NSDL IPO Launch Date Details: భారతీయ స్టాక్ మార్కెట్లోకి, డిపాజిటరీ కంపెనీ 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్' (National Securities Depository Ltd - NSDL) అడుగు పెట్టే సమయం కోసం పెట్టుబడిదార్లు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్వెస్టర్ల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడే టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. NSDL, తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ఈ నెలలోనే (మార్చి 2025) ప్రారంభించవచ్చు. వార్తా సంస్థ PTI ఈ విషయాన్ని వెల్లడించింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా, NSDL స్టాక్ మార్కెట్ నుంచి రూ. 3,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఆమోదం పొందడానికి సిద్ధమవుతున్న NSDL
IPOను లాంచ్ చేయడానికి ముందు, NSDL, తన ముసాయిదా పత్రాలకు 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) నుంచి ఆమోదం పొందడం సహా అనేక నియంత్రణ పరమైన ఆమోదాలను పొందవలసి ఉంటుంది. కంపెనీకి ఆమోదం లభించడానికి కొంత సమయం ఉందని ఒక సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు. ఈ గడువు మార్చిలో ముగియనుంది.
రాబోయే IPO వివరాల గురించి ప్రశ్నించినప్పుడు, "కంపెనీకి మార్చి వరకు సమయం ఉందని, ఐపీవో పనిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నామని, మార్చి నెల ముగియడానికి ముందే IPOను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు" సీనియర్ అధికారి వెల్లడించినట్లు PTI రిపోర్ట్ చేసింది.
NSDL ఏం చేస్తుంది?
NSDL భారతదేశంలో అతి పెద్ద & పాత డిపాజిటరీ కంపెనీ. ఈ సంస్థ పెట్టుబడిదారుల వాటాలు & ఇతర సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరుస్తుంది. ఈ కంపెనీని 1996లో స్థాపించారు, ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది. దేశంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ సర్వీస్‌ను అందించిన మొట్టమొదటి డిపాజిటరీ ఇది. ఈ డిపాజిటరీ ఎక్కువగా డీమ్యాట్ ఖాతాలను నిర్వహిస్తుంది. మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్ (MII)గా సెబీ (SEBI) ఆమోదం పొందింది.
పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ IPO
రాబోయే ఐపీవో ద్వారా, NSDL చాలా పెద్ద మొత్తంలో వాటాలను విక్రయిస్తుందని PTI రిపోర్ట్ పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్ కూడా ఈ ఇష్యూలో 5.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నాయి. ఈ IPO పూర్తిగా OFS (ఓపెన్ ఫర్ సేల్)లో వస్తోంది. అంటే, NSDLలో ఇప్పటికే ఉన్న పెట్టుబడిదార్లు తమ వాటాలను అమ్ముతున్నారు గానీ, ఈ కంపెనీ ఒక్క కొత్త షేర్‌ను కూడా జారీ చేయడం లేదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.