Income Tax Return Filing 2024: భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ మానసికంగానే కాదు, ఆర్థికంగా కూడా ప్రయోజనకరం. ముఖ్యంగా, ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సమయంలో ఆ బంధం మీపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది, డబ్బును ఆదా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) కోసం మీరు చేసే కొన్ని ఖర్చులు లేదా పెట్టుబడుల వల్ల పన్ను ఆదా పొందొచ్చు. 


ఐటీఆర్‌ ఫైల్‌ చేసే సమయంలో మూడు కీలక వ్యూహాలు అనుసరిస్తే, మీతో పాటు మీ జీవిత భాగస్వామి ఆదాయ పన్నులో 7 లక్షల రూపాయల వరకు ఆదా చేయొచ్చు.


1. మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకున్న విద్యా రుణం
చాలా మంది వివాహం తర్వాత కూడా చదువు కొనసాగిస్తారు. ప్రస్తుతం, విద్యా ద్రవ్యోల్బణం షాక్‌ కొడుతోంది. పెద్ద చదువులు చదవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి. గట్టి ఆర్థిక స్థోమత లేని వాళ్లు బ్యాంక్‌ నుంచి ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి పేరు మీద విద్యా రుణం తీసుకుంటే... చదువు కోసం డబ్బు సమకూరడమే కాదు, పన్ను కూడా ఆదా అవుతుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80E ప్రకారం, మీరు ఈ లోన్‌పై ఏటా చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపును (tax exemption on the interest on the education loan) క్లెయిమ్ చేయవచ్చు. ఎనిమిది సంవత్సరాల వరకు ఇలా క్లెయిమ్‌ చేయవచ్చు. ఇక్కడో చిన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గుర్తింపు పొందిన బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకున్న రుణానికే ఈ వెసులుబాటు ఉంటుంది.


2. స్టాక్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులు 
మీ జీవిత భాగస్వామి పేరుతో స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టారా?. ఇక్కడ కూడా మీకు టాక్స్‌ సేవ్‌ అవుతుంది. మీరు, మూలధన లాభాలపై 1 లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపుల ప్రయోజనం తీసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆదాయం తక్కువగా ఉన్న సందర్భంలో లేదా వారికి ఏ రకమైన ఆదాయం లేని సందర్భంలో ఈ వ్యూహం మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. పెట్టుబడి ప్రయోజనాల కోసం మీ భార్య/భర్తకు కొంత డబ్బును బదిలీ చేయొచ్చు, మీ కుటుంబం మొత్తం పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.


3. ఉమ్మడిగా తీసుకున్న గృహ రుణం 
అద్దె ఇంటి బాధలు వర్ణనాతీతం. కాబట్టి, మన దేశంలోని పేద & మధ్య తరగతి కుటుంబాలు సొంత ఇంటి కోసం తహతహలాడతాయి. కనీసం చిన్నపాటి ఇంటినైనా కొనేందుకు ప్లాన్ చేస్తాయి. ఒకవేళ, జాయింట్ హోమ్ లోన్ ద్వారా మీరు ఇల్లు కొంటే, ఆ "ఇంటి ఆస్తిని ఇద్దరి పేర్లతో రిజిస్టర్" అయితే, దానివల్ల మీ పన్ను ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. జీవిత భాగస్వాములు ఇద్దరూ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ప్రిన్సిపల్ అమౌంట్‌పై "తలో రూ. 1.5 లక్షల వరకు" క్లెయిమ్ చేయవచ్చు. అంటే.. మొత్తం రూ. 3 లక్షలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనం ఇక్కడితో ఆగిపోలేదు. సెక్షన్ 24 కింద, ఇద్దరూ చెల్లించిన వడ్డీపై తలో రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు, ఈ మొత్తం రూ. 4 లక్షలు అవుతుంది. అంటే.. ఉమ్మడిగా తీసుకునే గృహ రుణం ద్వారా మొత్తం రూ. 7 లక్షల ఆదాయం వరకు టాక్స్‌ ఆదా చేయవచ్చు.


2024-25 మదింపు సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఈ నెలాఖరు వరకే సమయం ఉంది. పైన చెప్పిన మొత్తం 3 వ్యూహాలు లేదా వాటిలో ఏవైనా మీకు వర్తిస్తే, ITR ఫైలింగ్‌ సమయంలో ఆ ప్రయోజనాలను క్లెయిమ్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ ఏ ఒక్కటీ మీకు వర్తించకపోయినా, భవిష్యత్‌లో టాక్స్‌ ఆదా చేయాలంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: కొత్త పన్ను విధానంలోనూ 6 మినహాయింపులు - టాక్స్‌ భారం తగ్గుతుంది, డబ్బు మిగులుతుంది