Ather Energy IPO May Launch in April 2025: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మరో కంపెనీ మార్కెట్‌లో అదృష్టం పరీక్షించుకునేందుకు ఉత్సాహపడుతోంది. ఓలా ఎలక్ట్రిక్ IPO ‍‌(Initial Public Offering) తర్వాత, ఇప్పుడు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ లిమిటెడ్' కూడా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ కోసం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఏథర్ ఎనర్జీ తన IPOను వచ్చే నెలలో, అంటే ఏప్రిల్ 2025లో ప్రారంభించవచ్చు. IPOను ప్రారంభించే దిశగా, కంపెనీ తన బకాయి ఉన్న 'కంపల్సరీలీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్‌'ను (CCPS) ఈక్విటీలుగా మార్చాలని నిర్ణయించింది. IPOను తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగు ఇది.


డైరెక్టర్ల బోర్డు ఆమోదం
మర్చంట్ బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం, CCPSను ఈక్విటీలుగా మార్చడం అంటే IPOను ప్రకటించేందుకు కంపెనీ సిద్ధం అవుతోందని అర్ధం. 'రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్' (RoC) వద్ద దాఖలు చేసిన పత్రాల ప్రకారం, కంపెనీ డైరెక్టర్ల బోర్డు మార్చి 8, 2025న ఒక తీర్మానాన్ని ఆమోదించింది, 1.73 కోట్లకు పైగా బకాయి ఉన్న  'కంపల్సరీలీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్స్‌'ను 24.04 కోట్ల 'ఫుల్లీ పెయిడప్‌ ఈక్విటీ షేర్స్‌' ‍‌(Fully paid up equity shares)గా మార్చడానికి ఆమోదం తెలిపింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఈ షేర్లు ప్రస్తుత ఈక్విటీ షేర్లకు సమానంగా ఉంటాయి. 


2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో..
'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) జారీ చేసిన 'ఇష్యూ ఆఫ్‌ క్యాపిటల్‌ అండ్‌ డిస్‌క్లోజర్‌ రిక్వైర్‌మెంట్స్‌' (ICDR) నిబంధనల ప్రకారం, డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను (RHP) దాఖలు చేయడానికి ముందు అన్ని CCPSలను ఈక్విటీగా మార్చాలి. ఏథర్ ఎనర్జీ బోర్డ్‌ తీసుకున్న తాజా నిర్ణయం, ఈ కంపెనీ IPO వైపు వేగంగా కదులుతోందని సూచిస్తుంది. మార్కెట్‌ వర్గాల సమాచారాన్ని బట్టి, ఏథర్ ఎనర్జీ IPO, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే మొదటి IPOల్లో ఒకటి కావచ్చు. 


మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి & రుణాన్ని తగ్గించేందుకు నిధులను సేకరించడానికి ఏథర్ ఎనర్జీ లిమిటెడ్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో ఐపీవో ముసాయిదా పత్రాలు (DRHP) దాఖలు చేసింది. ఆ పేపర్ల ప్రకారం, ఈ IPOను రూ. 3,100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ప్రమోటర్లు & ప్రస్తుత పెట్టుబడిదారులు 'ఆఫర్ ఫర్‌ సేల్‌' (OFS) ద్వారా 2.2 కోట్ల వరకు షేర్లను జారీ చేస్తారు. 


గత ఏడాది ఆగస్టులో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ.6,145 కోట్ల సైజ్‌తో ఐపీఓను ప్రారంభించింది. ఓలా ఎలక్ట్రిక్ IPOలో రూ.5,500 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేశారు, 8,49,41,997 OFS ఈక్విటీ షేర్లు ఉన్నాయి. దాని తర్వాత, ఈ సెగ్మెంట్‌లో IPOకు రాబోతున్న రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఇది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: దిగిరానున్న ధరలు, తగ్గనున్న పన్ను మోతలు! - తీపికబురు చెప్పిన నిర్మలమ్మ