PAN-Aadhaar Link Last Date 2023: శాశ్వత ఖాతా సంఖ్య లేదా పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ అయిన పాన్ కార్డ్, ఒక వ్యక్తి చేసే ఆర్థిక వ్యవహారాలకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. చిన్నపాటి లావాదేవీలు మినహా, ఇది లేకుండా కీలక ఆర్థిక సంబంధ పనులు చేయలేం. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి పెట్టుబడులు పెట్టడం వరకు అన్ని పనులకు పాన్ కార్డు అవసరం. ఈ నేపథ్యంలో, నకిలీ పాన్‌ కార్డ్‌ల ద్వారా జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం పాన్‌-ఆధార్‌ అనుసంధానాన్ని తీసుకువచ్చింది. దేశంలో పాన్‌ కార్డ్‌ ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తమ ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించాల్సిందే.


మీరు ఇంకా పాన్ - ఆధార్ లింక్ చేయకపోతే, పెద్ద సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తవానికి, పాన్ - ఆధార్ లింక్ చేయడానికి గడువు (Pan Aadhaar Linking Deadline) దగ్గర పడింది, 2023 మార్చి 31తో గడువు ముగుస్తుంది. అంటే, కేవలం అతి కొన్ని రోజుల సమయమే మిగిలి ఉంది. 


దేశంలో ఎక్కువ మంది ఇప్పటికే పాన్‌ - ఆధార్‌ను లింక్‌ చేశారు, ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, మిగిలిన వాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఈ గడువును CBDT మరోసారి పొడిగిస్తుందా అన్న ప్రశ్న పన్ను చెల్లింపుదార్ల (Taxpayers) మదిలో మెదులుతోంది. ఈ ముఖ్యమైన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.


పాన్ ఆధార్ అనుసంధానం గడువును పొడిగిస్తారా?
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT), పాన్ - ఆధార్ అనుసంధానం గడువును గతంలో చాలాసార్లు పొడిగించింది. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేదు. పాన్ - ఆధార్ అనుసంధాన గడువును పొడిగించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని CBDT సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. అంటే, మరికొన్ని రోజుల్లో రాబోయే 2023 మార్చి 31వ తేదీనే ఆఖరి గడువు. ఈ లోపు పాన్‌ - ఆధార్‌ని లింక్ చేయకుంటే, సంబంధిత వ్యక్తి పాన్‌ ఏప్రిల్ 1, 2023 నుంచి నిష్క్రియం (డీయాక్టివేట్) అవుతుంది. 


పాన్ - ఆధార్ లింక్ ఎందుకు అవసరం?
ప్రతి ఒక్కరి KYCలో పాన్, ఆధార్ కూడా ముఖ్యమైన భాగం. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం  తప్పనిసరి చేసింది. దీనివల్ల నకిలీ పాన్ కార్డుల వినియోగాన్ని నిరోధించవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న కేసులు కూడా చాలా బయటపడ్డాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 


మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే, అప్పుడు మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు. దీంతో పాటు, కొత్తగా ఒక బ్యాంక్‌ అకౌంట్‌ లేదా డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్ చేయలేరు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ వంటి స్టాక్ మార్కెట్‌ పెట్టుబడులు పెట్టలేరు. కాబట్టి, మీరు ఇప్పటికీ మీ పాన్‌ - ఆధార్‌ అనుసంధానాన్ని పూర్తి చేయకపోతే తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. 


ఇది కూడా చదవండి: ఈ పని పూర్తి చేస్తేనే మీరు ITR ఫైల్ చేయగలరు, లేదంటే అంతే సంగతులు!