Senior Citizen Savings Scheme Details In Telugu: మన దేశంలో అతి పెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank), 'పెద్దల పొదుపు పథకం' లేదా 'సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌' (SCSS) కింద డిపాజిట్లు స్వీకరించడం ప్రారంభించింది. వాస్తవానికి, SCSS కొత్త పథకం కాదు, చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ రంగ పథకం, భారత ప్రభుత్వం మద్దతుతో కొనసాగుతుంది. అయితే, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ కింద డిపాజిట్లు స్వీకరించడాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇటీవలే ప్రారంభించింది.

పెట్టుబడికి రక్షణ & హామీతో కూడిన వడ్డీ60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని అందించడానికి SCSSని భారత ప్రభుత్వం లాంచ్‌ చేసింది. ప్రస్తుతం, ఈ స్కీమ్‌ కింద సంవత్సరానికి 8.20% వడ్డీ రాబడి చెల్లిస్తున్నారు. మరే ఇతర ప్రభుత్వ రంగ పథకంలో ఇంతకంటే ఎక్కువ వడ్డీ లేదు. చాలా బ్యాంక్‌ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనూ ఇంత వడ్డీ రేటు (Bank Fixed Deposit Rate) లేదు. 'సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌' వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్ణయిస్తుంది. ప్రభుత్వ రంగ పథకం కాబట్టి SCSSలో పెట్టుబడులకు రక్షణ & హామీతో కూడిన వడ్డీ లభిస్తుంది.

SCSSలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అనేది ప్రజలందరి కోసం కాదు. పేరుకు తగ్గట్లే ఇది 'పెద్దల పొదుపు పథకం'. పదవీ విరమణ చేసినవారికి, 55-60 సంవత్సరాల మధ్య స్వచ్ఛంద పదవీ విరమణ ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రక్షణ రంగ సేవల నుంచి 50 ఏళ్ల వయస్సు తర్వాత రిటైర్మెంట్‌ తీసుకున్న వాళ్లు కూడా కొన్ని షరతులను అనుసరించి SCSS ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. ఈ పథకం కింద చేసిన డిపాజిట్లకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ‍‌(Income tax exemption on SCSS) లభిస్తుంది. ఇది, పెద్దలకు అదనపు ప్రయోజనంలా పని చేస్తుంది.

SCSS వడ్డీ ఆదాయంSCSS ఖాతా మెచ్యూరిటీ కాల వ్యవధి (SCSS maturity period) ఐదు సంవత్సరాలు. కావాలనుకంటే ఆ తర్వాత మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఖాతాను ముందస్తుగా క్లోజ్‌ ‍‌(SCSS premature closure) చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల, అవసరమైన సందర్భంలో డబ్బు చేతికి వస్తుంది. 'సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌' ఖాతాలో రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దీనిపై వడ్డీని ప్రతి 3 నెలలకు బ్యాంక్‌ చెల్లిస్తుంది. ఆ వడ్డీ డబ్బు, SCSS ఖాతాతో లింక్ చేసిన పొదుపు ఖాతాలో నేరుగా జమ అవుతుంది, స్థిరమైన ఆదాయంగా మారుతుంది.

SCSS ఖాతా అందిస్తున్న ఇతర బ్యాంకులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపంజాబ్ నేషనల్ బ్యాంక్బ్యాంక్ ఆఫ్ బరోడాబ్యాంక్ ఆఫ్ ఇండియాIDBI బ్యాంక్ICICI బ్యాంక్కెనరా బ్యాంక్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేనా బ్యాంక్ఇండియన్ బ్యాంక్ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్యూకో బ్యాంక్యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆదాయ పన్ను ప్రయోజనాలను పొందడంతో పాటు బలమైన పొదుపు ప్రణాళికను కోరుకునే పెద్దలకు 'సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌' మంచి ఎంపిక అవుతుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.