Premium Housing Sales: దేశంలో ఇళ్ల ధరలు పెరిగిన తర్వాత కూడా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు, పైగా పెరిగింది. 2023 జనవరి-మార్చి కాలంలో, దేశంలోని టాప్-7 నగరాల్లో గృహ విక్రయాలు 14 శాతం వృద్ధితో 1.13 లక్షల యూనిట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇళ్ల ధరలు 6 నుంచి 9 శాతం పెరిగిన తర్వాత కూడా అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ (Anarock) వెల్లడించింది.


దేశంలోని టాప్‌-7 నగరాల్లో (దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్‌కతా) అనరాక్ కంపెనీ చేసిన సర్వేలో (Anarock survey) ఈ విషయాలు వెల్లడయ్యాయి. గృహ రుణ వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ, రెసిడెన్షియల్‌ రియల్ ఎస్టేట్ అమ్మకాలలో విజృంభణ కొనసాగుతోందని, ఇది గత దశాబ్దంలో అత్యధిక త్రైమాసిక విక్రయాలుగా అనరాక్ వెల్లడించింది.


అనరాక్ డేటా ప్రకారం.. 2023 జనవరి-మార్చి కాలంలో 1,13,770 యూనిట్లు (ఇండిపెండెంట్‌, ఫ్లాట్స్‌ కలిపి) అమ్ముడవుతాయని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో ఈ లెక్క 99,550 యూనిట్లుగా ఉంది. దీనిని బట్టి, ఈ సంవత్సరం 14 శాతం పెరుగుదలను అనరాక్‌ అంచనా వేసింది. 


రెండు నగరాల్లోనే దాదాపు సగం విక్రయాలు                                   
ఈ మొత్తం విక్రయాల్లో కేవలం ముంబై, పుణె నుంచే 48 శాతం వాటా కనిపిస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాలోనూ హౌసింగ్‌ సేల్స్‌లో వృద్ధి కనిపించగా, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.


ఖరీదైన ఇళ్లకు అధిక డిమాండ్                                          
2023 ప్రారంభం నుంచి గృహ డిమాండ్‌ పెరుగుతోంది, మొదటి త్రైమాసికంలోనే 2022లోని గరిష్ట స్థాయిని అధిగమించామని అనరాక్ చైర్మన్ అనూజ్ పురి చెప్పారు. ఈ త్రైమాసికంలో, ప్రీమియం ఇళ్లకు అంటే రూ. 1.5 కోట్ల ధర పైబడిన ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని వెల్లడించారు.


ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో సొంతింటి విక్రయాలు జనవరి-మార్చిలో 19 శాతం పెరిగి 34,690 యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా. ఓవరాల్‌గా చూస్తే మాత్రం.. ద్రవ్యోల్బణం, బ్యాంకు రేట్ల నిరంతర పెరుగుదల గృహ విక్రయాల డిమాండ్‌ను తగ్గిస్తుందని; ఆర్‌బీఐ రెపో రేటు పెరగడం వల్ల హౌసింగ్ మార్కెట్‌పై ప్రభావం పడుతుందని అనూజ్‌ పురి చెప్పారు.


ఎక్కడ, ఎన్ని యూనిట్లు విక్రయించే అవకాశం?                                 
2022 జనవరి-మార్చి కాలంలోని సేల్స్‌ను 2023 ఇదే కాలంతో పోలిస్తే... పుణెలో గృహాల విక్రయాలు 42 శాతం వృద్ధితో 14,020 యూనిట్ల నుంచి 19,920 యూనిట్లకు పెరగవచ్చు. దిల్లీ ఎన్‌సీఆర్‌లో 9 శాతం క్షీణించి 18,835 యూనిట్ల నుంచి 17,160 యూనిట్లకు తగ్గవచ్చు. బెంగళూరులో నివాస ప్రాపర్టీ విక్రయాలు 16 శాతం పెరిగి 15,660 యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా. చెన్నైలో 5,880 యూనిట్లు, కోల్‌కతాలో 6,180 యూనిట్లు విక్రయించే అవకాశం ఉంది.