What is NFO: ప్రతి వ్యక్తి, తన డబ్బును మంచి రాబడి ఇవ్వగల మార్గంలో మదుపు చేయాలని భావిస్తాడు. మంచి రాబడిని తిరిగి ఇవ్వగల సరైన పెట్టుబడి దారి కోసం ప్రజలు ఎప్పుడూ వెదుకుంటారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ కారణంగానే, తమ డబ్బును బ్యాంకు ఖాతాలో దాచుకునే బదులు, మంచి రాబడికి అవకాశం ఉన్న చోట పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అలాగని చిన్న పెట్టుబడిదార్లు (Small investors లేదా Retail investors) చిన్నబోవాల్సిన అవసరం లేదు. కేవలం 100 రూపాయలతోనూ పెట్టుబడి పెట్టగల NFO స్మాల్ ఇన్వెస్టర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
NFO అంటే ఏమిటి?
NFO అంటే న్యూ ఫండ్ ఆఫర్ (New Fund Offer). కొత్త పథకంలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులకు అవకాశం ఇచ్చే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఈ ప్రక్రియ దాదాపు IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) లాగానే ఉంటుంది. IPOలో కంపెనీలు తమ వాటాలను మొదటిసారి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. NFO కూడా అలాంటి అవకాశాన్ని అందిస్తుంది. NFO ద్వారా, ఆస్తి నిర్వహణ కంపెనీలు (Asset Management Companies - AMCs) పెట్టుబడిదారుల నుంచి డబ్బు సేకరిస్తాయి. ఆ డబ్బును వివిధ ఆస్తి తరగతులు లేదా వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తాయి.
NFO పెట్టుబడితో ప్రయోజనం ఎలా పొందాలి?
NFOలో పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తం కేవలం 100 రూపాయలు మాత్రమే. తక్కువ ఖర్చుతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే చిన్న పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపిక. మీరు దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో NFOలో పెట్టుబడి పెడితే, మంచి రాబడి పొందే అవకాశం ఉంది. సరైన పథకాన్ని ఎంచుకుంటే కాలక్రమేణా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. NFOలో ఈక్విటీ, డెట్ & హైబ్రిడ్ ఫండ్స్ వంటి వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. ఈ పెట్టుబడి, పెట్టుబడిదార్ల పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం తీసుకువస్తుంది. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం వల్ల పెట్టుబడి రిస్క్ తగ్గుతుంది.
NFOలో ఎలా పెట్టుబడి పెట్టాలి? (How to invest in NFO?)
NFOలో పెట్టుబడి పెట్టడానికి, ముందుగా, వివిధ NFOలను పోల్చి, మీ ఆర్థిక లక్ష్యాల ప్రకారం సరైన ఫండ్‌ను ఎంచుకోండి. మీకు మ్యూచువల్ ఫండ్ ఖాతా లేకపోతే, ఏదైనా AMC లేదా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా ఖాతా తెరవండి. తర్వాత, మీ ఆర్థిక శక్తి కొద్దీ (కనీసం రూ.100) పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించండి. ఆ తరువాత ఫామ్ నింపి డబ్బులు చెల్లించండి. అంతే, NFOలో మీ పెట్టుబడి ప్రారంభం అవుతుంది. ఏటా, మీ సామర్థ్యం ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ, దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన డబ్బు మీ సొంతం అవుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రూ.12 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందేనా?