Stock Market News: హై ఫ్రీక్వెన్సీ ఇండికేషన్స్‌తో, FY23లో ఇప్పటివరకు, భారతీయ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని స్టాక్ మార్కెట్లు డీలా పడితే, ఇండియన్ స్టాక్ మార్కెట్ల హ్యాండ్ రైజింగ్ ఉంది. ఈ నేపథ్యంలో, దేశీయ బ్రోకరేజ్ & పరిశోధన సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ (Axis Securities) ఆరు స్టాక్స్‌ను టాప్ పిక్స్‌గా సూచించింది. బలమైన పండుగ డిమాండ్ నుంచి లబ్ధి పొందేందుకు ఈ ఆరు స్టాక్స్ మంచి స్థానంలో కాచుకుని ఉన్నాయని అంటోంది.
మారుతి సుజుకి (Maruti Suzuki): ప్రస్తుతమున్న ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేయడం, కమొడిటీ ద్రవ్యోల్బణం తగ్గడం, ECUల (ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్) కొరత తగ్గడం, మార్జిన్లలో రికవరీతోపాటు కొత్త లాంచ్‌ల నుంచి డిమాండ్ పెరుగుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ వాహనాల రూపంలో కంపెనీ తన మార్కెట్ వాటాను మరింత పెంచుకుంటుందని యాక్సిస్ సెక్యూరిటీస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఉన్న ఆర్డర్ బుక్‌ను బట్టి, H2FY23 నుంచి కంపెనీ వాల్యూమ్స్‌లో బలమైన వృద్ధి ఉంటుందని భావిస్తోంది. ఈ బ్రోకరేజ్, మారుతి సుజుకి షేరుకు 'బయ్' రేటింగ్‌తో, ₹9,801 టార్గెట్ ధరను ఇచ్చింది.
బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance): కంపెనీ వేస్తున్న డిజిటల్ అడుగులు, కాలానుగుణంగా వ్యాపారంలో చేస్తున్న మార్పులు ఈ కంపెనీకి కీలక సానుకూలాంశాలుగా యాక్సిస్ సెక్యూరిటీస్ వెల్లడించింది. అన్ని మెట్రిక్స్‌లో QoQలో మెరుగుదలతో చక్కగా పురోగమిస్తోందని తెలిపింది. ఈ స్టాక్‌కు బయ్ ట్యాగ్‌ను తగిచింది, ₹8,250 టార్గెట్ ధరను ఇచ్చింది.
ఎస్‌బీఐ కార్డ్స్ (SBI Cards): వ్యాపారం బలంగా ఊపందుకోవడం, నికర వడ్డీ మార్జిన్లు (NIM) మెరుగుపడడం, క్రెడిట్ ఖర్చులు తగ్గడం వల్ల మీడియం టర్మ్‌లో 6-6.3% RoA, /27-28% RoEని SBIC సాధించగలదట. UPIతో రుపే (RuPay) క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడం మీద RBI తెచ్చిన ప్రతిపాదన మొత్తం క్రెడిట్ కార్డ్ పరిశ్రమకు సానుకూలంగా ఉంది. దీనివల్ల UPI మర్చంట్లు క్రెడిట్ కార్డ్‌లను అంగీకరించడం మరింత పెరుగుతుంది. 1 మిలియన్ పైగా రూపే కార్డులతో, ఆర్‌బీఐ ప్రతిపాదన నుంచి SBIC ప్రధాన లబ్ధిదారుగా మారుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. బయ్ చేయమని చెబుతూ, ₹1,050 టార్గెట్ ధరను పేర్కొంది.
ట్రెంట్ (Trent): స్టోర్ మెట్రిక్స్ సూపర్‌గా ఉండడం, సప్లయ్ చైన్ ఆప్టిమైజేషన్, వ్యయాల తగ్గింపు మీద శ్రద్ధ, దూకుడుగా స్టోర్ల విస్తరణ, ప్రైవేట్ బ్రాండ్ల నుండి హయ్యర్ కాంట్రిబ్యూషన్, వాల్యూ స్పేస్‌లో వినూత్న ఆఫర్లు దీర్ఘకాలంలో వృద్ధికి కీలకమైనవని బ్రోకరేజ్ చెప్పింది. ₹1,530 లక్ష్యంతో స్టాక్ మీద బయ్ రేటింగ్ కంటిన్యూ చేసింది.
రిలాక్సో (Relaxo): గ్రామీణ, చిన్న పట్టణాల్లోని చిన్న, అసంఘటిత ప్లేయర్ల నుంచి మార్కెట్ వాటాను పొందడం, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన 'వాల్యూ ఫర్ మనీ' ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగడం, పెద్ద పండుగ సీజన్, ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల జోడింపు వల్ల బ్రోకరేజీ ఈ స్టాక్ మీద సానుకూలంగా ఉంది. ₹1120 టార్గెట్ ధరతో బయ్ సిఫార్సు చేసింది.
వి మార్ట్ (V-mart): పండుగ సీజన్ నేపథ్యంలో, వి మార్ట్ వంటి వాల్యూ ప్లేయర్ల ఆదాయాలు, లాభదాయకత మెరుగుపడతాయని యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్వసించింది. రిలాక్సో తరహాలోనే గ్రామీణ, చిన్న పట్టణాల్లోని చిన్న, అసంఘటిత ప్లేయర్ల నుంచి మార్కెట్ వాటాను పొందుతుందని అంటోంది. స్టాక్ మీద బయ్ రేటింగ్‌తో ₹3,350 టార్గెట్ ధరను ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.