Home Loan Balance Transfer: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి ద్రవ్య విధాన సమీక్షలో (RBI MPC) రెపో రేటు (Repo Rate)లో 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టి 6.25 శాతానికి తగ్గించింది. దీనివల్ల, ప్రస్తుత & కొత్త రుణగ్రహీతలకు గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరింత తక్కువ వడ్డీ రేటుతో రీఫైనాన్స్ (Home Loan Refinancing) చేయడానికి అవకాశం కూడా లభిస్తుంది. హోమ్ లోన్ రీఫైనాన్సింగ్‌ను "హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్" అని కూడా పిలుస్తారు. అంటే, ఒక రుణదాత దగ్గర తీసుకున్న గృహరుణాన్ని అంతకంటే తక్కువ వడ్డీ రేటుకు మరొక రుణదాత వద్దకు మార్చుకోవడం. మొదటి రుణదాత కంటే రెండో రుణదాత దగ్గర తక్కువ వడ్డీ రేటు ఉండడం వల్ల EMI భారం తగ్గుతుంది. దీర్ఘకాలంలో చాలా డబ్బు ఆదా అవుతుంది. ముఖ్యంగా, హోమ్ లోన్ ప్రారంభ దశలో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
గృహ రుణ బ్యాలెన్స్ బదిలీ ఎలా పనిచేస్తుంది?
ఒక రుణగ్రహీత, బ్యాలెన్స్ బదిలీ కోసం, తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్న బ్యాంక్ లేదా ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ సంప్రదించాలి. కొత్త బ్యాంక్, ప్రస్తుత గృహ రుణాన్ని తీసుకోవడానికి అంగీకరించడంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త బ్యాంక్, ఇప్పటికే లోన్ మంజూరు చేసిన ప్రస్తుత బ్యాంక్‌కు రుణ బకాయిలు చెల్లిస్తుంది. బకాయి పూర్తి మొత్తాన్ని అందుకున్న ప్రస్తుత బ్యాంక్, ఆస్తి పత్రాలను విడుదల చేసి, రుణగ్రహీతకు నో-డ్యూ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. ఈ పత్రాలు కొత్త బ్యాంక్‌కు బదిలీ అవుతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, కొత్త రుణ ఒప్పందం నిబంధనల ప్రకారం, రుణగ్రహీత కొత్త బ్యాంక్‌కు EMI చెల్లింపులు ప్రారంభిస్తాడు.
బ్యాంక్‌ను మార్చడం ద్వారా తక్కువ వడ్డీ రేటు అవకాశం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, హోమ్ లోన్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ప్రాసెసింగ్ ఫీజులు, రుణ కాల పరిమితి, మొత్తం పొదుపు వంటి అంశాలను జాగ్రత్తగా అంచనా వేయాలి.
గమనించాల్సిన విషయాలు:
ఖర్చు Vs ప్రయోజనం: చాలా మంది రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేట్లను పొందేందుకు, EMI భారాన్ని తగ్గించడానికి హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను ఎంచుకుంటారు. అయితే, ఈ మార్పు వల్ల ఆర్థికంగా మిగులు ఉంటుందని ముందుగానే నిర్ధారించుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీల కోసం అయ్యే ఖర్చును - పోటీ వడ్డీ రేటు వల్ల ఆదా అయ్యే డబ్బును పోల్చి చూసుకోవాలి.
రుణ కాల వ్యవధి: మీ రుణ కాల వ్యవధి క్లైమాక్స్‌కు దగ్గరగా ఉంటే మీ రుణాన్ని బదిలీ చేయడం మంచి నిర్ణయం కాకపోవచ్చు. మీరు కొత్తగా రుణం తీసుకుని ఉంటే మాత్రం బ్యాలెన్స్ బదిలీ కోసం ఆలోచించవచ్చు.
అర్హతలు: కొత్త రుణం తరహాలోనే, రుణాన్ని మార్చుకున్నప్పుడు కూడా తక్కువ రేటు పొందడానికి మీ క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తాయి.
రహస్య ఛార్జీలు: కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేసే ముందు.. కొత్త బ్యాంక్ విధించిన నిబంధనలు, షరతులు, ఛార్జీలు సహా బ్యాలెన్స్ బదిలీలో దాగి ఉన్న చిన్నపాటి విషయాలను కూడా అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం, గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న 10 బ్యాంక్‌లు ఇవి:
సెంట్రల్ బ్యాంక్ ----- 8.10-9.25
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ----- 8.10-10.50
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ----- 8.10-10.65
ఇండియన్ బ్యాంక్ ----- 8.15-9.55
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ----- 8.15-8.75
బ్యాంక్ ఆఫ్ బరోడా ----- 8.15-10.35
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ----- 8.20-9.85
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ----- 8.25 - 9.20
కెనరా బ్యాంక్ ----- 8.25-11.0
యూకో బ్యాంక్ ----- 8.30-10.00
సరైన సమయంలో గృహ రుణాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల రుణ భారం తగ్గుతుంది. ముఖ్యంగా, కొత్త వడ్డీ రేటు తక్కువగా ఉండి, కాల వ్యవధి ఎక్కువగా ఉంటే దీర్ఘకాలంలో చాలా డబ్బు (ఒక్కోసారి కొన్ని రూ.లక్షలు) ఆదా అవుతుంది. హోమ్ లోన్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ లేదా రీఫైనాన్స్ చేసే ముందు, కొత్త బ్యాంక్ తన కస్టమర్లకు అందించే మద్దతును కూడా అంచనా వేయండి. వివిధ బ్యాంక్‌ల్లో పోటీ వడ్డీ రేట్లతో పోల్చుకోండి. మీకు అనుకూలమైన నిబంధనల కోసం బ్యాంక్‌తో చర్చలు జరపండి.