Chase Wealth, Not Profits: సాధారణంగా, మన దేశంలో, ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వ్యక్తిని లైఫ్‌లో గెలిచిన వ్యక్తిగా చూస్తుంటాం. అయితే, ఎక్కువ జీతం తీసుకునే వ్యక్తులు కూడా డబ్బులకు ఇబ్బంది పడుతుంటారు. అంటే, కేవలం ఆదాయం మాత్రమే జీవితంలో విజయానికి గుర్తు కాదు. తక్కువ సంపాదన ఉన్నప్పటికీ కొందరు సంపదను పెంచుకుంటారు, డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది పడరు. మనం ఎంత సంపాదిస్తాం అనేది ముఖ్యం కాదు, డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం & దానిని ఎలా పెంచుతున్నాం అనే దానిలోనే నిజమైన విజయం దాగుంది. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అయినప్పటికీ, ప్రజల్లో పాత ఆర్థిక అలవాట్లు చాలా కొనసాగుతున్నాయి. 50 శాతానికి పైగా భారతీయులు పెట్టుబడుల కోసం సాంప్రదాయ పొదుపు ఖాతాలపైనే ఆధారపడుతున్నారు. వాళ్లంతా, కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఇష్టపడడం లేదు. అలాంటి వ్యక్తులు ఎంత సంపాదించినప్పటికీ, ఆర్థికంగా విజయం సాధించలేరన్నది నిపుణుల మాట.


సంపద ఎలా సృష్టించాలి?


1. డబ్బు మీ కోసం పని చేయాలి
భారతదేశం యొక్క గృహ పొదుపు రేటు GDPలో దాదాపు 18 శాతం, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికం. అయితే, ఈ పొదుపుల్లో ఎక్కువ భాగం తక్కువ రాబడి ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌ (FDs)లో ఉన్నాయి. వీటి రాబడులు ద్రవ్యోల్బణానికి దాదాపుగా సరిపోతాయి. ద్రవ్యోల్బణం సగటున 5-6 శాతం ఉండటంతో, దాదాపుగా అంతే రాబడిని అందించే సాధనాల్లో డబ్బును మదుపు చేయడం తెలివైన పని కాదు. దీనివల్ల మీ డబ్బు విలువ పెరగదు. గత రెండు దశాబ్దాలుగా భారతీయ స్టాక్ మార్కెట్ సగటున 12-15 శాతం వార్షిక రాబడిని అందించిందని, ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ రాబడి. మ్యూచువల్ ఫండ్‌ SIPలు కూడా ప్రజాదరణ పొందాయి, SIP విరాళాలు 2024లో నెలకు సగటున రూ. 17,000 కోట్లు దాటాయి. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినా, అద్దె ఆదాయం అయినా, బంగారం & బాండ్స్‌ వంటివి కొన్నా.. ఏం చేసినా మీ డబ్బు మీ కోసం పని చేసేలా చూసుకోవాలి.


2. టెక్నాలజీ
భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యత ఒక ప్రధాన సవాల్‌. వయోజనుల్లో కేవలం 27 శాతం మంది మాత్రమే ఆర్థిక అక్షరాస్యుల కేటగిరీలో ఉన్నారు. సాంకేతికత, ఆర్థిక జ్ఞానాన్ని గతంలో కంటే ఇప్పుడు మరింత అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు వ్యక్తిగతంగా పెట్టుబడి చిట్కాలను అందిస్తున్నాయి, కేటాయింపులను ఆటోమేటిక్‌గా మార్చి & గరిష్టంగా సంపాదించేలా పొదుపు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఇలాంటి కొత్తదనాన్ని నిరంతరం నేర్చుకుని, వాటికి అనుగుణంగా మారేవాళ్లు సంపద సృష్టిలో ఎప్పుడూ ముందుంటారని చరిత్ర నిరూపించింది.


3. రిస్క్ తీసుకోవడానికి భయపడవద్దు
ఎందుకోగానీ, భారతదేశ ఆర్థిక సంస్కృతిలో రిస్క్ తీసుకోవడంపై విముఖత ఎక్కువగా ఉంటుంది. భారతీయులకు చెందిన 60 శాతానికి పైగా కుటుంబ ఆస్తులు రియల్ ఎస్టేట్‌లో & బంగారంలో లాక్ అయ్యాయి. ఇవి 'సురక్షితమైన పెట్టుబడులు', రిస్కీ అసెట్స్‌ కాదు. ఈ ఆస్తులు స్థిరత్వాన్ని అందిస్తాయి తప్ప ఊహించని లాభాలను అందించలేవు. సంపద పెంచుకోవాలంటే రిస్క్‌ తీసుకోవాలి, దానిని వ్యూహాత్మకంగా నిర్వహించాలి. ఈ విషయంలో.. AI-ఆధారిత ఆర్థిక సాధనాలు రిస్క్‌ను చక్కగా అంచనా వేయడానికి, మార్కెట్ ట్రెండ్‌లను అర్ధం చేసుకోడానికి, పోర్ట్‌ఫోలియోలను బ్యాలెన్స్‌ చేయడానికి సహాయపడతాయి.


4. పాసివ్‌ ఇన్‌కమ్‌ చాలా కీలకం
జీతం ఆదాయంపై మాత్రమే ఆధారపడినంత కాలం సంపద వృద్ధి కాదు. భారతదేశ గిగ్ ఎకానమీ, డిజిటల్ వ్యవస్థలు కొత్త ఆదాయాల ఉత్పత్తికి తలుపులు తెరిచాయి. ఇలాంటి ఆదాయ మార్గాల్లోకి అడుగు పెడితే మీ ఆర్థిక స్వేచ్ఛకు రెక్కలు వస్తాయి. డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌, అద్దె ఇచ్చే ఆస్తులు, REITలు (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు), డిజిటల్ ఆస్తులు వంటివి మీరు నిద్రపోతున్నప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాయి, మీ కోసం డబ్బు సంపాదిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు, మన దేశంలో డివిడెండ్ చెల్లించే కంపెనీలు ఏటా 2-4 శాతం సగటు రాబడి అందించాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అద్దె రాబడి ఏటా 2-3 శాతం పెరుగుతోంది. 


5. లాభాల కోసం కాదు, సంపద కోసం పాకులాడండి
భారతదేశంలో ఏటా కోట్ల కొద్దీ కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్‌ అవుతున్నాయి. ప్రజలకు పెట్టుబడులపై పెరుగుతున్న ఆకాంక్షలను ఇది సూచిస్తుంది. సంపద సృష్టి అంటే షార్ట్‌టర్మ్‌ లాభాల కోసం షార్ట్‌కట్స్‌ వెతుక్కోవడం కాదు. పెట్టుబడులు మనకు అనుకూలంగా పని చేసేలా చూసుకోవాలి, చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందుకోవాలి. నిఫ్టీ50లో షార్ట్‌టర్మ్‌ లాస్‌లు చాలా ఉన్నప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా సగటున 12-15 శాతం వార్షిక రాబడిని అందించింది. మార్కెట్ హెచ్చుతగ్గులు అనివార్యం. కానీ, దీర్ఘకాలికంగా పెట్టుబడులతోనే సంపద సృష్టి జరుగుతుంది. కాలక్రమేణా మార్కెట్లు కోలుకుంటాయి, చక్రవడ్డీ రాబడితో మ్యాజిక్‌ చేస్తాయి. క్రమశిక్షణ గల దీర్ఘకాలిక పెట్టుబడిదారులు సంపద పెరుగుదల ఫలాలను అనుభవిస్తారు. 


అంతిమంగా.. 
సంపదను పెంచుకోవడం అంటే కఠినమైన, పాత ఫైనాన్షియల్‌ రూల్స్‌ను పాటించడం కాదు. ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన విధానాలు మారడం కూడా ముఖ్యం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఫుల్‌ ఛార్జ్‌తో వస్తున్న ఏథర్ ఎనర్జీ IPO - ఇంకా ఒక్క నెలే టైమ్‌ ఉంది