Small Savings Schemes: ఏదైనా పొదుపు పథకంలో నెలనెలా కొంత మొత్తం మదుపు చేద్దామని ఆలోచిస్తున్నారా?, లేదా పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై వంటి పథకాల్లో ఇప్పటికే డబ్బు జమ చేస్తున్నారా?. మీకో శుభవార్త. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (Small savings schemes) వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం త్రైమాసిక ప్రాతిపదికన (మూడు నెలలకు ఒకసారి) సవరిస్తుంది, త్రైమాసికానికి ముందే వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. ఈసారి కూడా, 2023 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి వడ్డీ రేట్లను నిర్ణయించాల్సి ఉంది. కాబట్టి, కొత్త వడ్డీ రేట్లపై ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొత్త త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌ కాలం) వడ్డీ రేట్లను కేంద్రం పెంచవచ్చన్న సూచనలు అందుతున్నాయి.


పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన        
ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి- మార్చి కాలం) కేవలం కొన్ని పథకాలపైనే కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లు పెంచింది. దేశ ప్రజలంతా ఆశగా ఎదురు చూసిన పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజనపై (SSY) చెల్లించే వడ్డీ రేటును మాత్రం పెంచకుండా, వాటిని యథాతథంగా కొనసాగించింది. ఈసారి మాత్రం ఈ రెండు పథకాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చిన రాబడి ఆధారంగా, త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది. అంటే.. గత మూడు నెలల్లో ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చిన లాభాల ఆధారంగా, రాబోయే మూడు నెలలకు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది.


ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి        
ప్రస్తుతం, సాధారణ పొదుపు ఖాతా మీద 4%, ఒక సంవత్సర కాల వ్యవధి డిపాజిట్‌ మీద 6.6%, రెండేళ్ల కాల వ్యవధి డిపాజిట్‌ మీద 6.8%, మూడేళ్ల కాల వ్యవధి డిపాజిట్‌ మీద 6.9%, ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్‌ మీద 7.0% వడ్డీని చెల్లిస్తున్నారు. రికరింగ్‌ డిపాజిట్‌ విషయానికి వస్తే... ఐదేళ్ల కాలానికి 5.8% వడ్డీ ఇస్తున్నారు.


సీనియర్‌ సిటిజన్‌ సేమిగ్స్‌ స్కీమ్‌ (SCSS) మీద 8%, మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ స్కీమ్‌ (MIA) మీద 7.1%, నేషనల్‌ సేవింగ్స్ సర్టిఫికెట్‌ (NSC) మీద 7.0%, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ‍‌(PPF) ఖాతా మీద 7.1% వడ్డీ చెల్లిస్తున్నారు. 


120 నెలల కాల గడువు ఉండే కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP) స్కీమ్‌ మీద 7.1%, సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం మీద 7.6% వడ్డీ చెల్లిస్తున్నారు.


వడ్డీ రేట్ల సవరణకు కేంద్ర ప్రభుత్వం బాండ్‌ రాబడి ఫార్ములాను అనుసరిస్తుంది. ఈ ప్రకారం, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ‍‌ప్రస్తుతం ఇస్తున్న 7.1 శాతం వడ్డీ 7.6 శాతానికి పెరగాల్సి ఉంది. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ప్రస్తుతం చెల్లిస్తున్న 7.6 శాతం వడ్డీ 8.1 శాతానికి పెరగాల్సి ఉంది. అయితే, ఇంత కంటే తక్కువే పెంచవచ్చు, లేదా అసలు పెంచకపోవచ్చు కూడా. మార్కెట్‌ మాత్రం గుడ్‌న్యూస్‌ కోసం ఎదురు చూస్తోంది.