Silver Exchange Traded Funds: బంగారం లేదా వెండి - ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభాలు ఇస్తుంది? మెటల్, డిమాండ్ & ధర అంశాలను బట్టి ఎక్కువ మంది 'బంగారం' అని సమాధానం చెబుతారు. కానీ, "పెట్టుబడి లాభాలను" దృష్టిలో పెట్టుకుంటే.. ఈ రెండు లోహాలు ఒకదానితో మరొకటి గట్టిగా పోటీ పడుతున్నాయి. రాబడిలో పసిడి కంటే తగ్గేందుకు వెండి ఏమాత్రం ఇష్టపడడం లేదు. మార్కెట్ చరిత్ర పుఠలను తిరగేస్తే, ఎక్కువ సందర్భాల్లో, గోల్డ్ కంటే సిల్వర్‌లోనే "పెట్టుబడిపై రాబడి" (Returns on Investment in Silver) ఎక్కువగా కనిపిస్తుంది. గత ఏడాది కాలంగా వెండిపై రాబడుల ప్రకాశం బంగారం కంటే తక్కువగా లేదు. సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు, వెండిపై పెట్టుబడి నుంచి లాభాలను ఎలా రాబట్టాలి అన్న టెక్నిక్ తెలిసి ఉండాలి.
బంగారం కొనలేని అల్పఆదాయ వర్గాల ప్రజలు కూడా వెండిని కొనగలరు. కాబట్టి, వెండికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఈ సంవత్సరంలో (2024) ఇప్పటి వరకు, వెండి, తన పెట్టుబడిదారులకు 10 శాతానికి పైగా రిటర్న్స్ అందించింది. వచ్చే ఏడాదిలో (2025) ఈ రాబడి 35 శాతం కావచ్చని అంచనా. ఇంత రాబడి పొందాలంటే పెట్టుబడిదారులు వెండిలో ఏ రూపంలో పెట్టుబడి పెట్టాలనేదే ప్రశ్న. భౌతిక వెండిని కొనుగోలు చేయాలా లేదా ETFలు లేదా ఫ్యూచర్స్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలా?. ఏ మార్గంలో వెళితే ఎక్కువ లాభాలు కళ్లజూడొచ్చు?.
సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ ఆదాయం
వెండి ఆభరాణాలు లేదా కడ్డీలు/ నాణేలు వంటి వాటిని కొని ఇంట్లో పెట్టుకుంటే, అంటే భౌతిక రూపంలో ఉన్న వెండి (Physical Silver) వల్ల ఈ స్థాయి లాభాలు రావు. వెండిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్రస్తుతం ఉన్న ఉత్తమ మార్గం సిల్వర్ ఈటీఎఫ్‌లు (Silver Exchange Traded Funds). వెండి నాణేలు లేదా ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడని, వెండి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
వెండి ఈటీఎఫ్ అంటే ఏంటి, ఎలా పని చేస్తాయి?
సిల్వర్ ఈటీఎఫ్‌లు వెండి ధరను ట్రాక్ చేసే ఫండ్స్. ఇవి, తమ దగ్గర ఉన్న నిధుల్లో 95 శాతం మొత్తాన్ని భౌతిక వెండి & వెండి సంబంధిత ఉత్పత్తులలో పెట్టుబడి పెడతాయి. వెండి ధర పెరుగుతున్న కొద్దీ వాటి రాబడులు కూడా పెరుగుతాయి. అంతేకాదు, మీరు షేర్లలాగే సిల్వర్ ETFలను ట్రేడ్ చేయవచ్చు, మార్కెట్ ధరకు వాటిని కొనవచ్చు & అమ్మవచ్చు. వెండి భౌతిక వ్యాపారంలో ఉండే కొన్ని రకాల నష్టాలను సిల్వర్ ETFలలో పెట్టుబడి పెట్టడం ద్వారా నివారించవచ్చు. ఫిజికల్ సిల్వర్‌లాగా వెండి ఈటీఎఫ్‌లను ఎవరూ దొంగిలించలేరు, పోగొట్టుకోలేరు. సాధారణంగా, గోల్డ్ ఈటీఎఫ్‌ల (Gold ETFs) తరహాలోనే సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడాన్ని తెలివైన నిర్ణయంగా మార్కెట్ భావిస్తుంది.
వెండి ఈటీఎఫ్‌లలో మార్కెట్ రిస్క్‌లు
వెండి ఈటీఎఫ్‌లతో మార్కెట్ సంబంధిత రిస్క్‌లు కూడా ఉన్నాయి. ఈ ఫండ్స్ విలువ వెండి ధరలో హెచ్చుతగ్గులతో ముడిపడి ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది. పారిశ్రామిక డిమాండ్‌లో మార్పుల కారణంగా వెండి ధరలు తగ్గవచ్చు/ పెరగవచ్చు. ధరలో మార్పుల కారణంగా, ETF నుంచి వచ్చే రాబడులు కూడా ప్రభావితం అవుతాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రూ.80,000 దగ్గరలో పసిడి, రూ.1,000 తగ్గిన వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ