How do you know whether an NBFC accepting deposits is genuine or not: డిపాజిట్ల పైన 12 శాతం వడ్డీ ఇస్తామని, ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని ఆఫర్లు ఇస్తుంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు! సాధారణంగా బ్యాంకులు ఇంత వడ్డీని ఆఫర్ చేయవు. ఇతర ఫైనాన్షియల్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే ఇలాంటి ఆఫర్లు ఇస్తాయి. అలాగని ఎందులో పడితే అందులో డబ్బులు డిపాజిట్ చేస్తే తర్వాత నష్టపోయే ప్రమాదం ఉంది. మోసపూరిత ఆర్థిక సంస్థల వలలో పడకుండా ఉండేందుకు ఆర్బీఐ కొన్ని జాగ్రత్తలు చెప్పింది.
కొన్ని రోజులు క్రితమే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 'BE(A)WARE' అనే హ్యాండ్‌బుక్‌ను రిలీజ్ చేసింది. ఆర్థిక లావాదేవీలు చేపట్టేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది. నకిలీ ఎన్‌బీఎఫ్‌సీలను ఎలా గుర్తించాలో వివరించింది. చాలా వరకు నకిలీ ఎన్‌బీఎఫ్‌సీలు భారీగా వడ్డీని ఆఫర్ చేస్తూ కస్టమర్లను మోసం చేస్తుంటాయి. దాంతో ఇలాంటి మోసం కేసులు బాగా పెరుగుతున్నాయి. ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్లను సేకరిస్తే మొదట చేయాల్సింది ఆ కంపెనీకి డిపాజిట్లు సేకరించే అర్హత, అనుమతి ఉన్నాయో లేదో ఆర్బీఐలో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం https://rbi.org.inలో లాగిన్ అవ్వొచ్చు.
- రిజర్వు బ్యాంకు ఇచ్చిన సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌ను ప్రతి ఎన్‌బీఎఫ్‌సీ తమ శాఖలో ప్రదర్శించాలి. తమకు డిపాజిట్లు సేకరించేందుకు ఆర్‌బీఐ అనుమతి ఉందో లేదో చూపించాలి. ఆ సర్టిఫికెట్‌ను కస్టమర్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
- ఎన్‌బీఎఫ్‌సీలు 12 నెలల కన్నా తక్కువ సమయానికి డిపాజిట్లు సేకరించేందుకు వీల్లేదు. అలాగే 60 నెలలకు మించి తీసుకొనేందుకు వీల్లేదు. ఎన్‌బీఎఫ్‌సీలు 12.5 శాతానికి మించి వడ్డీని చెల్లించేందుకు అనుమతి లేదు.
- కస్టమర్లు డిపాజిట్ చేసినప్పుడు ప్రతి డిపాజిట్‌కు ప్రాపర్‌గా ఉన్న రసీదును ఎన్‌బీఎఫ్‌సీ నుంచి తీసుకోవాలి.
- కంపెనీ అధీకృతంగా నియమించిన అధికారి సంతకం ఆ రసీదుపై ఉండాలి. డిపాజిట్ చేసిన తేదీ, డిపాజిట్‌దారు పేరు, జమ చేసిన డబ్బుల మొత్తం, చెల్లించాల్సి వడ్డీ, మెచ్యూరిటీ తేదీ, మొత్తం వివరాలు ఉండాలి.
- ఎన్‌బీఎఫ్‌సీ తరఫున డిపాజిట్లు సేకరించే బ్రోకర్లు, ఏజెంట్లు, ఇతర వ్యక్తులు కంపెనీ అదే పర్పస్‌కు ఉద్దేశించిన వారై ఉండాలి.
- ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండదని కస్టమర్లు తెలుసుకోవాలి.
- ఎన్‌బీఎఫ్‌సీలో డిపాజిట్లు చేయడం సురక్షితం కాదని తెలుసుకోవాలి. వీరికి బీమా సదుపాయం వర్తించదు.