Real Estate News: మన దేశంలో, ఓవైపు బంగారం ధరలు జనాన్ని బెంబేలెత్తిస్తుంటే, మరోవైపు స్థిరాస్తుల ధరలు కూడా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం ఒక కలలా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. గత 4 సంవత్సరాలలో (2021 - 2024 కాలంలో) హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు దాదాపు 128 శాతం పెరిగినట్లు ఇటీవలి ఒక నివేదిక చెబుతోంది. భాగ్యనగరంలో ఇంటి రెంట్లలో పెరుగుదల కంటే ఇంటి రేట్లలో పెరుగుదలే ఎక్కువగా ఉందని ఆ రిపోర్ట్‌ వెల్లడించింది. అలాంటి పరిస్థితుల్లో, ఒక సామాన్యుడు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంక్‌ రుణం (Home Loan) తీసుకోవలసి వస్తోంది.

Continues below advertisement


డౌన్‌ పేమెంట్‌ అంటే?
హౌసింగ్‌ లోన్‌ (Housing Loan) కోసం అప్లై చేసుకున్న వ్యక్తులకు ఇంటి ధరకు సరిపడా పూర్తి రుణం లభించదు. ముందుగా, అతను ఫ్లాట్ ధరలో కొంత భాగాన్ని డౌన్ పేమెంట్‌ రూపంలో చెల్లించాలి & మిగిలిన మొత్తానికి రుణం లభిస్తుంది. డౌన్‌ పేమెంట్‌ అంటే, ఇల్లు కొనబోయే వ్యక్తి ముందస్తుగా చెల్లించే మొత్తం. డౌన్‌ పేమెంట్‌ను పూర్తిగా సొంత డబ్బు నుంచే చెల్లిస్తారు & మిగిలిన డబ్బు చెల్లింపు కోసం హౌమ్‌ లోన్‌ తీసుకుంటారు. ఇప్పుడు.. ఒక వ్యక్తి ఏదైనా అపార్ట్‌మెంట్‌లో 1 BHK (1 బెడ్‌రూమ్‌, హాల్‌, కిచెన్‌) లేదా 2 BHK లేదా 3 BHK ఫ్లాట్ కొనేందుకు ప్లాన్‌ చేస్తే, ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?. 


డౌన్‌ పేమెంట్‌ ఎలా నిర్ణయిస్తారు?
ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొంటున్నప్పుడు, దాని డౌన్ పేమెంట్ అది 1 BHKనా లేదా 2 BHKనా లేదా 3 BHKనా అనే విషయంపై ఆధారపడి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. అది నిజం కాదు. ఫ్లాట్‌ సైజ్‌తో సంబంధం లేకుండా, డౌన్ పేమెంట్ ఎప్పుడూ ఫ్లాట్ ధర ఆధారంగా నిర్ణయమవుతుంది. అంటే ఫ్లాట్ పరిమాణం ఎంత ఉన్నప్పటికీ, గృహ రుణ గ్రహీత చెల్లించాల్సిన డౌన్ పేమెంట్ మొత్తం ఆ ఫ్లాట్‌ ధరపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఫ్లాట్ మొత్తం ఖర్చులో 15 శాతం నుంచి 20 శాతం వరకు డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని హౌసింగ్‌ లోన్‌గా తీసుకుంటారు.


ఫ్లాట్ విలువ రూ. 50 లక్షలు అయితే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?
ఉదాహరణకు, మీరు రూ. 50 లక్షల విలువైన అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ కొంటున్నారని అనుకుందాం. ఆ ఫ్లాట్‌ అమ్మే వ్యక్తితో అగ్రిమెంట్‌ చేసుకోవడానికి, ముందుగా మీరు కొంత డబ్బును డౌన్‌ పేమెంట్‌ చేయాలి. ఫ్లాట్‌ మొత్తం ధరలో డౌన్ పేమెంట్‌ 20 శాతం అనుకుంటే, మీరు రూ. 10 లక్షలు మీ చేతి నుంచి చెల్లించాలి. ఇది పోను మీ రుణ మొత్తం రూ. 40 లక్షలు అవుతుంది. 


ఎంత EMI చెల్లించాలి?
మీరు రూ. 40 లక్షల గృహ రుణాన్ని 8.75% వార్షిక వడ్డీ రేటుతో తీసుకున్నారని అనుకుందాం. రుణ మొత్తంపై దాదాపు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజ్‌గా చెల్లించాలి. రుణ కాల పరిమితిని (Home Loan Tenure) 30 సంవత్సరాలుగా నిర్ణయించుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 31,468.02 EMI చెల్లించాల్సి వస్తుంది. ఇదే ఫార్ములాను 1 BHK లేదా 2 BHK లేదా 3 BHK లేదా ఏదైనా ఆస్తికి కూడా వర్తింపజేయవచ్చు.