Unclaimed Maturity Amount In LIC: ఎల్‌ఐసీ (Life Insurance Corporation of India) మన దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ. కోట్లాది మంది ప్రజలు, ఎల్‌ఐసీ నుంచి జీవిత బీమా పాలసీలు తీసుకున్నారు. గతంలో, సాధారణంగా, కుటుంబ పెద్దలు మాత్రమే ఎల్‌ఐసీ పాలసీలు తీసుకునేవాళ్లు. చాలామంది, ఆ పాలసీల గురించి తమ కుటుంబ సభ్యులకు చెప్పే వాళ్లు కాదు. అలాంటి సందర్భాల్లో, పాలసీ కొన్న వ్యక్తి హఠాత్తుగా మరణించినప్పుడు, ఎల్‌ఐసీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందన్న విషయం కూడా ఆ కుటుంబ సభ్యులకు తెలిసేది కాదు. పాలసీ ఉందన్న సంగతి తెలీని కుటుంబ సభ్యులు దానిని క్లెయిమ్‌ చేయలేకపోయేవాళ్లు. అంతేకాదు, కొందరు పాలసీహోల్డర్లు జీవించి ఉన్నప్పటికీ, పాలసీ గురించి మరిచిపోయేవాళ్లు. ఇలా... దశాబ్దాలుగా ప్రజలు క్లెయిమ్‌ చేయని డబ్బు ఎల్‌ఐసీ (Unclaimed Amount In LIC) దగ్గర కుప్పలుతెప్పలుగా పేరుకుపోయింది. 


క్లెయిమ్ చేయని డబ్బు అంటే ఏంటి?
క్లెయిమ్ చేయని మొత్తం అంటే.. పాలసీదారులు మెచ్యూరిటీ తర్వాత కూడా విత్‌డ్రా చేయని డబ్బు. నిబంధనల ప్రకారం, పాలసీ మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారుడు మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం బీమా సంస్థ నుంచి డబ్బును తీసుకోకపోతే, ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయని డబ్బుగా పరిగణిస్తారు. పాలసీదారుడు ప్రీమియం చెల్లింపులను మధ్యలోనే ఆపేసి ఆ పాలసీ గురించి మరిచిపోవడం లేదా పాలసీ గురించి ఎవరికీ చెప్పకుండా మరణించినప్పుడు క్లెయిమ్‌ చేయని డబ్బు పోగుపడుతుంది. అంతేకాదు, పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు దానిని వెనక్కు తీసుకునే ప్రక్రియను పూర్తి చేయకుండా వదిలేస్తున్నారు. 


LIC దగ్గర క్లెయిమ్ చేయని మొత్తం ఎంత ఉంది?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, 2024లో, దాదాపు రూ. 880.93 కోట్ల మెచ్యూరిటీ డబ్బు ఉంది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.


క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ డబ్బు కోసం ఎలా చెక్‌ చేయాలి?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్‌క్లెయిమ్డ్ మెచ్యూరిటీ అమౌంట్‌ను చెక్‌ తనిఖీ చేయడానికి, మీరు LIC అధికారిక వెబ్‌సైట్ https://licindia.in/home ను సందర్శించాలి. హోమ్‌ పేజీలోని "కస్టమర్ సర్వీస్" ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత,  "అన్‌క్లెయిమ్డ్‌ అమౌంట్స్‌ ఆఫ్‌ పాలసీహోల్డర్స్‌" ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి. ఎల్‌ఐసీ పాలసీ నంబర్, పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నంబర్ వంటి వివరాలను పూరించి, చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. మీ క్లెయిమ్‌ను పొందడానికి, LIC కార్యాలయం నుంచి సంబంధిత ఫారం తీసుకోవచ్చు లేదా సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు, ఆ పాలసీకి సంబంధించిన ప్రీమియం రసీదులు, ఇతర అవసరమైన పత్రాలను ఆ ఫారంతో పాటు సమర్పించండి. ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే, అతని మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీ క్లెయిమ్‌ను పరిశీలిస్తుంది. అది ఆమోదం పొందిన తర్వాత క్లెయిమ్ చేయని డబ్బు మీ బ్యాంక్‌ ఖాతాకు బదిలీ అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!