HDFC Bank’s New Credit Card Rules: దేశంలోని ప్రతి బ్యాంక్.. రెగ్యులేటరీ నిబంధనలు & సొంత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తుంటుంది. దేశంలో అతి పెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా, తన క్రెడిట్ కార్డ్స్‌కు సంబంధించి చాలా విషయాల్లో మార్పులు చేస్తోంది. ఇతర బ్యాంకులు అనుసరిస్తున్న రూల్స్‌కు దగ్గరగా ఉండేలా వాటిని మారుస్తోంది. సవరించిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు 01 ఆగస్టు 2024 నుంచి అమవుతాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్:
--- HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి... క్రెడ్ (CRED), పేటీఎం (Paytm), చెక్ (Cheq), మొబిక్విక్ (MobiKwik), ఫ్రీఛార్జ్ (Freecharge) సహా థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా అద్దె చెల్లింపులపై కొత్త ఫీజ్ వసూలు చేస్తుంది. ఒక్కో లావాదేవీ మొత్తంపై 1% ఛార్జీని విధిస్తుంది, గరిష్టంగా రూ. 3,000 వరకు వసూలు చేస్తుంది.
--- HDFC క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా చెల్లించే స్కూల్/కాలేజ్ ఫీజులపై ఒక్కో ట్రాన్జాక్షన్‌కు 1% లేదా గరిష్టంగా రూ. 3,000 వరకు ఛార్జీ విధిస్తుంది. ఇతర బ్యాంకుల పాలసీలకు అనుగుణంగా ఈ రూల్ మార్చింది. కాబట్టి, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా HDFC క్రెడిట్ కార్డ్‌లతో విద్యా సంబంధ చెల్లింపులు చేస్తుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
--- అయితే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి విద్యా సంబంధ చెల్లింపులు చేసే విషయంలో 'కొన్ని మినహాయింపులు' ఉన్నాయి. కాలేజీ లేదా స్కూల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినా. లేదా. స్కూల్/కాలేజీ PoS మెషీన్‌ల ద్వారా నేరుగా పే చేసినా ఆ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదు. ఈ రూట్‌ను ఫాలో అయితే మీకు 1% డబ్బు మిగులుతుంది. అంతర్జాతీయ విద్య కోసం థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి చెల్లించినప్పటికీ 1% ఫీజ్ ఉండదు.
--- మీ యుటిలిటీ బిల్లును (విద్యుత్, నీరు, గ్యాస్ వంటివి) హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తున్నప్పుడు అలెర్ట్‌గా ఉండాలి. రూ. 50,000 వరకు లావాదేవీలకు బ్యాంక్ రుసుము వసూలు చేయదు. రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తం యుటిలిటీ బిల్లు కడితే, ఆ లావాదేవీ మొత్తంలో 1% లేదా గరిష్టంగా రూ. 3,000 ఫీజ్ తీసుకుంటుంది.
--- మీ బండిలో పెట్రోల్ కొట్టించి, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు, ఆ లావాదేవీ మొత్తం రూ. 15,000 కంటే తక్కువ ఉంటే ఎలాంటి ఫీజ్ తీసుకోదు. రూ. 15,000 కంటే ఎక్కువైతే, ఒక్కో లావాదేవీ విలువలో 1% లేదా గరిష్టంగా రూ. 3,000 వసూలు చేస్తుంది.
--- రివార్డ్ పాయిట్లను రిడీమ్ చేసుకున్నా ఛార్జీలు అమలు చేస్తుంది. ఆగస్టు 01 నుంచి, రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అందరూ రూ. 50 చెల్లించాలి.
--- ఆగస్టు 01 నుంచి, HDFC బ్యాంక్ 6E రివార్డ్స్ క్రెడిట్ కార్డ్‌ల యాన్యువల్/రెన్యువల్ ఛార్జీలు భారీగా పెరుగుతాయి. 6E Rewards XL-IndiGo HDFC Bank Credit Card వార్షిక/పునరుద్ధరణ ఛార్జీలు ప్రస్తుతం రూ. 1,500 + GST గా ఉంది. 6E Rewards IndiGo HDFC Bank Credit Card విషయంలో రూ. 500 + GST ఛార్జ్ చేస్తోంది. ఈ రేట్లు వరుసగా... రూ. 3,000 + GST, రూ. 1,500 + GST గా మారతాయి.
--- మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఏదైనా వస్తువు కొని Easy-EMI ఆప్షన్ ఎంచుకుంటే, ఒక్కో లావాదేవీపై రూ. 299 వరకు ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జ్ చేస్తుంది.
--- క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్ ఫీజును కూడా ఆగస్టు 01 నుంచి అప్‌డేట్ చేస్తోంది. ఆ రోజు నుంచి, మీ బకాయి బ్యాలెన్స్ ఆధారంగా రుసుము మొత్తం మారుతుంది. ఇది రూ. 100 నుంచి రూ. 1300 రేంజ్‌లో ఉంటుంది.
థర్డ్ పార్టీ యాప్‌ల వినియోగాన్ని, ముఖ్యంగా అద్దె, విద్యా సంబంధ చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించడాన్ని తగ్గించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలాంటి రూల్స్ తీసుకొచ్చింది. కాబట్టి, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌ను ఉపయోగించి థర్డ్ పార్టీ యాప్ ద్వారా చెల్లిస్తుంటే, మరోమారు ఆలోచించడం అవసరం. లేదా ఉత్త పుణ్యానికి రూ. 3000 వదులుకోవాల్సి వస్తుంది.
మరో ఆసక్తికర కథనం:మీ జీవిత భాగస్వామే మీ పాలిట వరాల మూట - రూ. 7 లక్షల వరకు పన్ను ఆదా!