Epfo e-Nomination: ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఈపీఎఫ్‌వో (EPFO) అనేక మార్పులు చేస్తోంది. సులభంగా నామినేషన్ (e-Nomination) మార్చుకొనే అవకాశం కల్పించింది. ఒకప్పుడు ఈపీఎఫ్, ఈపీఎస్ నామినీ పేరు మార్చాలంటే కొత్తగా పత్రాలు తీసుకొని వాటిని నింపి కార్యాలయంలో సమర్పించాల్సి వచ్చేది. ఇకపై నామినేషన్ మార్పు చేసేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.
సులభంగా ఈపీఎఫ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి పీఎఫ్ (PF) నామినేషన్‌ను మార్చుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ఓ ట్వీట్ చేసింది. 'యూఏఎన్ (UAN) ద్వారా ఈ-నామినేషన్‌ను ఇప్పుడే చేయండి. మీ కుటుంబం లేదా నామినీకి సోషల్ సెక్యూరిటీ (Social Security) కల్పించండి' అని ఓ చిత్రాన్ని పోస్ట్ చేసింది. పాత నామినీ పేరు రద్దు చేయాలంటే అందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తది చేస్తే ఆటోమేటిక్‌గా పాతది రద్దవుతుంది.
పీఎఫ్ ఆన్‌లైన్ పేమెంట్ చేయాలన్నా, పింఛను పొందాలన్నా, ఎంప్లాయీస్ డిపాజిట్ లింకుడ్ ఇన్సూరెన్స్ (EDLI) కింద రూ.7 లక్షలకు కుటుంబ సభ్యులు అర్హత సాధించాలన్నా ఈ-నామినేషన్ కీలకమని ఈపీఎఫ్‌వో తెలిపింది. నామినేషన్‌ను ఎప్పుడైనా చేసుకోవచ్చని, పెళ్లైన తర్వాత తప్పనిసరిగా చేసుకోవాలని ఈపీఎఫ్‌వో సూచిస్తోంది.
నామినీ దాఖలు ప్రక్రియ ఇదే
- ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in.కు లాగిన్ అవ్వాలి.
- 'సర్వీసెస్'కు వెళ్లి 'ఫర్ ఎంప్లాయిస్' ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.
- డ్రాప్‌డౌన్ మెనూలో 'మెంబర్ యూఏఎన్/ఆన్‌లైన్ సర్వీస్ (ఓసీఎస్/ఓటీసీపీ) ట్యాబ్ క్లిక్ చేయాలి.
- మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- మేనేజ్ ట్యాబ్‌లో 'ఈ-నామినేషన్'ను ఎంచుకోవాలి.
- కుటంబ సభ్యుల వివరాల మార్పు కోసం 'యెస్'ను క్లిక్ చేయాలి.
- 'యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్'ను క్లిక్ చేయండి.
- వాటా డిక్లేర్ చేసేందుకు 'నామినేషన్ డీటెయిల్స్'ను క్లిక్ చేయండి.
- డిక్లరేషన్ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' క్లిక్ చేయండి.
- ఓటీపీ కోసం 'ఈ-సైన్' క్లిక్ చేయండి.
- ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని సబ్‌మిట్ చేయండి.
- దీంతో ఈపీఎఫ్‌వోలో 'ఈ-నామినేషన్' పూర్తవుతుంది.
- ఈపీఎఫ్‌వోలో ఒకరి కన్నా ఎక్కువ మందిని నామినీగా చేర్చొచ్చు.
- ఆన్‌లైన్‌లో ఈ-నామినేషన్ సబ్‌మిట్ చేశాక ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు.