Holi 2025 Stock Market Holiday: ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 14, శుక్రవారం నాడు వచ్చింది. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ రంగుల పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఉత్తరాదిన హోలీ ఉత్సాహం ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలోని ప్రధాన పండుగల్లో ఒకటి కాబట్టి, హోలీ రోజున స్టాక్ మార్కెట్‌ పని చేస్తుందా, లేదా?.


హోలీ రోజున నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) & బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కు సెలవు. అంటే, హోలీ రోజున (2025 మార్చి 14, శుక్రవారం) స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ జరగదు, సెలవు ప్రకటించారు. ఆ రోజున ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్‌, సెక్యూరిటీస్ లెండింగ్ & బారోయింగ్ (SLB) విభాగాలు సహా ఏ రకమైన ట్రేడింగ్‌ కార్యకలాపాలు జరగవు. 


స్టాక్‌ మార్కెట్‌కు లాంగ్‌ వీకెండ్‌    
హోలీ సందర్భంగా శుక్రవారం నాడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చే శనివారం (మార్చి 15), ఆదివారం ‍‌(మార్చి 16) స్టాక్‌ మార్కెట్‌కు సాధారణ సెలవు రోజులు. అంటే, ఈసారి స్టాక్‌ మార్కెట్లకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3 వరుస సెలవులతో లాంగ్‌ వీకెండ్‌ వచ్చింది. ఈ వారంలో, గురువారం (మార్చి 13) చివరి ట్రేడింగ్‌ డే అవుతుంది. 3 రోజుల సెలవుల తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ల తలుపులు సోమవారం (మార్చి 17) నాడు ట్రేడింగ్‌ కోసం ఓపెన్‌ అవుతాయి.


మార్చి నెలలో మరొక సెలవు   
హోలీ కాకుండా, మార్చి నెలలో మరో రోజు స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కారణంగా, ఈ నెలలో చివరి రోజు 31 మార్చి 2025 ‍‌(సోమవారం) నాడు స్టాక్ మార్కెట్లో ఎటువంటి ట్రేడింగ్ ఉండదు. ప్రతి శని, ఆదివారాల్లో సాధారణ సెలవులు వర్తిస్తాయి.


ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లకు సెలవులు
2025 ఏప్రిల్ నెలలో మహావీర్ జయంతి సందర్భంగా 10 ఏప్రిల్ 2025న ‍‌(గురువారం) మార్కెట్ క్లోజ్‌ అవుతుంది. ఆ తర్వాత, ఏప్రిల్ 14 సోమవారం నాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగానూ భారతీయ స్టాక్‌ మార్కెట్లు సెలవులో ఉంటాయి. గుడ్ ఫ్రైడే కారణంగా ఏప్రిల్ 18 శుక్రవారం రోజున సెక్యూరిటీస్‌ ట్రేడింగ్‌ జరగదు. అయితే, కమొడిటీస్‌ & కరెన్సీ ట్రేడింగ్‌ కోసం పెట్టుబడిదారులు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (NCDEX) సెలవులను చెక్‌ చేయాలి. ఎందుకంటే, ఆ రెండు ఎక్సేంజ్‌ల్లో ట్రేడింగ్ గంటలు మారవచ్చు. ఇవి కాకుండా... అన్ని ఎక్సేంజ్‌లకు శని, ఆదివారాల్లో సాధారణ సెలవులు వర్తిస్తాయి.


మంగళవారం మిశ్రమం
మంగళవారం (11 మార్చి 2025) నాడు BSE సెన్సెక్స్‌ & NSE నిఫ్టీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు నష్టపోయి 74102 దగ్గర ఆగింది. నిఫ్టీ నష్టాల నుంచి బయటపడి 38 పాయింట్లు లాభపడింది, 22498 దగ్గర ముగసింది. అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న భయాందోళనల నడుమ అంతర్జాతీయ మార్కెట్లు పడిపోయాయి, ఆ ప్రభావం భారతీయ మార్కెట్లపైనా పడింది. అకౌంటింగ్‌లో లోపాల కారణంగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు ఏకంగా 27 శాతానికి పైగా పతనమైంది.