Income Tax Rule Changes From 1 April 2023: కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ‍‌(FY24) నుంచి ఆదాయపు పన్నుకు సంబంధించిన అనేక రూల్స్‌ మారబోతున్నాయి. కొత్త పన్ను విధానంలో పన్ను పరిమితి పెంపు, డెట్ మ్యూచువల్ ఫండ్‌లపై LTCG టాక్స్‌ పన్ను ప్రయోజనం రద్దు వంటి అనేక ప్రధాన మార్పులు ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయి.


ఏప్రిల్ 1 నుంచి మారుతున్న పన్ను నియమాలు:


డీఫాల్ట్‌గా కొత్త ఆదాయపు పన్ను విధానం
ఏప్రిల్ 1 నుంచి, కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. అయితే, పన్ను చెల్లింపుదార్లు పాత విధానాన్ని కూడా ఎంచుకోవచ్చు.


రూ. 7 లక్షల పన్ను పరిమితి
కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 7 లక్షల వరకు ఉన్న ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు, ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. మీరు పాత పద్దతిలో పన్ను చెల్లించే ఆప్షన్‌ ఎంచుకుంటే, గతంలోలాగే ఆదాయ పన్ను చట్టంలోని  వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు పొందవచ్చు. 


ప్రామాణిక తగ్గింపు 
స్టాండర్డ్ డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదు. పాత పన్ను విధానంలో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌గా ఉంచారు. అయితే, పింఛనుదార్ల విషయంలో రూ. 15.5 లక్షల ఆదాయంపైన స్టాండర్డ్ డిడక్షన్ రూ. 52,500గా ఉంటుంది.


ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో మార్పు
కొత్త పన్ను విధానం ప్రకారం, ఆదాయం రూ. 7 లక్షలు దాటితే స్లాబ్స్‌ పద్ధతిలో పన్ను చెల్లించాలి. 0 నుంచి 3 లక్షల రూపాయల వరకు స్లాబ్‌లో పన్ను ఉండదు. 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు 5 శాతం, 6 నుంచి 9 లక్షల రూపాయల వరకు 10 శాతం, 9 నుంచి 12 రూపాయల లక్షల వరకు 15 శాతం, 15 లక్షలకు పైబడిన వారికి 30 శాతం పన్ను కట్టాలి.


LTA పరిమితి కూడా పెరుగుతోంది. ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ 2002 సంవత్సరం నుంచి రూ. 3 లక్షలు ఉండగా, దాన్ని రూ. 25 లక్షలకు పెంచారు.


తక్కువ పన్ను ప్రయోజనాలు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54F కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతాయి. ఏప్రిల్ 01 నుంచి, ఈ సెక్షన్ల కింద మూలధన లాభాన్ని రూ. 10 కోట్ల వరకు మాత్రమే మినహాయిస్తారు. దీని కంటే ఎక్కువ మూలధన లాభంపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు.


లిస్టెడ్ డిబెంచర్లపై TDS
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193, నిర్దిష్ట సెక్యూరిటీలకు సంబంధించి చెల్లించే వడ్డీపై TDSను మినహాయిస్తుంది. ఆ సెక్యూరిటీ డీమెటీరియలైజ్డ్ రూపంలో ఉండి, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయితే, అటువంటి సందర్భంలో చెల్లించే వడ్డీపై TDS కట్‌ చేయరు. ఇది మినహా మిగిలిన అన్ని చెల్లింపులపై 10 శాతం TDS కట్‌ చేస్తారు.


డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పన్ను
ఏప్రిల్ 1 నుంచి, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై LTCG టాక్స్‌ ప్రయోజనం ఉండదు. ఈ ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై లాభాలన్నీ స్వల్పకాలిక మూలధన లాభాల (STCG) పన్ను పరిధిలోకి వస్తాయి.


మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు
మార్కెట్ లింక్డ్ డిబెంచర్లలో పెట్టుబడులు ఏప్రిల్ 1 నుంచి స్వల్పకాలిక మూలధన ఆస్తుల పరిధిలోకి వస్తాయి. మార్కెట్-లింక్డ్ డిబెంచర్ల బదిలీ, రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ ద్వారా వచ్చే మూలధన లాభాలకు స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుంది.


జీవిత బీమా పాలసీ
సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ జీవిత బీమా ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి (ఏప్రిల్ 1, 2023 నుంచి) పన్ను పరిధిలోకి వస్తుంది.


సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) కింద పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచగా, ఏప్రిల్ 1 నుంచి ఇది వర్తిస్తుంది.


ఈ-గోల్డ్‌పై పన్ను లేదు
ఏప్రిల్ నెల నుంచి, భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్‌ రిసిప్ట్స్‌గా (EGR), EGRను భౌతిక బంగారంగా మార్చుకుంటే దానిపై ఎటువంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ప్రయోజనాన్ని పొందడానికి, SEBI రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ ద్వారా ఈ పనిని చేయాల్సి ఉంటుంది.


ఆన్‌లైన్ గేమ్‌పై పన్ను
ఆన్‌లైన్ గేమ్‌ ఆడి డబ్బు గెలిస్తే, అలాంటి లాభాలపై ఏప్రిల్‌ నెల నుంచి భారీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115 BBJ ప్రకారం, గెలుపు రూపంలో వచ్చిన ఆదాయంపై 30% పన్ను విధిస్తారు. ఈ పన్ను TDS రూపంలో తీసివేస్తారు.