Zomato Will Now Be Eternal Ltd: ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా ఇంటి వద్దకు ఆహారం తెప్పించుకోకపోయినా, జొమాటో పేరు వినని వ్యక్తి పట్టణాలు, నగరాల్లో దాదాపుగా ఉండడు. అంతలా పాపులర్ అయింది జొమాటో. ఇప్పుడు, ఆ కంపెనీ పేరు మారింది. కార్పొరేట్ పేరును అధికారికంగా "ఎటర్నల్ లిమిటెడ్" (Eternal Ltd)గా మార్చడానికి, జొమాటో లిమిటెడ్, తన షేర్‌హోల్డర్ల నుంచి తుది ఆమోదం పొందింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎటర్నల్ అంటే 'శాశ్వతంగా ఉండేది' అని అర్ధం.
పేరుతో పాటు ఫుడ్ డెలివెరీ సర్వీస్‌లు కూడా మారతాయా?
పేరు మార్పు కార్పొరేట్ సంస్థకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సేంజ్ ఫైలింగ్‌లో ఆ కంపెనీ స్పష్టం చేసింది. జొమాటో బ్రాండ్ పేరు లేదా యాప్ లేదా సర్వీస్‌ల్లో ఎటువంటి మార్పులు ఉండవని వెల్లడించింది.
తన క్విక్ కామర్స్ కంపెనీ బ్లింకిట్ (Zomato's Quick Commerce Company Blinkit) కార్యకలాపాలను వైవిధ్యపరిచే ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుందని, ఫుడ్ డెలివెరీ సర్వీస్ అందరికీ తెలిసిన జొమాటో బ్రాండ్ పేరిటే కొనసాగుతుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
వాస్తవానికి, కంపెనీ పేరు & బ్రాండ్ పేరు ఒకేలా ఉండకూడదని, జొమాటో (ఇప్పుడు ఎటెర్నల్ లిమిటెడ్) సీఈవో దీపిందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) గతంలోనే చెప్పారు. కార్పొరేట్ కంపెనీ పేరు, బ్రాండ్ పేరును వేర్వేరుగా ఉంచుతామన్న మాటను ఇప్పుడు నిజం చేశారు. ఉదాహరణకు.. మనందరికీ తెలిసి తాజ్‌మహల్ టీపొడిలో 'తాజ్‌మహల్' అనేది బ్రాండ్ పేరు. 'హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్'కు చెందిన బ్రాండ్ ఇది. సేమ్ అలాగే, ఎటర్నల్ లిమిటెడ్ అనేది కంపెనీ పేరుగా ఉంటుంది, జొమాటో బ్రాండ్‌తో ఫుడ్ డెలివెరీ సర్వీస్‌లు కొనసాగుతాయి.
ఈ మార్పులో భాగంగా, జొమాటో కార్పొరేట్ వెబ్‌సైట్ zomato.com నుంచి eternal.com కు అప్‌డేట్ అవుతుంది. ఇంకా, కంపెనీ స్టాక్ టిక్కర్ (స్టాక్ పేరు) ZOMATO నుంచి ETERNAL కు మారుతుంది.
పేరు మార్పు వెనుక పెద్ద ప్లాన్
ఈ రీబ్రాండింగ్ అనేది కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాల్లో ఒక భాగం. ఎందుకంటే, ఫుడ్ డెలివరీ సేవలను మించి విస్తరించాలని ఎటర్నల్ ఆలోచిస్తోంది, బ్లింకిట్ తరహాలో మరిన్ని వ్యాపారాలు చేయాలని చూస్తోంది. జొమాటో అంటే కేవలం ఫుడ్ డెలివెరీ మాత్రమే గుర్తుకువస్తుంది కాబట్టి, ఆ పరిమితి నుంచి బయటపడేందుకే కార్పొరేట్ కంపెనీ పేరును మార్చుకుంది. ఎటర్నల్ కింద బ్లింకిట్‌తో పాటు డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్ బ్రాండ్స్ కూడా పని చేస్తున్నాయి.
జొమాటో షేర్ ధర
స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి కారణంగా, ఈ రోజు (సోమవారం, 10 మార్చి 2025) జొమాటో షేర్లు 2.45% పతనమై రూ.211.51 వద్ద క్లోజ్ అయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పాత పద్ధతులు వదిలేయండి, ఈ క్వాలిటీస్ ఉంటే మీ సంపద సరసరా పెరుగుతుంది!