Insurance Policies: ఇక నుంచి బీమా పాలసీల పత్రాలన్నీ డిజిటల్‌ రూపంలోనే మనకు అందనున్నాయి. అంటే, భౌతిక పత్రాలు ఉండబోవు. 


ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), కొత్త బీమా పాలసీల డీమెటీరియలైజేషన్‌ను తప్పనిసరి చేసింది, ఈ ఏడాది డిసెంబర్ వరకు గడువు విధించింది. ప్రస్తుతం ఉన్న భౌతిక పత్రాలన్నింటినీ ఈ ఏడాది చివరిలోగా డిజిటల్‌ రూపంలోకి మార్చుకోవాలి. కొత్తగా తీసుకునే పాలసీల పత్రాలన్నీ డిజిటల్‌ రూపంలో, అంటే డీమ్యాట్‌ ఖాతాలో జమ అవుతాయి. ఇప్పటికే ఉన్న పాత పాలసీలను కూడా బీమా కంపెనీలు డీమెటీరియలైజ్ చేస్తాయి.


డీమెటీరియలైజేషన్ అంటే భౌతిక పత్రాన్ని ఆన్‌లైన్‌లోకి మార్చడం. దీనివల్ల పేపర్‌ వర్క్‌ ఉండదు. లావాదేవీ ఖర్చులు తగ్గించడం ద్వారా ప్రీమియం మొత్తాన్ని ఎంతో కొంత తగ్గించడం, పత్రాల కోసం పాలసీదారులు వేచిచూసే కాలాన్ని తగ్గించడం, నకిలీ భౌతిక పత్రాలను నివారించడం ఈ మార్పు లక్ష్యం. అంతేకాదు, ఒకవేళ పాలసీదారులు తమ పత్రాలను పోగొట్టుకుంటే, కొత్త వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఇకపై ఉండదు.


డీమ్యాట్‌ ఖాతాకు లింక్‌


ఇప్పటికే పాలసీలు తీసుకున్నవాళ్లు, కొత్తగా పాలసీలు తీసుకునే వాళ్లు డీమ్యాట్‌ అకౌంట్‌ తీసుకోవాల్సి (ఇప్పటివరకు లేకపోతే) ఉంటుంది. ఆ డీమ్యాట్‌ ఖాతాల్లోకి పాలసీ పత్రాలను డిజిటల్‌ రూపంలో సదరు బీమా సంస్థలు జమ చేస్తాయి.


నవంబర్ 1 నుంచి, అన్ని బీమా పాలసీలకు ఈ-కేవైసీ (eKYC) కూడా తప్పనిసరి అవుతుంది. బీమా పాలసీలను డీమెటీరియలైజ్ చేయడంలో ఈ-కేవైసీ ద్వారా సులభమవుతుంది. పాలసీ కొనుగోలుదారులు తమ పాన్‌, ఆధార్‌ వివరాలను సమర్పించి, ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. తద్వారా, డీమ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడం, తీసుకున్న బీమా పాలసీ పత్రాలను ఆ ఖాతాల్లోకి జమ చేయడం సులభమవుతుంది.


నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (CDSL) ద్వారా డీమ్యాట్‌ ఖాతాలను తెరవవచ్చు, బీమా పాలసీలను డీమాట్రియలైజ్ చేసుకోవచ్చు. ఒకరికి ఒక డీమ్యాట్‌ అకౌంట్‌ అకౌంట్‌ సరిపోతుంది. ఎన్ని పాలసీలు తీసుకున్నా, వాటన్నింటినీ ఆ ఖాతాలోకి బీమా సంస్థలు అప్‌లోడ్‌ చేస్తాయి.


అంతేకాదు, ఆరోగ్య బీమా, వాహన బీమా, జీవిత బీమా ఇలా ఒక వ్యక్తికి చెందిన వివిధ రకాల బీమా పాలసీలన్నీ ఒకే డీమ్యాట్‌ ఖాతాలో కనిపిస్తాయి. ఒక వ్యక్తికి ఎక్కువ పాలసీలు ఉండి, వాటిలో కొన్నింటి వివరాలను మరిచిపోయినా ఇకపై పర్లేదు. తన డీమ్యాట్‌ అకౌంట్‌లో చూసుకుంటే, అన్ని రకాల పాలసీలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి.


నాలుగు బీమా రిపోజిటరీలు


eIA (ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్) తెరవాలనే లక్ష్యంతో బీమా రిపోజిటరీలను ఏర్పాటు చేసారు. ఇవి, కస్టమర్‌కు చెందిన అన్ని బీమా పాలసీలకు రిపోజిటరీగా పని చేస్తాయి. ప్రస్తుతం, నాలుగు బీమా రిపోజిటరీలు ఉన్నాయి. అవి.. NSDL, CDSL, కార్వీ ఇన్సూరెన్స్ రిపోజిటరీ లిమిటెడ్ ‍(Karvy Insurance Repository Ltd‌), క్యామ్స్‌ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ ‍‌(CAMS Insurance Repository Services Ltd). వీటి ద్వారా మన పాలసీలను డిజిటల్‌ రూపంలోకి మార్చుకుని, డీమ్యాట్‌ ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చు.


ఏడేళ్ల క్రితమే బీమా రెగ్యులేటర్ ఈ ప్రయత్నాన్ని చేపట్టినా, ఫైనల్‌ స్టేజ్‌కు ఇన్ని సంవత్సరాలు పట్టింది.


ఖాతాదారు కొన్న షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లను పత్రాల రూపం నుంచి ఇప్పటికే తీసేశారు. వాటన్నింటినీ డీమ్యాట్‌ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. షేర్లను కొన్నా, అమ్మినా అవి డీమ్యాట్‌ ఖాతాలోకి వస్తాయి లేదా తగ్గుతాయి. బీమా పాలసీల డీమెటీరియలైజేషన్ కూడా ఇలాంటిదే. కాకపోతే, షేర్ల తరహాలో కొనుగోలు, అమ్మకం లావాదేవీలకు వీలుండదు. కస్టమర్లు, వారి బీమా పాలసీలన్నింటినీ చూసుకోవడానికి మాత్రమే వీలవుతుంది.