How To Claim Car Insurance: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఆ వరదల్లో మోటారు వాహనాలు కొట్టుకుపోవడం లేదా నీటిలో మునిగిపోవడం వంటి వీడియోలు, ఫోటోలను తరచుగా మనం చూస్తున్నాం. మీ వాహనానికి బీమా ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే.. వర్షపు నీరు లేదా వరదల్లో కొట్టుకుపోయిన కారు లేదా బైక్‌పై ఎంత బీమా డబ్బు వస్తుంది?.
వాహన నష్టాన్ని ఏ రకమైన బీమా కవర్ చేస్తుంది?
సమగ్ర కవరేజీ (Comprehensive insurance coverage) ఉన్న మోటారు బీమా పాలసీలు మాత్రమే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది. సమగ్ర ప్యాకేజ్‌లో కూడా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చే కవరేజీ ఐచ్ఛికం. కాబట్టి, మీరు ఇన్సూరెన్స్ పాలసీ కొనే ముందే డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవాలి. వరదలు, అగ్నిప్రమాదం, భూకంపం, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు, మానవ ప్రేరేపిత విపత్తులకు, ప్రమాదాలకు కూడా సమగ్ర బీమా పాలసీ నుంచి సమగ్ర రక్షణ అందుతుంది. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. వరదలు లేదా నీటిలో మునిగిపోవడం వంటి నష్టాలను అది కవర్ చేయదు.
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని షరతులు
సమగ్ర కారు బీమా పాలసీ ఉంటే, వరదలు లేదా నీటిలో మునిగిపోవడం వల్ల కలిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. అయితే, ఇంజిన్ దెబ్బతినడానికి సంబంధించిన పరిస్థితులను తెలుసుకోవడం ముఖ్యం. డిప్రిసియేషన్ లెక్కిస్తారు కాబట్టి, సమగ్ర కారు బీమా పాలసీ ఇచ్చే కవరేజ్ కారు వయస్సుపై ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు, రబ్బర్ లేదా ప్లాస్టిక్ భాగాలకు జరిగిన నష్టాన్ని సరిచేయడానికి అయ్యే ఖర్చులో 50 శాతం మాత్రమే పాలసీ కవర్ చేస్తుంది.
వరద/నీటిలో మునగడం వల్ల కారుకు జరిగే నష్టాలు
వర్షపు నీరు లేదా వరద నీటిలో కార్ చిక్కుకుపోతే ఇంజిన్ దెబ్బతింటుంది, వాహనం ఆగిపోతుంది.
గేర్ బాక్స్‌లోకి నీరు చేరితే ఈ యూనిట్ దెబ్బతింటుంది.
కారులోకి నీరు చేరితే, కారులోని ఎలక్ట్రానిక్ భాగాలు దెబ్బతింటాయి. సిగ్నల్ లైట్లు, స్పీడోమీటర్, ఇండికేటర్లు వంటివి పాడైపోవచ్చు.
కార్పెట్, సీట్లు, కుషన్‌లు, ఇంటీరియర్, సీట్ కవర్‌లు వంటివి అంతర్గత నష్టం కిందకు వస్తాయి.
ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, జీరో డిప్రిసియేషన్ వంటి యాడ్-ఆన్‌లను సమగ్ర బీమా పాలసీతో పాటు తీసుకుంటే, వర్షాలు/వరదల సమయంలో ఇంజిన్‌లోకి నీరు చేరినప్పుడు కూడా కవర్ చేయవచ్చు. ఇది లేకపోతే, ఇంజిన్ రిపేర్ ఖర్చు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.
కార్ మునిగిపోయినప్పుడు ఇన్సూరెన్స్‌ను ఇలా క్లెయిమ్ చేయాలి
కార్ మునిగిపోయిన విషయాన్ని బీమా సంస్థకు తక్షణమే తెలియజేయండి. కార్ కంపెనీకి కూడా విషయం చెప్పండి.
కారు మునిగిపోయినా లేదా కొట్టుకుపోయిన సమయంలో వీడియో తీయడం లేదా ఫోటోలు తీయడం వంటివి చేస్తే, నష్టానికి సంబంధించిన సాక్ష్యాలుగా పనికొస్తాయి.
కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), కారు యజమాని డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ (DL), పాలసీ డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీ కూడా దగ్గర పెట్టుకోండి.
ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చిన తర్వాత అవసరమైన అన్ని పత్రాలు ఇవ్వండి.
వాహనం నీటిలో మునిగితే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ఇంజిన్/ఇగ్నిషన్‌ను స్టార్ట్ చేయవద్దు. పుష్ స్టార్ట్ కోసం ప్రయత్నించొద్దు. ఇలా చేస్తే ఇంజిన్‌లోకి నీరు చేరి డ్యామేజ్ పెరిగే ప్రమాదం ఉంది.
కారు బ్యాటరీని వేరు చేయండి. దీనివల్ల షార్ట్‌సర్క్యూట్ వంటి ప్రమాదాలు తప్పుతాయి.
బ్రేక్‌లను చెక్ చేయండి. నీటిలో చిక్కుకున్నప్పుడు బ్రేక్ డిస్క్, బ్రేక్ ప్యాడ్ లేదా బ్రేక్ లైన్‌లోకి నీరు చేరి అవి పాడయ్యే అవకాశం ఉంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చిట్కాలు
వర్షాకాలంలో మీ కారు/బైక్‌ను ఎత్తైన ప్రదేశంలో పార్క్ చేయండి.
కారు డోర్లు, అద్దాలు సరిగ్గా మూసుకుపోయాయో, లేదా చెక్ తనిఖీ చేయండి. దీనివల్ల నీరు కూడా లోపలకు వెళ్లే అవకాశం తగ్గుతుంది.
వీలైతే, బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయండి. నీరు బోనెట్‌లోకి వచ్చినప్పటికీ విద్యుత్ సంబంధిత భాగాలు దెబ్బతినవు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి