సొంతిల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల! అందుకే గృహరుణాలు తీసుకొని చాలామంది ఆ కలను నిజం చేసుకుంటారు. పండగల వేళ చాలా బ్యాంకులు ఇంటి రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఇంటి రుణానికి కాల వ్యవధి 30 ఏళ్లు. కానీ యెస్‌ బ్యాంకు 35 ఏళ్ల కాల పరిమితితో రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక ఉద్యోగి సాధారణంగా 30  నుంచి 32 ఏళ్లే పనిచేస్తారు. అలాంటప్పుడు 35 ఏళ్ల రుణ వ్యవధి లాభదాయకమా? నష్టమా?


యెస్‌ ప్రీమియర్‌ హోమ్‌లోన్‌
దేశవ్యాప్తంగా 2021 జూన్‌ నాటికి రూ.30 లక్షల కోట్ల విలువైన గృహ రుణాలు తీసుకున్నారు. ఇంకా ఎంతోమంది రుణాలు తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే పండుగల సీజన్లో యెస్‌ బ్యాంకు ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 'యెస్‌ ప్రీమియర్‌ హోమ్‌ లోన్స్‌' పేరుతో 6.7 శాతం వడ్డీతో 35 ఏళ్ల కాలపరిమితితో  రుణాలు ఇస్తోంది. అయితే కేవలం 90 రోజులు మాత్రమే ఈ ఆఫర్‌ ఉంటుంది. సులభంగా ఈఎంఐలు కట్టుకోవచ్చు. రీపేమెంట్‌ ఛార్జీలేమీ లేవు! డాక్యుమెంటేషన్‌ సైతం తక్కువే. 2021, డిసెంబర్‌ 31 వరకు ఈ ఆఫర్‌ ఉంటుంది.


తగ్గించిన వడ్డీరేటు
చాలా వరకు వాణిజ్య బ్యాంకులు ఇంటి రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంకు అయితే అందరి కన్నా తక్కువగా 6.50 శాతం వడ్డీకే రుణాలు ఇస్తోంది. కాల వ్యవధిని 30 ఏళ్లుగా ప్రకటించింది. ఇక మిగతా బ్యాంకులు కూడా 15 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించి రుణాలు అందజేస్తున్నాయి. భారతీయ స్టేట్‌ బ్యాంకు సైతం 6.7 శాతం వడ్డీరేటునే అమలు చేస్తోంది. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 6.5 నుంచి 6.75 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తున్నాయి.


లాభమా? నష్టమా?
వినియోగదారుడి దృష్టిలో ఇంటి రుణాలపై 35 ఏళ్ల కాల వ్యవధి బాగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ నెలలు ఉండటం వల్ల ఈఎంఐల భారం తక్కువగా ఉంటుంది. కానీ వడ్డీ మాత్రం ఎక్కువగా కట్టాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. బ్యాంకుల సైతం 35 ఏళ్ల వల్ల ప్రతికూలత ఉంటుందని అంచనా వేస్తున్నారు. 25 ఏళ్ల వయసున్న వారు ఇంటిరుణాలు తీసుకుంటే  ఈఎంఐలు కట్టడం 60 ఏళ్లకు పూర్తవుతుంది. ఇబ్బందులు ఎదురైతే మాత్రం అది ఎన్‌పీయేగా మారే అవకాశం లేకపోలేదు. ఇక 28 ఏళ్ల వయసులో రుణం తీసుకుంటే వ్యవధి పూర్తయ్యేందుకు 63 ఏళ్లు నిండుతాయి. 60 ఏళ్లకే రిటైర్‌ అవుతే మిగతా మూడేళ్లు ఈఎంలు చెల్లించడం కష్టమవుతుంది.


Also Read: అమెజాన్‌లో బడ్జెట్ 5జీ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఫీచర్లు కూడా అదుర్స్!


Also Read: దిల్లీకి మరో గుబులు! ఒకట్రెండు రోజులే బొగ్గు నిల్వలు.. కరెంటు ఉండదా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి