Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుదేలవుతోందా? లక్షలాది ఫ్లాట్ లు కొనేవారు లేక ఖాళీగా ఉన్నాయా? మొత్తంగా ఇన్నాళ్లు ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఢమాల్ అందా? ఇంతకీ ఏం జరుగుతోంది. ఇంతలా ప్రచారం వెనుక వాస్తవాలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP దేశం. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పతనమైయ్యిందనే వార్తలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రియల్ రంగానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే క్రెడాయ్ మాత్రం రియల్ డమాల్ అనే వార్తలపై తనదైన శైలిలో స్పందిస్తోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై వాస్తవాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అతి తక్కవ సమయంలోనే హైదరబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకుంది. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఇళ్ల ధరలు అమాంతం పెరిగాయి. ప్లాట్ ల ధరలైతే ఇంక చెప్పనక్కర్లేదు అంతలా ఊహించని డిమాండ్ ఒక్కసారిగా రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ వెలుగు వెలిగింది. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం విషయానికొస్తే లక్షలాది ఫ్లాట్ లు ఖాళీగా ఉన్నాయి. కొనేవారు లేక రియల్ ఎస్టేట్ కుదేలైయ్యిందనే వార్తాలు వినిపిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజాల సమాహారం క్రెడాయ్ మాట్లడటం జరిగింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది క్రెడాయ్. అంతేకాదు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ రియల్ రంగాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల ఫ్లాట్ లు ఖాళీగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. అంటే ఇరవై కోట్ల ఎస్ ఎఫ్ టీ ఎక్కడా అమోదం పొందనేలేదు. మరి అంతలా భాగ్యనగరంలో ఫ్లాట్ లు ఖాళీగా ఉన్నాయంటూ జరిగే ప్రచారం పూర్తిగా అర్ధరహితమంటున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు రాబోయే పదేళ్ల వరకూ ఎలాంటి డోకా లేదంటున్నారు. ఫ్లాట్ లు నిర్మాణంలో ఉండగానే హట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయంటోంది క్రెడాయ్.
(క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్)
ఇరవై శాతం తగ్గిన అమ్మకాలు
క్రెడాయ్ వాదన ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం ప్రచారం జరుగుతున్నట్లు అంతలా డమాల్ కాకపోయినా కాస్త ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అది ఏ రంగమైనా సప్లై విపరీతంగా ఉంటే డిమాండ్ తగ్గడం సర్వసాధారణం. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఇదే. అంచనాలకు మించి గత రెండేళ్లుగా హైదరాబాద్ లో విపరీతంగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. వీటిలో విల్లాలు, ఇండివిడ్యువల్ హౌసెస్ నిర్మాణాలతో పోల్చినప్పుడు ఫ్లాట్ ల నిర్మాణాలు మరింత ఎక్కవగా అంచనాలకు మించి కట్టేశారు. ఇదే ఇప్పుడు రియల్ కొంపముంచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ , మల్కాజ్ గిరి, సంగారెడ్డి ఇలా ఈ ప్రాంతాల సమాహారం. గత ఏడాది అంటే 2021 లో మొదటి మూడు నెలల్లో 23 వేల ఫ్లాట్ లు అధికారికంగా రిజిస్ట్రేషన్ అయితే అదే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఆ సంఖ్య 19 వేలకు పడిపోయింది. అంటే ఇరవైశాతం అమ్మకాలు తగ్గినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
క్రెడాయ్ ఏంచెబుతుందంటే?
ఇదే విషయంపై క్రెడాయ్ సమాధానం మరోలా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే కూరగాయల మార్కెట్ లో వెంటనే అమ్మేడం కాదు. ఏడాది పొడవునా బిజినెస్ నడవాలి. లాభాపేక్ష చూసుకుంటూ మార్కెట్ డిమాండ్ ను బట్టి అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ ఇరవైశాతం అమ్మకాల్లో వ్యత్యాసం సర్వసాధారణం అంటున్నారు. సిమెంట్ , ఇసుక, ఐరన్ ఇలా వీటి ధరలు పెరగడంతో నిర్మాణ రంగంపై భారం పడింది. ఆ ప్రభావంతో ఫ్లాట్స్ ధరలు పెరిగాయి. అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా అధిక ధరలు పెడతారా చెప్పండి. అవును పదేపదే ఆలోచించి కొంటారు. అలా ఇప్పుడు సొంత ఇంటి కల నెరవేర్చుకునేవారు కాస్త ధర, నాణ్యత ముందున్న అవకాశాలు ఇలా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఏదేమైనా భాగ్యనగరంలో రియల్ గేర్ మారిన మాట వాస్తవం. కాస్త అమ్మకాలు తగ్గిన మాట సత్యం. కానీ మరీ రియల్ ఎస్టేట్ దిగజారిపోయేంతలా మాత్రం కాదండోయ్. సో రియల్ డమాల్ వార్తలు కేవలం ప్రచార ఆర్భాటాలే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.