Holi 2025 Bank Holidays: ఈ వారంలో మార్చి 14, శుక్రవారం నాడు హోలీ పండుగ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో.. హోలికా దహన్, హోలీ దహన్, ధులేటి, ధులండి, ఢోల్ జాతర పేరిట ఈ పండుగకు ముందు, తర్వాత కూడా వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా బ్యాంక్‌లకు వరుస సెలవులు వచ్చాయి.
హోలీ పండుగ వేడుకల సందర్భంగా, వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు మార్చి 13, గురువారం నుంచి మార్చి 16 ఆదివారం వరకు హాలిడేస్‌లో ఉంటాయి. అంటే, బ్యాంక్‌లు ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు పని చేయవు. బ్యాంక్‌లో మీకు ఏదైనా అర్జంట్ పని ఉంటే బుధవారం నాటికి దానిని పూర్తి చేసుకోవడం బెటర్.
ఇక్కడ ఓ విషయం ఏంటంటే, బ్యాంకు సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఏదైనా పండుగకు ఉన్న ప్రాంతీయ ప్రాధాన్యాన్ని బట్టి, సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.
బ్యాంక్‌లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు:
మార్చి 13, గురువారం - హోలికా దహన్, అట్టుకల్ పొంగళ్: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళ సహా అనేక రాష్ట్రాలలో ఈ పండుగలు జరుపుకుంటారు, ఈ రాష్ట్రాల్లో గురువారం నాడు బ్యాంక్‌లకు సెలవు. హోలీ వేడుకలకు నాందిగా హోలికా దహన్ నిర్వహిస్తారు. అట్టుకల్ పొంగళ్ కేరళలో జరుపుకునే ప్రసిద్ధ పండుగ.
మార్చి 14, శుక్రవారం - హోలీ (ధులేటి/ధులండి/డోల్ జాత్ర): త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ రోజున హోలీని జరుపుకుంటారు. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాలలో శుక్రవారం నాడు బ్యాంక్‌లకు హాలిడే.
మార్చి 15, శనివారం - హోలీ/యావోసంగ్ 2వ రోజు: భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పట్నాలో, హోలీ వేడుకల రెండో రోజును కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను యావోసంగ్ అని పిలుస్తారు. యావోసంగ్ అనేది హోలీని పోలి ఉండే పండుగ. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా మణిపూర్‌లో ప్రత్యేక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
మార్చి 16, ఆదివారం - వారాంతపు సెలవు: భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలలో బ్యాంక్‌లకు సాధారణ సెలవు.
ఈ సెలవులతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నెలలో మొత్తం తొమ్మిది రోజులు పని చేయవు. వీటిలో వివిధ రాష్ట్రాల్లో అమలయ్యే నిర్దిష్ట సెలవులు, RBI ఆదేశించిన రెండో & నాలుగో శనివారాలు కలిసి ఉన్నాయి. ఆదివారం సెలవులు ఈ జాబితాకు అదనం. ఈ అన్ని రోజులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు 'నాన్ వర్కింగ్ డేస్' (non-working days)గా పరిగణిస్తారు.
సెలవు రోజుల్లో బ్యాంక్ లావాదేవీలు ఎలా?
బ్యాంక్‌లకు సెలవుల వచ్చినప్పటికీ, వినియోగదారులు ఆన్‌లైన్‌లో, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ATMల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు, వీటికి ఎలాంటి ఆటంకం ఉండదు. అయితే, తప్పనిసరిగా బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం పడితే మాత్రం ఈ సెలవు షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.