RBI MPC June 2023 Meeting: రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రెండో ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలోనూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించింది. ఇప్పుడు, రెపో రేటు (RBI repo rate) 6.5 శాతంగా ఉంది. 


రియల్ ఎస్టేట్ రంగానికి శుభవార్త
రెపో రేటును పెంచకూడదన్న ఆర్‌బీఐ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకుంది. రియల్ ఎస్టేట్ రంగం ప్రైస్‌ సెన్సిటివ్ సెక్టార్‌. గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును నిరంతరం పెంచడం వల్ల తక్కువ/ మధ్య తరగతి ఆదాయ వర్గాలకు ఇల్లు కొనడం కష్టంగా మారింది. 2022 మే నుంచి ఆ ఆర్థిక సంవత్సరం చివరి వరకు, సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును మొత్తం 5 సార్లు పెంచింది. 4 శాతం నుంచి 6.50 శాతానికి చేర్చింది. ఇది నేరుగా బ్యాంకు రుణ వడ్డీ రేట్లపై ప్రభావం చూపింది. ఆ ఏడాది కాలంలో బ్యాంకులు తమ MCLRలను చాలాసార్లు పెంచాయి. దీంతో ప్రజలపై EMIల భారం పెరిగింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి, దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం వల్ల, RBI రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు, అది 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంది.


అందుబాటు ధరల్లో ఉండే ఇళ్ల విక్రయాలపై ప్రభావం
రెపో రేటు పెరుగుదల మొత్తం 260 పైగా సెక్టార్ల మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ కాలంలో ప్రజలపై గృహ రుణ భారం పెరిగింది. ఆ ప్రత్యక్ష ప్రభావం సరసమైన ధరల్లో ఉండే ఇళ్ల (affordable housing) అమ్మకాలపై కనిపిస్తుంది. రెపో రేటును పెంచకూడదని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, పెట్టుబడిదార్లు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈఎంఐ భారం ఆందోళన ప్రజల్లో తొలగిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రతి విభాగంలోనూ విక్రయాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు.


పండుగ సీజన్‌లో సానుకూల ప్రభావం
RBI తాజా నిర్ణయం తర్వాత, రాబోయే కొన్ని నెలల్లో భారతదేశంలో హౌసింగ్ డిమాండ్ బాగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో పాటు, సంవత్సరం చివరిలో వచ్చే పండుగ సీజన్‌లో ఈ స్థిరమైన వడ్డీ రేటు ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రస్తుతం, దేశంలో ద్రవ్యోల్బణం రేటు 18 నెలల కనిష్ట స్థాయిలో ఉంది. RBI రాబోయే కాలంలో రెపో రేటును తగ్గించవచ్చని కూడా కొందరు నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల, రానున్న కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మేలు జరుగుతుంది.


RBI కఠిన ద్రవ్య విధానం కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. 2022 మే నెలలో, రెపో రేటును పెంచడం ప్రారంభించినప్పుడు దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.8 శాతంగా ఉంది. ఆ తర్వాత, రెపో రేటును క్రమంగా పెంచుతూ RBI కఠినంగా వ్యవహరించడం వల్ల ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ నాటికి 4.7 శాతానికి తగ్గింది. మే నెలలో ఈ రేటు 25 నెలల కనిష్టానికి తగ్గుతుందని RBI అంచనా వేసింది. ఇది ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది.


మరో ఆసక్తికర కథనం: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ