Banks Earn Profit By Offering Credit Cards: భారతదేశంలో క్రెడిట్ కార్డ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారతీయుల దగ్గర కోట్ల సంఖ్యలో క్రెడిట్‌ కార్డ్‌లు ఉన్నాయి. కొందరైతే రెండు కంటే ఎక్కువ కార్డ్‌లను కూడా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు.‌ క్రెడిట్ కార్డ్‌ చేతిలో ఉంటే, ఆన్‌లైన్‌ అయినా ఆఫ్‌లైన్‌ అయినా షాపింగ్‌ చేయడం సులభం. కార్డ్‌ స్వైప్‌ చేస్తున్నారు, కావలసినవి కొంటున్నారు, నెల చివర్లో బిల్లు చూసి బిత్తరపోతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులు ఎందుకు జారీ చేస్తున్నాయి?, క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా ఖర్చు చేసిన డబ్బును మాత్రమే తిరిగి చెల్లిస్తున్నాం, అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. అలాంటప్పుడు బ్యాంక్‌లకు ఏంటి లాభం?.


క్రెడిట్ కార్డులతో బ్యాంకులకు లాభం ఎలా వస్తుంది?
క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్‌కు పెద్ద ఆదాయ వనరు. ఎంత ఎక్కువ మంది కస్టమర్లు ఉండి, ఎన్ని ఎక్కువ కార్డ్‌లు జారీ చేస్తే బ్యాంక్‌కు అంత లాభం. అందుకే బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఉదారంగా ఇస్తున్నాయి, లాభాలు కొల్లగొడుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌ వార్షిక ఛార్జీలు, వడ్డీలు, కార్డ్‌ కాలపరిమితి తీరిన తర్వాత తిరిగి జారీ చేసేందుకు ఛార్జీలు, మర్చంట్‌ ఫీజ్‌ రూపంలో బ్యాంక్‌లు భారీగా ఆర్జిస్తాయి. ఇది కాకుండా, క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే, బకాయి ఉన్న మొత్తంపై వడ్డీ వసూలు చేస్తాయి. కొన్నిసార్లు ఆలస్య చెల్లింపు రుసుములకు కూడా వడ్డీలు జోడిస్తాయి. ప్రతి లావాదేవీపై ఇంటర్‌చేంజ్ ఫీజుల రూపంలోనూ బ్యాంకు లాభాలను సంపాదిస్తుంది. ఒక్క క్రెడిట్‌ కార్డ్‌ మీద ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి కాబట్టే బ్యాంక్‌లు ప్రజలకు పదే పదే ఫోన్‌లు చేస్తుంటాయి, క్రెడిట్‌ కార్డ్‌ తీసుకొమ్మంటూ బలవంతం చేస్తుంటాయి. 


క్రెడిట్‌ కార్డ్‌లపై స్పెషల్‌ ఆఫర్లు
కొన్నిసార్లు, ప్రత్యేక ఆఫర్‌ల పేరిట కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. రివార్డ్‌ స్కీమ్‌లు, క్యాష్‌బ్యాక్, విమాన ప్రయాణాలపై డిస్కౌంట్లు, ఉచిత లాంజ్ యాక్సెస్, ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టండ్‌ డిస్కౌంట్‌ వంటి తాయిలాలతో కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఇలాంటి ఆఫర్లకు పడిపోతున్న చాలా మంది కస్టమర్లు ముందు వెనుక ఆలోచించకుండా విపరీతంగా కొనుగోళ్లు చేస్తున్నారు. మనకు అవసరం లేవి వస్తువులను కొనే అలవాటు కూడా క్రెడిట్‌ కార్డ్‌ చేతిలోకి వచ్చాకే మొదలైంది. 2025 జనవరిలో, భారతీయులు క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన (2024 జనవరితో పోలిస్తే) 10.8 శాతం పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరుకుంది. 


కొంతమంది ప్రజలు క్రెడిట్ హిస్టరీని సృష్టించడానికి లేదా మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి క్రెడిట్ కార్డులను కూడా ఉపయోగిస్తుంటారు. దీనిద్వారా, భవిష్యత్తులో బ్యాంక్‌ లోన్‌ తీసుకోవడంలో ఎటువంటి సమస్య ఎదురుకాదు. 


ఈ విషయం గుర్తుంచుకోండి
మీరు క్రెడిట్ కార్డ్‌ ఉపయోగిస్తుంటే, మీరు క్రెడిట్ వినియోగ నిష్పత్తిని గుర్తు పెట్టుకోవాలి. అంటే, మీరు మీ క్రెడిట్ కార్డ్‌ రుణ పరిమితిలో ఒక నెలలో ఎంత ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలి. క్రెడిట్ వినియోగ నిష్పత్తి మీ క్రెడిట్ స్కోర్‌పై పెద్ద ప్రభావం చూపుతుంది. మంచి క్రెడిట్ స్కోరు పొందడానికి, తక్కువ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని కలిగి ఉండాలి. సాధారణంగా, మీ క్రెడిట్‌ కార్డ్‌ పరిమితిలో 30 శాతానికి మించి ఖర్చు చేయకపోవడం మంచిది.