RBI Keeps Repo Rate Unchanged: బ్యాంక్‌ వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం రెండో సమావేశంలో  తాజా MPC మీటింగ్‌లో, రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో, ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 6.50% వద్దే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ‍‌(RBI governor shaktikanta das) కొనసాగించారు. ఫలితంగా బ్యాంక్‌ లోన్లు రేట్లు కూడా మారకుండా పాత రేట్లే కొనసాగుతాయి. సామాన్యుడికి ఇది ఊరట. MPCలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు "వడ్డీ రేట్ల పెంపులో విరామం" నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశారు. 2024 ఆర్థిక సంవత్సరం రెండో RBI MPC సమావేశం ఈ నెల 6న (మంగళవారం) ప్రారంభమై, నేటి (గురువారం) వరకు కొనసాగింది.


వడ్డీ రేట్లను తగ్గించకుండా పాత రేట్లనే కొనసాగించిన ఆర్‌బీఐ, ఆర్థిక వ్యవస్థలో 'స్నేహపూర్వక వైఖరిని తగ్గించే' (withdrawal of accommodation) విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏప్రిల్‌లో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలోనూ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. అయితే, 2022 మే నెల నుంచి మార్చి వరకు, అంటే గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 250 బేసిస్‌ పాయింట్లు లేదా 2.50% పెంచింది. 


RBI గవర్నర్ చేసిన ప్రకటనలు:


రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు, ఇది 6.50 శాతం వద్ద కొనసాగుతుంది.
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్‌ 6.25 శాతం వద్ద ఉంటుంది, ఎటువంటి మార్పు లేదు.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్‌, బ్యాంక్ రేట్‌ కూడా మారలేదు. 6.75 శాతంగా ఉన్నాయి.
CPI ద్రవ్యోల్బణం రేటు ఇప్పటికీ RBI లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంచనాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు  4 శాతం కంటే ఎక్కువగానే ఉండొచ్చు.


రుతుపవనాలపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్
రుతుపవనాల వార్తలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో అనిశ్చితి, అంతర్జాతీయ కమొడిటీ ధరల్లో పెరుగుదల, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వల్ల అధిక ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థకు రిస్క్‌గా మారిందని చెప్పారు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా, రెండో త్రైమాసికంలో 5.2 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.4 శాతంగా, చివరి త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా.


ఆర్థిక వృద్ధిపై ఆర్‌బీఐ అంచనాలు
ఆర్‌బీఐ, 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా అంచనా వేసింది. త్రైమాసిక ప్రాతిపదికన, GDP వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8 శాతంగా, రెండో త్రైమాసికంలో 6.5 శాతంగా, మూడో త్రైమాసికంలో 6 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.7 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 


లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌లో రిజర్వ్ బ్యాంక్ పనితీరు బాగుందని గవర్నర్ అన్నారు. అంచనాలకు తగ్గట్లుగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు అవసరమైన తదుపరి నిర్ణయాలు MPC తీసుకుంటుందని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.


మరో ఆసక్తికర కథనం: డబ్బు సంపాదించే షేర్ల కోసం వెతకొద్దు, ఇదిగో స్టాక్స్‌ లిస్ట్‌!