నవీ ముంబై, నోయిడా, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాల్లో డేటా సెంటర్లను నిర్మించే పనిలో ఉంది. వచ్చే పదేళ్లలో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించాలని అదానీ కనెక్స్‌ ప్లాన్‌ చేసింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈవో రాజీనామా, పడిపోయిన మార్కెట్ షేర్