RBI Repo Rate Unchanged: రేపో రేటు యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా రెపో రేటును 6.50% వద్దే ఉంచారు. మూడు రోజుల పాటు (జూన్ 6-8 తేదీల్లో) జరిగిన MPC సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. MPCలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు "వడ్డీ రేట్ల పెంపులో విరామం" నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఆ తర్వాత ఏప్రిల్‌లో జరిగిన MPC సమావేశంలో కూడా రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ పెంచలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) జరిగిన రెండో ద్రవ్య విధాన నిర్ణయ సమావేశం ఇది. ఈసారి కూడా రెపో రేటును పెంచకపోవడం సామాన్యుడికి దక్కిన ఊరట. దీనివల్ల, బ్యాంక్ లోన్ రేట్లు పెరగవు.
అయితే, 2022 మే నెల నుంచి మార్చి వరకు, అంటే గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50% పెంచింది, 4.50% నుంచి 6.50%కు చేర్చింది.
బ్యాంక్ వడ్డీ రేట్లను ఈ విధంగా నిర్ణయిస్తారు
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 'కీ పాలసీ రేట్' అని కూడా అంటారు. దీని ప్రకారం బ్యాంకులు రుణ రేటు & డిపాజిట్ రేటును నిర్ణయిస్తాయి. వాస్తవానికి, రెపో రేటు అనేది బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకునే రేటు. ఈ విధంగా, బ్యాంకుల నిధుల ఖర్చు రెపో రేటు ద్వారా నిర్ణయం అవుతుంది. రెపో రేటు పెరిగితే బ్యాంకుల మూలధన వ్యయం పెరుగుతుంది. కాబట్టి, బ్యాంకులు రుణంపై వడ్డీని పెంచుతాయి. రెపో రేటు తగ్గితే మూలధన వ్యయం తగ్గుతుంది కాబట్టి రుణ రేట్లను తగ్గిస్తాయి.
EMI నుంచి ఉపశమనం
ఫిబ్రవరి సమావేశం నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును స్థిరంగా ఉంచడంతో, చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. బ్యాంకు రుణాలు అనుసంధానమై ఉండే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్, రెపో రేటుపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ మెత్తబడడం ప్రారంభించింది కాబట్టి, రాబోయే కాలంలో గృహ రుణాల నుంచి వ్యక్తిగత రుణాల వరకు వివిధ లోన్ లేట్లు రేట్లు తగ్గవచ్చు. మరోవైపు, ఇప్పటికే గృహ రుణం ఉన్నవారిపై EMI భారం తగ్గించవచ్చు.
రానున్న కాలంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వని రాణా చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో చాలా వరకు విజయం సాధించామన్నారు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండి, రుతుపవనాలు కూడా బాగుంటే, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది.
ఇల్లు కొనేవారికి పెద్ద ఊరట
రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయం గృహ కొనుగోలుదారులకు మేలు చేస్తుందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి చెప్పారు. గృహ రుణాల వడ్డీ రేట్లు 10 శాతం లోపే ఉన్నాయని చెప్పారు. రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇళ్లకు డిమాండ్ ఊపందుకుంది. మొదటిసారి ఇల్లు కొనడానికి సిద్ధమవుతున్న వారికి కూడా ఈ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: లోన్లు తీసుకునేవాళ్లకు భారీ ఊరట - ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరగలేదు