Hyderabad Real Estate News: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఐటీ, ఫార్మా, మీడియా హబ్ కావడంతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేసేందుకు ఉద్యోగులు చుట్టుపక్కల జిల్లాలకు వెళ్తుంటారు. ఒకప్పుడు వీకెండ్ డెస్టినేషన్స్‌కు వెళ్లడం సంపన్నులకు మాత్రమే సాధ్యం! వేతనాలు, ఆదాయం పెరగడంతో ఐటీ, ఇతర ఉద్యోగుల్లోనూ ఈ సంస్కృతి పెరుగుతోంది. జాలీగా గడపడంతో పాటు అక్కడ రియల్ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. భాగ్యనగరానికి సమీపంలోని ఐదు వీకెండ్ డెస్టినేషన్స్ మీకోసం!
నల్లగొండ చాలా దగ్గర!
హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న జిల్లా నల్లగొండ. శతాబ్దాలుగా ఈ రెండు ప్రాంతాలకు సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. 100 కి.మీ దూరంలోనే ఉండటం, ఎన్‌హెచ్ 65, రైలు ప్రయాణ సదుపాయాలు ఉండటంతో ఉద్యోగులు అక్కడికి వెళ్లొస్తుంటారు. నాగార్జున సాగర్, ఎత్తిపోతల, పుట్టంగండి, గౌతమ బుద్ధ మ్యూజియం, భువనగిరి కోట, యాదాద్రి పుణ్యక్షేత్రం వంటివి ఇక్కడ ఉన్నాయి. ఈ జిల్లాలో రియల్ ఎస్టేట్ బూమ్ అసాధారణంగా ఉంది. 3 BHK, 5BHKలకు గిరాకీ ఉంది. చదరపు గజానికి రూ.3000-7000 వరకు పలుకుతోంది.
నదీతీర పుణ్యక్షేత్రాల కర్నూలు
పుణ్య క్షేత్రాలు, నదీ తీరాలకు కర్నూలు నెలవు. శ్రీశైలం, రాల్లపాడు వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ, ఉరవకల్లు రాక్ గార్డెన్, బేలామ్ గుహలు, పవర్ ప్రాజెక్టులు ఇక్కడున్నాయి. హైదరాబాద్ నుంచి కేవలం 200 దూరంలోనే ఉండటం, రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉండటం గమనార్హం. కర్నూలులోనూ రియల్ ఎస్టేట్ బాగుంది. 2, 3, 4BHKలు తక్కువకే దొరుకుతున్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ధరలు ఉంటున్నాయి. పెట్టుబడికి తగని లాభం ఉంటుంది.
వైవిధ్యానికి ప్రతీక మహబూబ్ నగర్
వజ్రాల గనులు, అటవీ సంపద, జీవ వైవిధ్యానికి మహబూబ్ నగర్ ప్రతీక. ప్రఖ్యాత కోహినూర్ డైమండ్ ఇక్కడ్నుంచే వెళ్లిందని అంటారు. భాగ్యనగరానికి 134 కి.మీ దూరమే. రైలు, రోడ్డు మార్గాల్లో ఇక్కడికెళ్లడం సులువు. గద్వాల్, క్రిస్టాయన్‌పల్లి, యెనుగొండ ప్రాంతాల్లో రియల్ బూమ్ ఉంది. 2BHK, 3BHK రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటున్నాయి. నెలకు రూ.6000 నుంచి 12,000 వరకు ఇంటి రెంట్ లభిస్తోంది.
వరంగల్ సాంస్కృతిక ఝరి
తెలంగాణ త్రినగరి వరంగల్. అద్భుతమైన శిల్ప, ప్రకృతి రమణీయతకు మారుపేరు. ప్రతిరోజూ వేల మంది వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తారు. వీకెండ్‌లో ఈ జిల్లాకు వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. భద్రకాళి ఆలయం, కోనేరు, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, ఏటూరు నాగారం వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ, గోదావరి నది తీరాల్లో వీకెండ్ ఆస్వాదించొచ్చు. బర్డ్ వాచింగ్, బోటింగ్, పాకాల చెరువులో ఫొటోగ్రఫీ చేయొచ్చు. భాగ్యనగరికి త్రినగరికి దూరం 150 కి.మీ. ఇక్కడ ఇళ్లకు రూ.70 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. పెట్టుబడికి సరైన లాభం ఉంటుంది.
కరీంనగర్‌లో అర్బనైజేషన్
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు 160 కి.మీ దూరం. మానేరుకు అందాలకు ఈ జిల్లా నెలవు. ఇక్కడ అర్బనైజేషన్ జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో ఆరోగ్య, విద్య హబ్‌గా మారింది. వేములవాడ, కొండగట్టు వంటి క్షేత్రాలు ఉన్నాయి. ధర్మపురి ఎంతో ఫేమస్. ఆధ్యాత్మిక సంపదకు కరీంనగర్ కేంద్ర బిందువు. అందుకే వీకెండ్స్‌లో ఎక్కువ రష్ కనిపిస్తోంది. ఇక్కడి పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో రియల్ బూమ్ పెరిగింది. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఇళ్ల ధర ఉంది.