Retirement Planning For Rs 5 Crore Corpus: గ్లోబల్ మార్కెట్‌లో, ప్రస్తుతం, ముందుగానే రిటైర్మెంట్ (Early Retirement) తీసుకునే ట్రెండ్ నడుస్తోంది. ఉద్యోగం లేదా వ్యాపారం లేదా మరేదైనా వ్యాపకంలో ఉన్నవాళ్లు, వృద్ధాప్యానికి సరిపడా డబ్బును ముందుగానే సంపాదిస్తే, ఇక 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పని చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తద్వారా, వాళ్ల ఒంట్లో శక్తి మిగిలి ఉన్నప్పుడే జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు తెలివిగా ప్లాన్‌ చేసి, త్వరగా డబ్బు సంపాదించి, ముందుస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. ఎర్లీ రిటైర్మెంట్‌ తీసుకున్నప్పటికీ, మిగిలిన జీవితం మొత్తాన్నీ హ్యాపీగా కొనసాగించేందుకు అవసమైనంత డబ్బును ఏర్పాటు చేసుకునేందుకు  3 వ్యూహాలు ఉన్నాయి. 


వ్యూహం 1


పెట్టుబడిదారు వయస్సు 26 సంవత్సరాలు, అతను కోరుకున్న పదవీ విరమణకు (50 సంవత్సరాల వయస్సులో) ఇంకా 24 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని అనుకుందాం. 50 సంవత్సరాల వయస్సులో రూ. 5 కోట్ల ఫండ్/ కార్పస్ కోసం, ఆ వ్యక్తి సంవత్సరానికి రూ. 1,92,500 లక్షలు ఆదా చేయాలి. ఈ లెక్కన, ప్రతి నెలా రూ. 16,042 నెలవారీ పెట్టుబడి పెట్టాలి. ఒక్క నెల కూడా తప్పకుండా, దీనిని క్రమశిక్షతో పాటిస్తూ, 10 శాతం వార్షిక రాబడి రేటు వచ్చేలా మదుపు చేయగలిగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అంటే, అతనికి 50 ఏళ్లు వచ్చేసరికి రూ.5 కోట్ల డబ్బుతో రిటైర్‌ కావచ్చు.


వ్యూహం 2


పెట్టుబడిదారు వయస్సు 30 సంవత్సరాలు అయితే, కోరుకున్న పదవీ విరమణకు ఇంకా 20 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి రూ. 5 కోట్లు ఉండాలంటే, ఆ వ్యక్తి ఏటా రూ. 4 లక్షలు మదుపు చేయాలి. అంటే, ప్రతి నెలా రూ. 33,333 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం, రూ. 1 లక్ష వరకు నెలవారీ జీతం ఉన్న ఉద్యోగి తన నెలవారీ ఆదాయంలో సగటున 30 శాతం ఆదా చేయాలి. 30 సంవత్సరాల వయస్సులో పెట్టుబడిని ప్రారంభించడం అంటే దీనిని కొంచెం ఆలస్యంగా చేసినట్లు అర్ధం. అందువల్ల పొదుపు కూడా ఎక్కువగా ఉండాలి. ఏటా 10 శాతానికి తగ్గకుండా రాబడి ఇచ్చే మార్గాల్లో క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి.


వ్యూహం 3


35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తులు తమకు 50 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి రూ. 5 కోట్లు సంపాదించాలనుకుంటే, వారికి పొదుపు చేయడానికి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. టార్గెట్‌ ఫండ్‌ రూ.5 కోట్లు కాబట్టి, ప్రతి సంవత్సరం రూ. 8,85,000 ఆదా చేయాల్సి ఉంటుంది. ఇందుకు, ప్రతి నెలా రూ. 73,750 పెట్టుబడుల కోసం పక్కన పెట్టాలి. దీనిపై, వార్షికంగా సగటున 10 శాతం రాబడిని ఊహించడం ద్వారా, మీ లక్ష్యం రూ. 5 కోట్లను సాధించవచ్చు.


సగటు 10 శాతం రాబడిని ఎందుకు తీసుకున్నట్లు?


ప్రస్తుత ఆర్థిక ప్రపంచంలో, స్వీకరించే రాబడి అనేది వయస్సులో మార్పులతో పాటు పెరుగుతూ/తగ్గుతూ ఉంటుంది. పెట్టుబడి రకం, రిస్క్, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అనేదానిని బట్టి కూడా రిటర్న్‌ మారుతూ ఉంటుంది. ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకుని, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, సగటు వార్షిక రాబడి 10 శాతాన్ని బెంచ్‌మార్క్‌గా తీసుకోవడం జరిగింది.


ప్రస్తుత పరిస్థితుల్లో ఆశిస్తున్న సగటు రాబడులు


40 సంవత్సరాల వయస్సు వరకు 12 శాతం 
41-45 సంవత్సరాల వయస్సు వరకు 9 శాతం 
46-50 సంవత్సరాల వయస్సు వరకు 7 శాతం 


మరో ఆసక్తికర కథనం: 'సైలెంట్ ఫైరింగ్' గురించి తెలుసా? - అమెజాన్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయింది!