Income Tax Return: 2022-23 ఆర్థిక సంవత్సరం/2023-24 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌లు ఫైల్‌ చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీతం పొందే పన్ను చెల్లింపుదార్లలో (Salaried Tax Payers) ఎక్కువ మంది తమ కంపెనీల నుంచి ఈ నెల (జూన్‌ 2023) 15 నాటికి ఫామ్‌-16 అందుకున్నారు. దీంతో, జూన్‌ 15 తర్వాతి నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ నంబర్లలో వేగం పెరిగింది. 


రిటర్న్‌లు ఫైల్‌ చేసిన కోటి మంది టాక్స్‌పేయర్లు
2022-23 ఆర్థిక సంవత్సరం/2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి, 26 జూన్ 2023 వరకు, కోటి మంది పన్ను చెల్లింపుదార్లు ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్‌ ట్వీట్ చేసింది. చివరి తేదీ వరకు ఆగకుండా ముందుగానే ఐటీఆర్‌ ఫైల్‌ చేయడంపై టాక్స్‌ పేయర్లను అభినందించింది. గత అసెస్‌మెంట్ ఇయర్‌ 2022-23లో, 8 జులై 2023 నాటికి కోటి మంది పన్ను చెల్లింపుదార్లు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 12 రోజుల ముందుగానే ఆ మైలురాయిని సాధించినట్లు ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది.






టాక్స్‌ పేయర్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆదాయపు పన్ను పత్రాలను సులభంగా దాఖలు చేయడం తమ ప్రాధాన్యతల్లో ఒకటి ఆదాయ పన్ను విభాగం హామీ ఇచ్చింది. చివరి క్షణంలో రిటర్న్‌ దాఖలు చేసేందుకు హడావిడి పడకుండా, ఇదే ఊపును కొనసాగించాలని, ITR త్వరగా ఫైల్ చేయాలని టాక్స్‌ పేయర్లకు ఆదాయపు పన్ను విభాగం విజ్ఞప్తి చేసింది.


2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జులై 2023. రిటర్న్‌లు సమర్పించే ఇండివిడ్యువల్‌ టాక్స్‌ పేయర్లలో ఎక్కువ మంది ITR-1 ఫామ్ ద్వారా ఆదాయాన్ని ప్రకటిస్తారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉండి; జీతం, ఒక ఇంటి ఆస్తి, బ్యాంకు నుంచి వడ్డీ, డివిడెండ్, వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 5000 దాటకుండా ఉంటే.. అటువంటి పన్ను చెల్లింపుదార్లు  ITR-1 ఫామ్ ద్వారా ఆదాయాన్ని ప్రకటించాలి.


ముంచుకొస్తున్న పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువు
ఈ నెల 30తో పాన్‌-ఆధార్‌ అనుసంధానం (PAN-Aadhar Linking) గడువు ముగుస్తుంది. ఈ రెండింటిని లింక్‌ చేయకపోతే IT రిటర్న్‌ సమర్పించడం సాధ్యం కాదు. కేవలం రూ. 1,000 జరిమానా చెల్లించి, ఈ నెల 30లోగా పాన్‌-ఆధార్‌ను లింక్ చేయవచ్చు. కేవలం అని ఎందుకు చెప్పామంటే, జూన్‌ 30 తర్వాత రూ. 10 వేలు ఫైన్‌ కట్టాల్సిరావచ్చు. పాన్‌-ఆధార్‌ లింక్‌ కాకపోతే, పాన్ కార్డ్ నాన్-ఆపరేటివ్‌గా మారుతుంది. పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్‌ రాదు. పాన్‌ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ TDS & TCS వసూలు చేస్తారు.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' HDFC Life, SBI, LTI Mindtree


Join Us on Telegram: https://t.me/abpdesamofficial