PAN 2.0 Card - Aadhaar Link: పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద తీసుకున్న పాన్‌ కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా అన్న ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?. ప్రభుత్వం చెప్పిన ప్రకారం, పాన్ 2.0 ప్రాజెక్ట్‌ అమలవుతున్నప్పుడు కూడా, నిర్లక్ష్యం చేయకుండా, పాన్‌ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం. పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని ఆదాయ పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. ఒకవేళ పాన్‌ కార్డ్‌ - ఆధార్‌ కార్డ్‌ను లింక్‌ చేయకపోతే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం - మీరు పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ నిష్క్రియంగా (inactivation of PAN) మారుతుంది. అంటే, అది పని చేయదు. 


మీ పాన్ కార్డ్ పని చేయకపోతే ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడం సాధ్యం కాదు. పన్ను వాపసు (Tax refund) అందుకోలేరు. బ్యాంక్‌ ఖాతా (Bank account) తెరవలేరు, చాలా రకాల ఆర్థిక సేవలను అందుకోలేరు. కొత్త పాన్ కార్డ్ (New PAN Card) తీసుకునే వాళ్ల విషయంలో పాన్ - ఆధార్ అనుసంధానం ఆటోమేటిక్‌గా జరుగుతుంది.


పాన్‌ 2.0 కింద పాతవాళ్లు కొత్త కార్డ్‌ తీసుకుంటే మళ్లీ లింక్‌ చేయాలా?
మీకు ఇప్పటికే పాన్‌ కార్డ్‌ ఉండి, మీ పాన్‌ - ఆధార్‌తో అనుసంధానమై ఉన్నప్పుడు, మీరు పాన్‌ 2.0 కింద అప్లై చేసుకుంటే పాత నంబర్‌తోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త పాన్‌ కార్డ్‌ (New Pan Card With QR Code) జారీ అవుతుంది. ఇక్కడ, కార్డ్‌ రూపం మారుతుంది కానీ, నంబర్‌ కాదు. కాబట్టి, ఇప్పటికే ఆధార్‌తో లింక్‌ అయిన పాత పాన్‌ కార్డ్‌ హోల్డర్లు పాన్‌ 2.0 కింద కొత్త కార్డ్‌ తీసుకున్నప్పటికీ మళ్లీ ఆ రెండింటిని లింక్‌ చేయాల్సిన అవసరం లేదు.


పాన్‌-ఆధార్‌ ఎలా అనుసంధానం చేయాలి?
మీకు ఇప్పటికే పాన్‌ కార్డ్‌ ఉండి, మీరు ఇప్పటికీ మీ పాన్‌ - ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేయకపోతే, ఈ పనిని మీరు కేవలం ఒక SMS పంపడం ద్వారా పూర్తి చేయవచ్చు. SMSలో UIDPAN అని టైప్‌ చేసి, మీ ఆధార్ నంబర్ & పాన్ నమోదు చేసి, 567678 లేదా 56161కి సెండ్‌ చేయండి. మీ పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి సమాచారం పాన్, ఆధార్ కార్డ్‌లో ఒకేలా ఉండాలి. అప్పుడే ఆ రెండింటి అనుసంధానం పూర్తవుతుంది. పాన్ - ఆధార్ కార్డ్‌లో నమోదైన మీ సమాచారం విభిన్నంగా ఉంటే, ముందుగా ఆ వివరాలను సరి చేయించుకోవాలి, ఆ తర్వాత లింకింగ్‌ కోసం ప్రయత్నించాలి.


వాస్తవానికి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డ్‌లో వేలిముద్రలు (బయోమెట్రిక్‌) సహా అన్ని వివరాలను అప్‌డేట్ చేయడం మంచిది. అయితే పాన్ 2.0ని అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పాన్‌ కార్డ్‌లో QR కోడ్ ఉంటుంది, ఇది పాన్‌ ధృవీకరణను సులభంగా మారుస్తుంది. దీంతో పాటు, ఆర్థిక మోసాలను నిరోధించడంతో పాటు అనేక విభిన్న లక్షణాలు పాన్‌ 2.0 సొంతం.


పాత పాన్‌ కార్డ్‌హోల్డర్లు పాన్‌ 2.0 కింద కొత్త కార్డ్‌ తీసుకోవాలా?
మీ దగ్గర ఇప్పటికే పాన్ కార్డ్‌ ఉంటే, మళ్లీ పాన్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత పాన్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది. పాన్ 2.0 ప్రాజెక్ట్‌ పాత పాన్‌కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్ అవుతుంది. ఒకవేళ మీ పాత పాన్‌ కార్డ్‌ పోయినా, పాడైనా, కొత్త కార్డ్‌ మీ దగ్గర ఉండాలని ఉత్సాహపడుతున్నా మీరు కొత్త పాన్‌ కార్డ్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: 10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం