EPFO Alert:


ఈపీఎఫ్‌వో చందాదారులకు అలర్ట్‌! రెండు రోజుల ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ధర్మకర్తల మండలి (CBT) నేడు సమావేశం అవుతోంది. అధిక పింఛను, వడ్డీరేట్లు, వార్షిక ఆర్థిక అంచనాలపై చర్చించనున్నారు.


ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖా మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షత వహిస్తున్నారు. వాస్తవంగా మార్చి 25-26నే సమావేశం జరగాల్సి ఉంది. పాలనా పరమైన అంశాలతో సోమవారానికి వాయిదా వేశారు. ధర్మకర్తల మండలి నిర్ణయాలుఏ ఆరుకోట్ల మంది ఈపీఎఫ్‌వో చందాదారులపై ప్రభావం చూపనున్నాయి. ఇందులో 72.73 లక్షల మంది పింఛన్‌ దారులే ఉంటారు.


వడ్డీరేటు: 2023 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో వడ్డీరేటు (EPFO Interest Rate) 8 శాతంగా ఉంది. FY22కి ధర్మకర్తల మండలి 8.1 శాతం వడ్డీరేటు ప్రతిపాదించింది. దీనిని అదే ఏడాది జూన్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీంతో ఈపీఎఫ్‌వోకు రూ.450 కోట్లు మిగిలాయి. అంటే ఈసారీ వడ్డీరేటును ఇదే స్థాయిలో ఉంచుతారని తెలుస్తోంది. 2022లో వడ్డీని ఆలస్యంగా జమ చేశారు. ఈపీఎఫ్‌లో ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేసేవారికి పన్ను ప్రతిపాదించడమే ఇందుకు కారణం. కాగా 1980 తర్వాత ఈపీఎఫ్‌వో అతి తక్కువ వడ్డీరేటు 8.1శాతం ఇవ్వడం ఇదే తొలిసారి.  2020, 21లో 8.5 శాతం ఇచ్చారు.  అంతకు ముందు వరుసగా 8.65 శాతం, 8.55 శాతం, 8.65 శాతం ఇచ్చారు.


అధిక పింఛను: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చందాదారులు ఎక్కువ పింఛను (Higher Pension) పొందేందుకు ఈపీఎఫ్‌వో అవకాశం ఇచ్చింది. ఈ సమావేశంలో ధర్మకర్తలు దీనిపై విస్తృతంగా చర్చిస్తారని తెలిసింది. అధిక పింఛను ఎంచుకొనేందుకు మే 3 చివరి తేదీ. పింఛన్‌దారుల సంఖ్య పెరగడం, నెట్‌ ప్రజెంట్‌ వాల్యూ కంట్రిబ్యూషన్‌, ప్రయోజనాల మధ్య భారీ అంతరం ఉండటంపై చర్చిస్తారు.


వేతన పరిమితి: ప్రస్తుతం ఈపీఎఫ్‌లో వేతన పరిమితి రూ.15,000గా ఉంది. దీనిని రూ.21,000కు పెంచుతున్నారని తెలిసింది. 2014లో చివరిసారిగా వేతన పరిమితిని సవరించారు. నెలకు రూ.6000 నుంచి రూ.15,000కు పెంచారు.


కనీస పింఛను : నెలవారీ కనీస పింఛను పెంపు పైనా ధర్మకర్తల మండలి చర్చించనుంది. ప్రస్తుతం నెలకు రూ.1000 కనీస పింఛనుగా ఉంది. దీనిని రూ.3000కు పెంచారని సమాచారం. కాగా కార్మిక సంఘాలు ఈ మొత్తాన్ని నెలకు రూ.6000కు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా 35 ఏళ్లకు పైగా సర్వీసు ఉన్న వారికి పింఛన్‌ను విస్తరించడం, కనీసం ఆరు నెలలు కంట్రిబ్యూట్‌ చేసినా విత్‌డ్రావల్‌ సౌకర్యం కల్పించడంపై చర్చిస్తారని తెలిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.