Home Loan Rates:


ఒక్క ఏడాదిలో ఎంత మార్పు! దశాబ్దంలోనే అత్యల్ప వడ్డీరేట్లు ఉండటంతో హోమ్‌లోన్స్‌ తీసుకోవాలని బ్యాంకులు తెగ ఆఫర్లు ఇచ్చాయి. మంచి తరుణం మించిన దొరకదంటూ టార్గెట్లు పెట్టుకొని మరీ రుణాలు మంజూరు చేశాయి. ఏ క్షణాన ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు మొదలయ్యాయో కస్టమర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. 6.5 శాతంగా ఉన్న వడ్డీరేటు ఇప్పుడు 9 శాతానికి ఎగబాకింది.  ఆర్బీఐ పది నెలల్లో రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో ఈఎంఐలు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఫలితంగా అప్పులు తీర్చాల్సిన గడువు రిటైర్మెంట్‌ వయసునూ దాటేస్తోంది.


ఫ్లోటింగ్‌ వడ్డీరేట్లతో కస్టమర్లపై రుణభారం పెరిగింది. ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. అప్పుల కోసం రీఫైనాన్స్‌ చేసుకొనేందుకు ఇదే మంచి సమయమని విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త కస్టమర్ల కోసం తమ మార్జిన్‌ను త్యాగం చేసేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నారని అంటున్నారు. దీంతో అప్పులపై రుణ గ్రహీత 100 బేసిస్‌ పాయింట్ల మేర ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఓ ఉద్యోగి రెండేళ్ల క్రితం 7.6 శాతం వడ్డీకి రూ.59 లక్షల రుణం తీసుకున్నారు. ఇప్పుడా వడ్డీరేటు ఏకంగా 10 శాతానికి చేరింది. దాంతో రిటైర్మెంట్‌ వయసు దాటాక మరో రెండేళ్లు రుణ వ్యవధిని పొడగించాల్సి వచ్చింది.


ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రుణాలను ఇతర బ్యాంకులకు బదిలీ చేసుకోవడం ఉత్తమం! ఈ మధ్యే 75 బేసిస్‌ పాయింట్లు తక్కువ చేయడంతో ఎస్‌బీఐకి రుణాన్ని మార్చుకున్నారు. పెరిగిన ఈఎంఐ కాకుండా పాత ఈఎంఐలే కడుతుండటంతో చాలామందికి తమ రుణ వ్యవధి మరో రెండేళ్లు పెరిగిందన్న సంగతే తెలియదు! అంటే తెలియకుండానే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారు. ఒకవేళ రిటైర్మెంట్‌ వయసు దగ్గరపడితే బ్యాంకర్లు పెరిగిన ఈఎంఐ లేదా ముందుగానే అప్పు తీర్చాలంటారు. ఇలాంటప్పుడు రీఫైనాన్సింగ్‌ ఆప్షన్‌ ఉపయోగించుకోవడం ఉత్తమం. అయితే 0.5 శాతం ప్రాసెసింగ్‌ ఫీజు ఉంటుందని మర్చిపోవద్దు.


ఈ మధ్యే రుణం తీసుకున్నవాళ్లకు రీఫైనాన్స్‌ బెటరని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. అప్పు తీసుకున్న మొదట్లోనే కస్టమర్లపై వడ్డీరేట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెల్లించే ఈఎంఐలో ఎక్కువ వాటా వడ్డీనే ఉంటుంది. అసలు తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు రుణాల్ని బదిలీ చేసుకోవడం బెటర్‌. 2019 నుంచి గృహ రుణాలను ఆర్బీఐ రెపోరేటుతో అనుసంధానం చేసింది. కరోనా సమయంలో ఎకానమీకి బూస్ట్‌ ఇచ్చేందుకు రెపోరేటును 4 శాతానికి తగ్గించారు. దాంతో ఇంటి లోన్లు 6.5 శాతానికే లభించాయి. ఇప్పుడు స్ప్రెడ్‌ 250 బేసిస్‌ పాయింట్లు పెరగడంతో వడ్డీరేటు 9.5 శాతానికి పైగా చేరుకొంది. అయితే కొన్ని బ్యాంకులు తమ లాభాల్ని తగ్గించుకొని 8.5 శాతానికే రుణాలు ఇస్తున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.