Women Scheme Bima Sakhi Yojana Details In Telugu: దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా, మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని స్కీమ్‌లు రన్ చేస్తోంది.
తాజాగా, కేంద్ర ప్రభుత్వం, దేశంలోని మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు "బీమా సఖి". ఈ పథకం కింద, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), హరియాణాలోని పానిపత్‌లో ఈ రోజు (09 డిసెంబర్ 2024) బీమా సఖి యోజనను ప్రారంభించారు.
బీమా సఖి పథకం అంటే ఏమిటి? (What is Bima Sakhi Scheme?)
బీమా సఖి యోజనలో భాగంగా, మహిళలను బీమా సంబంధిత పనులు నిర్వహించేందుకు శిక్షణ పొందుతారు, సమర్థులుగా తయారవుతారు. ఈ పథకం ద్వారా, మహిళలు "లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" (Life Insurance Corporation of India - LIC) బీమా సఖిగా నియమితులవుతారు. అంటే, వారు LIC ఏజెంట్లుగా చేరతారు. పథకంలో చేరిన నాటి నుంచి బీమా సఖులు ప్రజలకు బీమా చేయగలరు. ఈ ప్రభుత్వ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు చాలా ప్రయోజనం పొందుతారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధారణంగా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి, మహిళా సాధికారతకు అవకాశం ఇస్తుంది.
బీమా సఖులకు డబ్బులు ఇస్తారా?
ఈ పథకంలో చేరిన బీమా సఖులకు, పథకం కింద, ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందజేస్తారు. పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెలా రూ. 7,000 ఇస్తారు. రెండో సంవత్సరంలో ఈ మొత్తం రూ. 1,000 తగ్గి రూ. 6,000 అవుతుంది. మూడో సంవత్సరంలో మరో రూ. 1,000 తగ్గి ప్రతి నెలా రూ. 5,000 వస్తుంది. ఇది కాకుండా, మహిళలకు ప్రత్యేకంగా రూ. 21,000 అందుతుంది. అంతేకాదు, బీమా లక్ష్యాలను పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక కమీషన్ కూడా చేతికి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బీమా సఖి పథకం మొదటి దశలో 35,000 మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పిస్తారు. ఆ తర్వాత, 50,000 మందికి బీమా సఖి యోజన ప్రయోజనాలు కల్పిస్తారు. ఇలా 3 సంవత్సరాల్లో 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
బీమా సఖి పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి, మహిళల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో www.licindia.in ను సందర్శించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఏయే ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ కార్డ్‌తో రూ.5 లక్షల ఉచిత చికిత్స పొందొచ్చు?