Ayushman Yojana Eligible Hospitals: భారత ప్రభుత్వం, దేశంలోని పౌరుల అవసరాలు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా రకాల పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాల్లో చాలా వరకు దేశంలోని పేదలు, అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం చాలా కీలక అంశం. ఇప్పుడున్న ఆహార అలవాట్లు, వాతావరణ మార్పుల కారణంగా ఏ వ్యాధి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఆరోగ్యం ఇప్పుడు చాలా ఖరీదైన అంశం, కుటుంబంలో ఒక్కరు ఒక్కసారి పెద్ద అనారోగ్యానికి గురైనా, ఆ కుటుంబం మొత్తం పెట్టుబడులు, పొదుపులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇలాంటి స్థోమతకు మించిన ఖర్చుల నుంచి రక్షణ కోసం ఆరోగ్య బీమా (Health Insurance)తీసుకుంటున్నారు. ఆరోగ్య బీమా పరిధిలోకి (Health Insurance Coverage) వచ్చిన తర్వాత గానీ మనస్సుకు నిశ్చింతగా ఉండదు. కానీ, దేశంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పేద ప్రజలు ఆరోగ్య బీమా తీసుకోలేరు. అటువంటి పేద ప్రజల కోసం, కేంద్ర ప్రభుత్వం ఉచిత చికిత్స పథకం, పీఎం ఆయుష్మాన్ యోజనను (PM Ayushman Yojana) అమలు చేస్తోంది. ఈ పథకం కింద, ఆయుష్మాన్ కార్డ్ ఉన్న ప్రజలకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు
అన్ని ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ పథకం కింద ఉచితంగా వైద్య చికిత్స అందిస్తారా, లేదా కొన్ని ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో మాత్రమే ట్రీట్‌మెంట్ చేస్తారా అన్నది ప్రతి ఒక్కరు ముందుగానే తెలుసుకోవడం, ఆసుపత్రుల జాబితాను సిద్ధంగా పెట్టుకోవడం మంచిది.
నమోదిత ఆసుపత్రుల్లో మాత్రమే ఉచిత చికిత్స
ఎవరైనా ఆయుష్మాన్ కార్డు కలిగి ఉండి & ఏదైనా అనారోగ్యానికి చికిత్స పొందాలనుకుంటే, అతను, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ యోజన (Pradhan Mantri Ayushman Yojana) కింద నమోదైన ఆసుపత్రులలో మాత్రమే ఉచిత చికిత్స పొందడానికి వీలవుతుంది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులతో (Government Hospitals) పాటు ప్రైవేట్ ఆసుపత్రులు (Private Hospitals) కూడా నమోదై ఉన్నాయి. కానీ, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇందులో చేరలేదు. అందుకే, ముందుగా, మీరు ఉంటున్న ప్రాంతంలో లేదా సమీప నగరంలో ఏ ఆసుపత్రి పీఎం ఆయుష్మాన్ యోజన కింద నమోదై ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆసుపత్రుల జాబితాను (Registered Hospitals List Under PM Ayushman Yojana) చూడడానికి ఆయుష్మాన్ యోజన వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అంటే, మీ ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ ద్వారా ఆసుపత్రుల లిస్ట్ చూడొచ్చు.
నమోదిత ఆసుపత్రుల జాబితా
మీ నగరంలో లేదా మీరు ఉంటున్న ప్రాంతానికి సమీపంలో ఏ ఆసుపత్రిలో ఆయుష్మాన్ కార్డ్ కింద ఉచిత చికిత్స పొందొచ్చో తెలుసుకోవడానికి.. ఆయుష్మాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmjay.gov.in లోకి వెళ్లాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో, మీరు "ఫైండ్ హాస్పిటల్" (Find Hospital) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రైవేట్ ఆసుపత్రి వంటి వివరాలను ఎంచుకోవాలి. ఇక్కడ ఎంపానెల్‌మెంట్ టైప్‌లో PMJAYని ఎంచుకోవాలి. తర్వాత, అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను సంబంధిత గడిలో నమోదు చేయాలి. ఇప్పుడు ఆ తర్వాత, "సబ్మిట్" (Submit) బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే, మీ నగరంలో లేదా మీ సమీప ప్రాంతంలో ఆయుష్మాన్ యోజన కింద నమోదైన అన్ని ఆసుపత్రుల జాబితా మీ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది.
మీ దగ్గరలోని ఆసుపత్రుల లిస్ట్‌ను గుర్తు పెట్టుకోవడం లేదా ప్రింట్ తీసుకుని పెట్టుకుంటే, మీకు లేదా మీ సన్నహితులకు వైద్య అత్యవసర సమయాల్లో అది ఉపయోగపడుతుంది.
మరో ఆసక్తికర కథనం: విమానం లాగా, రైలు ఆలస్యమైనా 'ఉచితంగా ఆహారం' - చాలామందికి ఈ విషయం తెలీదు