Steps To Set Up Auto-Pay Option For Credit Card: కొందరి దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డ్‌లు ఉన్నాయి, వీటి బిల్లు చెల్లింపు గడువులు వేర్వేరుగా ఉంటాయి. ఈ బిజీ లైఫ్‌లో, క్రెడిట్‌ కార్డ్‌ గడువు తేదీలను గుర్తు పెట్టుకుని బిల్లులు చెల్లించడం కొంచం కష్టమే. మతిమరుపు వల్లో, బద్ధకం వల్లో గడువులోగా క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు చెల్లించకపోతే క్రెడిట్‌ హిస్టరీలో బ్లాక్‌ మార్క్‌ పడుతుంది. క్రెడిట్ స్కోర్‌ తగ్గుతుంది. అంతేకాదు, భారీ మొత్తంలో లేట్‌ ఫీజ్‌ కట్టాల్సిరావచ్చు. ఆటో-పేను సెటప్ చేయడం ఈ ఇబ్బందులన్నింటికీ పరిష్కారాన్ని చూపుతుంది. 


క్రెడిట్ కార్డ్ ఆటో-పేమెంట్ అంటే ఏమిటి?


క్రెడిట్ కార్డ్ ఆటో-పేమెంట్ అంటే మీ క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులను మీతో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా జరిగేలా చూడడం. ఆటో-పే ఆప్షన్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి మీ క్రెడిట్ కార్డ్ నెలవారీ బిల్లు ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది, గుర్తుంచుకోవాల్సిన శ్రమ మీకు ఉండదు. ఆటో-పేను సెట్‌ చేసిన తర్వాత, సిస్టమ్ పూర్తి బ్యాలెన్స్, కనీస చెల్లింపు లేదా మీరు ఎంచుకున్న నిర్దిష్ట మొత్తానికి గడువు తేదీన ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేస్తుంది.


క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఆటోమేట్ చేయడం వల్ల ప్రయోజనాలు


మాన్యువల్‌గా నెలవారీ బిల్లులను చెల్లించడం ప్రతిసారీ సాధ్యం కాకపోవచ్చు. ఆటో-పే మోడ్‌ను ఆన్‌ చేస్తే మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బిల్లు చెల్లింపుల కోసం బ్యాంక్‌ ఖాతాలను గుర్తుంచుకోవడం లేదా లాగిన్ చేయవలసిన అవసరం ఉండదు. మీతో సంబంధం లేకుండా ప్రతిసారీ సకాలంలో చెల్లింపులు జరుగుతాయి, లేట్‌ పేమెంట్స్‌ ఉండవు, ఫలితంగా లేట్‌ ఫీజ్‌ల బాధ ఉండదు. సకాలంలో చెల్లింపుల వల్ల మంచి క్రెడిట్‌ హిస్టరీని బిల్డ్‌ చేయవచ్చు.


క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులు సకాలంలో జరిగేలా చూసేందుకు, 'ఆటో-పే' మోడ్‌ను ఆన్‌ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయితే చాలు.


ఆఫ్‌లైన్ పద్ధతి


మీ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి, ఆటో-డెబిట్ ఫామ్ (NACH ఆదేశం) కోసం అడగండి.
మీ క్రెడిట్ కార్డ్ వివరాలు పూరించండి, మీకు నచ్చిన పేమెంట్‌ ఆప్షన్‌ (పూర్తి బిల్లు, కనీస బకాయి లేదా నిర్దిష్ట మొత్తం) ఎంచుకోండి.
పూర్తి చేసిన ఫారంతో పాటు క్యానిల్‌ చేసిన చెక్‌ను బ్యాంక్‌ అధికారికి సమర్పించండి.
మీ బ్యాంకు ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్ బిల్లును మీ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా చెల్లిస్తుంది.


ఆన్‌లైన్ విధానం


మీ బ్యాంకు అధికారిక ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
"బిల్ పేమెంట్‌" కింద కనిపించే "ఆటో-పే" విభాగంలోకి వెళ్లండి.
మీ క్రెడిట్ కార్డును ఎంచుకుని, మీకు నచ్చిన పేమెంట్‌ ఆప్షన్‌ (పూర్తి బిల్లు, కనీస బకాయి లేదా నిర్దిష్ట మొత్తం) ఎంచుకోండి.
మీరు కన్ఫర్మ్‌ చేసిన తర్వాత, తర్వాతి బిల్లింగ్ సైకిల్‌ నుంచి మీ క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్‌ అవుతాయి.


ఆటో-పేమెంట్‌లో లోపాలు


ఆటో-పేమెంట్‌ మోడ్‌లోకి మారితే ప్రయోజనాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. బిల్లు చెల్లింపులో మీ జోక్యం ఉండదు కాబట్టి, ఏదైనా మోసపూరిత లేదా తప్పుడు ఛార్జీలు మీ దృష్టికి కాకుండా పోతాయి. మీ స్టేట్‌మెంట్‌లను సమీక్షించే అలవాటు పోతుంది. ఆటో-పే సెట్‌ చేసిన తేదీ నాటికి మీ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్‌ లేకపోతే ఓవర్‌డ్రాఫ్ట్ ఫీజులు, ఫెయిల్డ్‌ పేమెంట్‌ ఫీజ్‌లు నెత్తినపడతాయి. ఇది మీ క్రెడిట్‌ రికార్డ్‌కు హానికరం. కొన్ని బ్యాంకులు ఆటో-పే కోసం సర్వీస్‌ ఛార్జ్‌ తీసుకుంటున్నాయి. అయితే, చాలా బ్యాంక్‌లు ఈ సేవను ఉచితంగా అందిస్తున్నాయి.