Last Date For Filing ITR With Late Fee: 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY 2023-24) ఇప్పటికీ ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులకు డిసెంబర్ 31 వరకు చివరి అవకాశం ఉంది. ఈలోగా, గరిష్టంగా రూ. 5,000 ఆలస్య రుసుముతో (Late Fee) ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే, ముందుగానే జాగ్రత్త పడితే లేట్ ఫీజ్‌తో బయటపడొచ్చు. డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయాలంటే జరిమానా మొత్తం భారీగా పెరిగే అవకాశం ఉంది, మరికొన్ని చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం, అసలు గడువులోపు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే, ఆలస్యమైన రిటర్న్‌ను (Belated IT Return/ Belated ITR) సెక్షన్ 139(4) కింద దాఖలు చేయాలి. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగియడానికి 3 నెలల ముందు ఆలస్యమైన రిటర్న్‌ను ఎప్పుడైనా ఫైల్ చేయవచ్చు.
అసలు గడువు జులై 31తో పూర్తి
2023-24 ఆర్థిక సంవత్సరానికి (Assessment Year 2024-25) ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి అసలు గడువు జూలై 31 వరకు మాత్రమే. ఈ గడువును మిస్ అయిన పన్ను చెల్లింపుదారులు ఆలస్యపు రిటర్న్‌లను ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 వరకు సమయం ఉంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 234(F) ప్రకారం, ఆలస్యమైన ఐటీ రిటర్న్ ఫైలింగ్ కోసం రూ. 1000 లేదా రూ. 5000 చెల్లించాలి. పన్ను చెల్లించాల్సిన మొత్తం ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటే లేట్ ఫీజ్‌గా రూ. 1000; పన్ను చెల్లించాల్సిన మొత్తం ఆదాయం రూ. 5 లక్షలు దాటితే లేట్ ఫీజ్‌గా రూ. 5,000 చెల్లించాలి. డిసెంబర్ 31 లోగా ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైతే, సమస్యలు ఇంకా పెరుగుతాయి.
డిసెంబర్ 31 గడువును మిస్ అయితే ఏంటి నష్టం?
డిసెంబర్ 31లోగా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని వారి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆలస్య జరిమానా రూ. 10,000కు పెరుగుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు & ఆర్థిక నష్టాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని నష్టాలను తదుపరి సంవత్సరాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాలు పరిమితమవుతాయి.
ఆదాయ పన్ను విభాగం, ఒక వ్యక్తి సంపాదించిన విదేశీ ఆస్తి లేదా విదేశీ ఆదాయాల గురించి సమాచారం ఇవ్వడానికి డిసెంబరు 31 వరకు గడువు ఇచ్చింది. విదేశీ ఆస్తి లేదా విదేశీ ఆదాయాలు ఉన్న వ్యక్తులు ఈ గడువులోగా ఆదాయ పన్ను విభాగానికి సమాచారం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సమాచారాన్ని దాచినందుకు రూ. 10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఇది సంపన్నుల 'క్రెడిట్ కార్డ్' - దీనిని పర్సులో పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతారు!