Tips To Avoid Cyber Fraud: క్రెడిట్ కార్డ్ స్కామ్‌కు సంబంధించి మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. జనం డబ్బులు అప్పనంగా దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు ఎన్ని కొత్త ఎత్తులు వేస్తున్నారో ఇది సూచిస్తుంది. నొయిడా సెక్టార్ 31 నివాసి రాజేష్ కుమార్ నుంచి ఆన్‌లైన్‌ కేటుగాళ్లు రూ. 9.29 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో, గుర్తు తెలియని నేరస్థుడిపై యూటీ పోలీసుల సైబర్ విభాగంలో కేసు నమోదైంది. గత ఏడాది (2024) డిసెంబర్ 23న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


గుర్తింపు కార్డుల ధృవీకరణ పేరుతో మోసం
2024 డిసెంబర్‌లో రాజేష్ కుమార్‌కు ఒక ఫోన్‌ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి, తనను తాను 'పంజాబ్ నేషనల్ బ్యాంక్' (Punjab National Bank - PNB) ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. రాజేష్ కుమార్‌ ఐడీ వెరిఫికేషన్‌ చేయాలని చెప్పాడు. ఐడీ వెరిఫికేషన్‌ కోసం తాను వాట్సాప్ వీడియో కాల్‌ చేస్తానని, లిఫ్ట్‌ చేయాలని కోరాడు. అతను నిజంగానే బ్యాంక్‌ అధికారి అని నమ్మిన రాజేష్ కుమార్‌, వీడియో కాల్‌ లిఫ్ట్‌ చేయడానికి అంగీకరించాడు. సదరు అపరిచితుడు రాజేష్‌ కుమార్‌కు వాట్సాప్ ద్వారా వీడియో కాల్‌ చేశాడు. రాజేష్‌ కుమార్‌ ఆ కాల్‌ను లిఫ్ట్‌ చేసిన తర్వాత, ఐడీ వెరిఫికేషన్‌ కోసం రాజేష్‌ దగ్గర ఉన్న క్రెడిట్‌ కార్డ్‌లను చూపించమని అపరిచితుడు అడిగాడు. రాజేష్‌ కుమార్‌, తన దగ్గర ఉన్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ కార్డ్‌, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వాట్సాప్ వీడియో కాల్‌లో చూపించాడు.


వరుస లావాదేవీలతో రూ.9.29 లక్షలు హాంఫట్‌
తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు చూపించిన కొద్దిసేపటికే, రాజేష్ ఫోన్‌కు ఒక దరఖాస్తు ఫారం లింక్ వచ్చింది. రాజేష్‌ ఆ లింక్‌పై క్లిక్ చేయగానే అతని రెండు కార్డ్‌ల నుంచి డబ్బు కట్ కావడం ప్రారంభమైంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డును ఉపయోగించి ఆరుసార్లలో మొత్తం రూ. 8,69,400 లావాదేవీలు జరిగాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి రూ. 60,000 విత్‌డ్రా చేశారు. ఇలా, రెండు కార్డుల నుంచి మొత్తం 9,29,400 రూపాయలను ఆన్‌లైన్‌ కేటుగాళ్లు కొట్టేశారు. రాజేష్ వెంటనే తన బ్యాంక్‌లకు ఫోన్‌ చేసి ఆ కార్డ్‌లను డీయాక్టివేట్ చేయించడంతో నష్టం అక్కడితో ఆగింది.


మీ డబ్బును ఇలా రక్షించుకోండి
* మీ క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ భద్రత మీ చేతుల్లోనే ఉంది. 
* మీ కార్డు నంబర్, IFSC లేదా OTP ఎవరికీ షేర్‌ చేయకండి. అలాంటి సమాచారం కోసం బ్యాంక్‌ ఎప్పుడూ మిమ్మల్ని అడగదు. 
* వాట్సాప్, SMS లేదా ఇ-మెయిల్ ద్వారా మీకు వచ్చే లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు తెలివిగా వ్యవహరించండి. 
* బ్యాంక్‌కు సంబంధించిన ఏదైనా పని ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించండి. 
* లావాదేవీ హెచ్చరికలతో పాటు 2-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ఆన్‌ చేయండి. 
* వీడియో కాల్స్ సమయంలో QR కోడ్‌లు స్కాన్‌ చేయడం లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు ఇవ్వడం వంటివి చేయవద్దు.
* సురక్షితంగా ఆన్‌లైన్ షాపింగ్‌ చేయడానికి వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించండి.