Indian Railway Rules For Free Meal: మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు విమానం టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లినప్పుడు, మీ విమానం నాలుగు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం సదరు విమానయాన సంస్థ మీకు ఉచితంగా ఆహారాన్ని (Free Meal) అందిస్తుంది. విశేషం ఏంటంటే... ఈ రకమైన రూల్‌ కేవలం విమానాలకు సంబంధించిది మాత్రమే కాదు. భారతీయ రైల్వే నిర్వహించే రైళ్లకు కూడా ఈ రూల్‌ వర్తిస్తుంది. రైలు షెడ్యూల్ చేసిన సమయం కంటే ఆలస్యంగా నడుస్తుంటే (Late Train) ఈ నియమం వర్తిస్తుంది. లేట్‌గా నడుస్తున్న రైలులో టిక్కెట్‌ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఉచిత ఆహారాన్ని అందించాలి. అయితే, ఆలస్యంగా నడుస్తున్న ప్రతి రైలుకు ఈ రూల్‌ వర్తించదు. ప్రయాణీకులకు ఉచిత ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు, షరతులు విధించారు.


రైలు ఆలస్యాన్ని బట్టి ఉచిత ఆహారం       
భారతీయ రైల్వే, ప్రయాణీకుల సౌకర్యం కోసం చాలా నియమాలను రూపొందించింది. రైలు ఆలస్యానికి సంబంధించిన రూల్‌ వాటిలో ఒకటి. రైల్వే నిబంధనల ప్రకారం, రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిన సందర్భంలో  ఆ రైలులోని ప్రయాణికులకు రైల్వే శాఖ ఉచితంగా ఆహారం అందిస్తుంది. ఇక్కడ కూడా మరో షరతు ఉంది, ఈ నియమం అన్ని రైళ్లకు వర్తించదు. రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express), శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (Satabdi Express), దురంతో ఎక్స్‌ప్రెస్ (Duronto Express) వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులకు మాత్రమే ఉచిత ఆహారం అందుతుంది.


మరో ఆసక్తికర కథనం: ITR ఫైలింగ్‌, తప్పుల సవరణకు ఇప్పటికీ ఛాన్స్‌ - ఆలస్యం చేస్తే జైలుకు వెళ్తారు! 


రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వ్యక్తులు మాత్రమే భారతీయ రైల్వే నుంచి ఉచిత ఆహార సౌకర్యాన్ని పొందేందుకు అర్హులు. మీరు ఎప్పుడైనా ఈ తరహా రైలు ప్రయాణిస్తున్నట్లయితే, ఆ రైలు నిర్ణీత సమయం కంటే 3 గంటల కంటే ఆలస్యంగా నడుస్తుంటే, మీకు ఉచితంగా ఆహారం అందుతుంది. ఒకవేళ రైల్వే శాఖ మీకు ఉచితంగా ఆహారం ఇవ్వకపోతే, ఆ విషయంపై మీరు ఫిర్యాదు చేయవచ్చు.


అందుబాటులోకి ఆహార దుకాణాలు
ఇలాంటిదే మరో రూల్‌ ఉంది. ఏదైనా రైలులో చాలా ఆలస్యంగా నడుస్తుంటే, ప్రయాణీకుల సౌకర్యం కోసం, రైల్వే యంత్రాంగం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఫుడ్ స్టాల్స్‌ను నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచుతుంది. తద్వారా ప్రయాణికులకు ఆహారం, పానీయాల విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తుంది. దీనితో పాటు, ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా RPF సిబ్బందిని కూడా మోహరిస్తుంది.


మరో ఆసక్తికర కథనం:  గోల్డ్‌ కొనేవాళ్లకు షాక్‌ - పెరిగిన పసిడి రేట్లు, రూ.లక్ష నుంచి దిగని వెండి