What women need to do to invest in shares: మహిళలను మహారాణులతో పోలుస్తుంటారు! మహారాణి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో తులతూగుతుంటుంది! అలాంటిది చాలామంది స్త్రీలు ఈక్విటీ మార్కెట్లలో (Women in Equity Markets) పెట్టుబడులు పెట్టేందుకు, ట్రేడింగ్ చేసేందుకు వెనుకాడుతుంటారు. కుటుంబ బాధ్యతలు ఉన్నాయంటూ డబ్బు వ్యవహారాలను (Financial Matters) పట్టించుకోరు. కేవలం ఒంటిపై ధరించే బంగారు ఆభరణాలనే ఇష్టపడితే సరిపోదు. ఆర్థిక వ్యవహారాలు, ఈక్విటీ మార్కెట్లు (Equity Markets), పాసివ్ ఇన్‌కమ్ (Passive Income) గురించి తెలుసుకొంటేనే నిజంగా మహారాణులు అవుతారు!
షేర్ల గురించి తెలుసుకోండి
ఒకప్పుడు అమ్మాయిలు వంటింటికే పరిమితం అయ్యారు. ఈనాడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు. కొన్నింట్లోనైతే వారిదే డామినేషన్! అలాంటిది ఈక్విటీ పెట్టుబడుల్లో (Share market) మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఉద్యోగులు (Women Employees), గృహిణులు (House Wife), ఖాళీ సమయం ఉన్నవారు ఈక్విటీ మార్కెట్ల గురించి తెలుసుకొని పెట్టుబడులు పెట్టొచ్చు. ఇవి మీకు ఆర్థిక స్వతంత్రాన్ని అందిచగలవు. మీ ఇంటి అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. లక్ష్యాలు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఈ స్టాక్స్ కొనుగోలు చేయండి
మహిళలు పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇన్వెస్టింగ్ దగ్గరికి వచ్చేసరికి ROI (Return on Investment) ఎక్కువగా ఉండే స్టాక్స్‌లో మదుపు చేయడం వల్ల లాభం ఉంటుంది. అంటే మీ పెట్టుబడికి తగిన రాబడి ఇచ్చే షేర్లు అన్నమాట. రోజువారీ ట్రేడింగ్ కాకుండా వారం, నెల, మూడు నెలలు, సుదీర్ఘ కాలం పెట్టుబడులు పెడుతూ వాటిని సమీక్షించుకోవడం ముఖ్యం. స్వల్ప కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురైనా లాంగ్‌టర్మ్‌లో మంచి రాబడి ఇస్తాయి. మీకు ఆసక్తి ఉంటే నిపుణులను సంప్రదించి చక్కని పోర్టుఫోలియోలను (Portfolios) నిర్మించుకోవచ్చు.
'ఫండ్ల'తో ఫలాలు
స్టాక్ మార్కెట్‌పై ఎక్కువగా అవగాహన లేదు. అయినా వాటి ఫలాలు అందుకోవాలన్న ఆసక్తి ఉంటే మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) బెటర్ ఆప్షన్. కొత్తగా ఈక్విటీ మార్కెట్లలోకి వచ్చేవారికి మ్యూచువల్ ఫండ్లు సాయం చేస్తాయి. ప్రతి నెలా మీరు సిప్ (Systematic investment plan - sip) చేయడం ద్వారా బెంచ్‌మార్క్ సూచీల్లాగే ఇక్కడా రాబడి పొందొచ్చు. వైవిధ్యం కోసం లిక్విడ్ (Liquid), డెట్ (Debt), ఈక్విటీ (Equity), హైబ్రీడ్ (Hybrdi), ఈఎల్‌ఎస్‌ఎస్ (Elss) వంటి మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేయండి.
ఈటీఎఫ్‌లలో వైవిధ్యం
స్టాక్స్ కొనాలంటే ఏది బాగా పెరుగుతుందో, మంచి రాబడి ఇస్తుందో రీసెర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Exchange traded funds - ETFs) పెట్టుబడులకు ఎంతో అనువుగా ఉంటాయి. డెట్, ఈక్విటీ, స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్, కరెన్సీ, గోల్డ్ (Gold ETFs) వంటి అసెట్స్‌తో ఈటీఎఫ్‌లు ఉంటాయి. వేర్వేరు రకాల షేర్లు, రంగాలను బట్టి కూడా ఈటీఎఫ్‌లో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా ఇవీ వైవిధ్యమైన రాబడి అందిస్తాయి.
మీ సహనంతో డబ్బే డబ్బు
మహిళలు అంటేనే సహనానికి మరోపేరు! ఈక్విటీ మార్కెట్లలో కచ్చితమైన రాబడులు రావాలంటే ఓపిక ఎంతో అవసరం. కాబట్టి ఈక్విటీ మీకు బాగా సెట్టవుతాయి. ఆర్థిక లావాదేవీల గురించి మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించండి. అన్నీ వారికే వదిలేయకండి! డబ్బు పరమైన నిర్ణయాల్లో మీ భాగస్వామ్యం ఉండేలా చూసుకోండి. ఆడవాళ్లకు బంగారమంటే (Gold) ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే! అలాగని డబ్బంతా దానికే కేటాయించకండి. డైవర్సిఫై చేసుకోండి. ఇక మరో విషయం డబ్బును పూర్తిగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకే (Fixed Deposites) పరిమితం చేయకండి. మీ నిధులను విభజించి వేర్వేరు పెట్టుబడి సాధనాలపై పెట్టండి.