PNB Special FD Offer: ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇన్వెస్టర్లు 7.85 శాతం వార్షిక వడ్డీ పొందొచ్చు. గరిష్ఠం రూ.2 కోట్ల వరకు ఒకేసారి డబ్బు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నాన్‌ కాలబుల్‌ 600 రోజుల డిపాజిట్‌ పథకం కింద కేవలం సీనియర్‌ సిటిజన్లు (60+ ఏళ్లు), సూపర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ (80+ ఏళ్లు) మాత్రమే ప్రత్యేక గరిష్ఠ వడ్డీను పొందొచ్చు.


సాధారణ ప్రజల కోసం 600 రోజులు కాలబుల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా 7 శాతం వరకు వడ్డీని అందుకోవచ్చు. ఇక 60 ఏళ్ల పైబడిన వారికి ఇదే పథకం కింద 7.50 శాతం వరకు వడ్డీని చెల్లిస్తారు. సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 600 రోజులు కాబుల్‌ ఎఫ్‌డీ కింద 7.80 వడ్డీని ఇస్తారు. నాన్‌ కాలబుల్‌ 600 రోజుల ఎఫ్‌డీలో సాధారణ ప్రజానీకం 7 శాతం, సీనియర్‌ సిటిజన్లు 7.55 శాతం, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.85 శాతం మేర వడ్డీ ఇస్తారు. నాన్‌ కాలబుల్‌ ఎఫ్‌డీలో ప్రీ మెచ్యూర్‌ విత్‌డ్రావల్‌ అవకాశం ఉండదు.


'మా విలువైన వినియోగదారులకు అత్యుత్తమ పథకాలు అందించడమే మా లక్ష్యం. అందుకే వారికి అత్యధిక వడ్డీరేటు ఆఫర్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కస్టమర్లు వారి పొదుపై గరిష్ఠ వడ్డీని పొందుతారు. పీఎన్‌బీ వన్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారానూ ఈ పథకంలో చేరొచ్చు' అని పీఎన్‌బీ ఎండీ, సీఈవో అతుల్‌ కుమార్‌ గోయెల్‌ అన్నారు.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మెచ్యూరిటీ తీరకముందే విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఉంటే దానిని కాలబుల్‌ ఎఫ్‌డీ అంటారు. సాధారణంగా గడువు తీరకముందే విత్‌డ్రా చేస్తే పెనాల్టీ రుసుములు విధిస్తారని తెలిసిందే. ఇలాంటి డిపాజిట్లకు లాకిన్‌ పీరియడ్‌ ఉండదు. నాన్‌ కాలబుల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్టర్లు ముందుగా విత్‌డ్రా చేసుకొనే సౌకర్యం ఉండదు. లాకిన్‌ పిరియడ్‌ ఉంటుంది. అందుకే వీటిని దృష్టిలో ఉంచుకొని డిపాజిట్‌ చేయడం మంచిది. ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచుతుండటంతో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీలను పెంచుతున్నారు. మున్ముందు ఇవి మరింత పెంచుతారని సమాచారం.